Share News

Bhatti Vikramarka: కేంద్ర సెస్సులు, సర్‌చార్జీలను నిరోధించాలి

ABN , Publish Date - Sep 13 , 2024 | 03:49 AM

కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లు, సర్‌చార్జీల వల్ల రాష్ట్రాల పన్నుల వాటా నిధుల్లో కోత పడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు.

Bhatti Vikramarka: కేంద్ర సెస్సులు, సర్‌చార్జీలను నిరోధించాలి

  • లేదంటే వాటిలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలి.. పన్నుల వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలి

  • బీజేపీయేతర రాష్ట్రాల మంత్రుల భేటీలో డిప్యూటీ సీఎం భట్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న సెస్‌లు, సర్‌చార్జీల వల్ల రాష్ట్రాల పన్నుల వాటా నిధుల్లో కోత పడుతోందని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సెస్‌లు, సర్‌చార్జీలను నిరోధించాలని లేదంటే వాటిలోనూ రాష్ట్రాలకు వాటా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. దేశంలోని ఐదు బీజేపీయేతర రాష్ట్రాలైన తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్‌ ఆర్థిక మంత్రుల సమావేశం గురువారం కేరళలోని తిరువనంతపురంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న భట్టివిక్రమార్క.. పన్నుల వాటా విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు.


కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు ఇచ్చే నిధులను 14వ ఆర్థిక సంఘం 32 నుంచి 42 శాతానికి పెంచిందని, 15వ ఆర్థిక సంఘం దాన్ని 41 శాతానికి కుదించిందని తెలిపారు. ఈ 41 శాతం నిధులు కూడా రాష్ట్రాలకు రావడం లేదని, కేవలం 31 శాతం నిధులు మాత్రమే అందుతున్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సెస్‌లు, సర్‌చార్జీలను వసూలు చేస్తుండడంతో పన్నుల వాటా తగ్గుతుందని అన్నారు. వీటిని కూడా రాష్ట్రాలకు పంచాలని అడుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలు కేంద్ర జీడీపీకి 30 శాతం భాగస్వామ్యాన్ని అందిస్తున్నాయని, దేశ జనాభాలో 19.6 శాతం జనాభా ఈ రాష్ట్రాల్లోనే ఉందని తెలిపారు. కానీ, ఈ రాష్ట్రాలకు పన్నుల్లో వాటా నిధులు 21.07 శాతం నుంచి 15.80 శాతానికి తగ్గిపోయాయని చెప్పారు.


వస్తు సేవల పన్ను (జీఎస్టీ) కింద రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వడం లేదని, పర్యవసానంగా రాష్ట్రాలు ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడంలో ఇబ్బంది పడాల్సి వస్తోందని అన్నారు. కేంద్ర ప్రాయోజిత పథకాల(సీఎస్‌ఎస్‌)లో కఠినమైన నిబంధనలున్నాయని, వాటికి రాష్ట్రాలు మ్యాచింగ్‌ గ్రాంట్‌ను విడుదల చేయాల్సి వస్తుండడంతో ఆర్థిక భారం పడుతుందని చెప్పారు. ఇలా సీఎస్‌ఎస్‌ల కోసం రాష్ట్ర సొంత వనరులను మళ్లించాల్సి వస్తుండడంతో ఇతర ముఖ్యమైన రాష్ట్ర పథకాలకు నిధుల కొరత ఏర్పడుతుందన్నారు. రాష్ట్రాలకు నికరంగా వచ్చే పన్నుల వాటా నిధులను తగ్గిస్తూ.. మరోవైపు రాష్ట్రాలకు సరిగా ఉపయోగపడని సీఎస్‌ఎస్‌లకు కేంద్ర ప్రభుత్వం నిధులను పెంచుతోందని ఆరోపించారు. ఇప్పటికే దేశ ద్రవ్యలోటు జీడీపీలో 5.6 శాతానికి పెరిగిందన్నారు. ద్రవ్య బాధ్యతను పాటిస్తున్న రాష్ట్రాలకు ఒక నీతి, ద్రవ్యలోటు పెరుగుతున్నా యథేచ్ఛగా రుణాలు తీసుకునే కేంద్రానికి మరో నీతా అని ప్రశ్నించారు.

ఇవీ రాష్ట్ర డిమాండ్లు..

  • కేంద్ర ప్రభుత్వ సెస్సులు, సర్‌చార్జీలను నిరోధించాలి.

  • కేంద్ర పన్నుల్లో వాటాను 41 నుంచి 50 శాతానికి పెంచాలి.

  • ద్రవ్య బాధ్యత పాటించే రాష్ట్రాలు ఎక్కువ రుణాలు తీసుకునేలా స్వయంప్రతిపత్తిని కల్పించాలి.

  • డీలిమిటేషన్‌ ప్రక్రియలో దక్షిణాది రాష్ట్రాలకు లోక్‌సభ సీట్లు పెరిగేలా చూడాలి.

  • కేంద్రప్రాయోజిత పథకాలను రాష్ట్రాలు తమ అవసరాలకు తగ్గట్టు వినియోగించుకునే అవకాశమివ్వాలి.

Updated Date - Sep 13 , 2024 | 03:49 AM