Share News

Bandi Sanjay: కేసీఆర్‌పై అనర్హత వేటేయాలి..

ABN , Publish Date - May 28 , 2024 | 03:21 AM

ఫోన్‌ ట్యాపింగ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్షాలపై సైబర్‌ దాడి జరిగిందని విమర్శించారు.

Bandi Sanjay: కేసీఆర్‌పై అనర్హత వేటేయాలి..

  • వీలైతే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలి

  • ఫోన్‌ ట్యాపింగ్‌తో ప్రతిపక్షాలపై సైబర్‌ దాడి

  • రాధాకిషన్‌ వాంగ్మూలమే ఇందుకు నిదర్శనం

  • కేసీఆర్‌ను ఇంకా ఎందుకు అరెస్టు చేయట్లే?

  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి

హైదరాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ ట్యాపింగ్‌లో బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను ఎందుకు అరెస్ట్‌ చేయట్లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ప్రతిపక్షాలపై సైబర్‌ దాడి జరిగిందని విమర్శించారు. తక్షణమే కేసీఆర్‌ను అరెస్ట్‌ చేసి, విచారణ చేపట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ‘‘ఇది ముమ్మాటికీ రాజ్యాంగ ద్రోహమే. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. కేసీఆర్‌లాంటి దుర్మార్గులు ఎమ్మెల్యేగానే కాదు.. భవిష్యత్తులో రాజ్యాంగబద్ధంగా ఏ పదవి చేపట్టడానికీ అర్హులు కాదు. తక్షణమే ఆయనపై అనర్హత వేటు వేయాలి. మళ్లీ ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించాలి.


కేటీఆర్‌ సహా పలువురు బీఆర్‌ఎస్‌ నేతలు కూడా ఫోన్‌ ట్యాపింగ్‌ పాపంలో భాగం పంచుకున్నందున వీలైతే బీఆర్‌ఎస్‌ పార్టీ గుర్తింపును సైతం రద్దు చేసే అంశంపై ఆలోచించాలి’’ అని అభిప్రాయపడ్డారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నట్లు తెలిసినా.. ఎందుకు ఆయ న్ను భారత్‌కు రప్పించలేకపోతున్నారని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘‘ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో నేను గతంలో చెప్పిందే నిజమైంది. కేసీఆర్‌ ఆదేశాల మేరకే ఫోన్‌ ట్యాపింగ్‌ చేసినట్లు రాధాకిషన్‌ రావు పోలీసుల విచారణలో వెల్లడించడమే ఇందుకు నిదర్శనం.


ముఖ్యంగా బీజేపీపై దాడి కోసమే ఫోన్‌ ట్యాపింగ్‌ను ఉపయోగించుకున్నట్లు అర్థమవుతోందని పేర్కొన్నారు. బీజేపీ సానుభూతిపరులతోపాటు పార్టీకి విరాళాలు ఇచ్చేవాళ్లను, మీడియా ప్రతినిధులను సైతం ఫోన్‌ ట్యాపింగ్‌తో టార్గెట్‌ చేశారంటే కేసీఆర్‌కు ఎంతగా వణుకు పుట్టిందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. లిక్కర్‌ కేసులో అడ్డంగా దొరికిన బిడ్డను కాపాడుకునేందుకే ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని సృష్టించారని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - May 28 , 2024 | 03:21 AM