Share News

Kavitha: జైల్లో జపం చేసుకుంటా!

ABN , Publish Date - Apr 02 , 2024 | 05:22 AM

ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకుగాను తనకు జపమాల కావాలని రౌస్‌

Kavitha: జైల్లో జపం చేసుకుంటా!

  • ప్రత్యేక జపమాల కావాలన్న ఎమ్మెల్సీ కవిత

  • నడకకు స్పోర్ట్స్‌ షూ.. పుస్తకాలు కూడా

  • బెయిల్‌పై వాదనలు.. విచారణ ఎల్లుండికి వాయిదా

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam) తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అక్కడ జపం చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకుగాను తనకు జపమాల కావాలని రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఆమె విజ్ఞప్తి చేశారు. మెడిటేషన్‌కు అనుమతి కోరారు. అలాగే స్పోర్ట్స్‌ షూ, పుస్తకాలు, పెన్నులు, పరుపు, దుప్పట్లు కావాలనీ కోరారు. ఇంటి నుంచి ఆహారానికి అనుమతించాలనీ కోరారు. ఈ మేరకు కవిత తరఫున ఆమె న్యాయవాది నితేశ్‌ రాణా సోమవారం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజాను అభ్యర్థించారు. మార్చి 26న ఇచ్చిన ఉత్తర్వుల్లో ఏ ఒక్కటీ అనుమతించలేదని కవిత తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చారు. అయితే కోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న అన్నింటినీ తెచ్చుకునేందుకు అనుమతించినట్లు జైలు సూపరింటెండెంట్‌ న్యాయస్థానానికి తెలిపారు. స్పందించిన కోర్టు, మరోసారి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేసింది. కవిత కోరినట్లుగా జపమాల సహా అన్ని వస్తువులను అనుమతించింది. కొన్నింటిని స్వయంగా సమకూర్చుకునేందుకు అనుమతించింది. గతంలో కోరిన మేరకు ఆభరణాలు ధరించేందుకు అనుమతించింది. లేసులు లేని బూట్లకు అనుమతించాలని ఆదేశాలు జారీ చేసింది.

బీఆర్‌ఎస్‌ కోసం స్పెషల్‌ టాస్క్‌!

కాగా కవితకు బెయిల్‌ ఇవ్వాలని ప్రముఖ న్యాయవాది అభిషేక్‌ సింఘ్వీతో పాటు నితేశ్‌ రాణా వాదనలు వినిపించారు. ఆ తర్వాత న్యాయమూర్తి విచారణను 4వ తేదీకి వాయిదా వేశారు. మద్యం విధానం కుంభకోణంలో కవితకు వ్యతిరేకంగా ఈడీ పక్షపాత బుద్ధితో, దురుద్దేశపూరితంగా వ్యవహరిస్తోందని, ఒక దర్యాప్తు ఏజెన్సీగా కాకుండా శిక్షించే సంస్థగా చర్యలు తీసుకుంటోందని అభిషేక్‌ సింఘ్వీ వాదించారు. ఈ కేసులో ఈడీ పిల్లి, ఎలుకలాగా ఆటలాడుతోందని పేర్కొన్నారు. ప్రతిరోజు సమన్లు పంపకుండా ఈడీ సంతోషించలేకపోతోందని పేర్కొన్నారు. అసలు ఈ కేసులో కవితను అరెస్టు చేయాల్సిన అవసరమే లేదని వాదించారు. కేసులో నిందితుడైన అరుణ్‌ పిళ్లై, ఈడీ ముందు తొలుత తొమ్మిదిసార్లు ప్రకటనలు చేశారని, అందులో కవిత పేరే లేదని, పదో ప్రకటనలో కవిత పేరు వెల్లడించినా మళ్లీ దాన్ని వెనక్కు తీసుకున్నారని గుర్తు చేశారు. ఛార్జిషీట్లలో కవిత పేరు ప్రస్తావించలేదని కూడా తెలిపారు. తనను వేధిస్తారని తెలిసినప్పటికీ ఈడీ ఎదుట కవిత హాజరై సహకరించారని చెప్పారు. ఒకేరోజు పలు సమన్లు జారీశారని, ఇలా చేయడం ఉద్దేశపూర్వక వేధింపులు కాక మరేమిటి? అని ప్రశ్నించారు. ఈడీ ఒక సర్వశక్తివంతమైన సంస్థగా మారిందని, ఈడీ అధికారులు న్యాయస్థానాలకేకాక దేశానికి, రాజ్యాంగానికి కూడా అతీతులుగా మారారని విమర్శించారు. కవిత పట్ల ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టబోమని సుప్రీంకోర్టుకు ఇచ్చిన అండర్‌ టేకింగ్‌ను కూడా ఈడీ ఉల్లంఘించిందని, ఇది సరైంది కాదని చెప్పారు. కోర్టుకిచ్చిన అండర్‌ టేకింగ్‌ను వెనక్కు తీసుకుంటున్నట్లు మార్చి 15న చెప్పారని, కోర్టు అనుమతించకపోయినప్పటికీ గంటలోపు కవిత ఇంటికి వచ్చి అరెస్టు చేశారని తెలిపారు. కాగా, సింఘ్వీ వాదనలు విచిత్రంగా ఉన్నాయని ఈడీ తరపు న్యాయవాది జోహెబ్‌ హుస్సేన్‌ పేర్కొన్నారు. అసలు కవితకు మధ్యంతర బెయిల్‌ కావాలో.. రెగ్యులర్‌ బెయిల్‌ కావాలో తేల్చుకోవాలన్నారు. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం వాదిస్తూ మధ్యంతర ఊరట కోరకూడదని, ఏదో ఒకదానికి పరిమితం కావాలని అన్నారు.

వరంగల్‌ టికెట్‌ కావ్యకే

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి


Updated Date - Apr 02 , 2024 | 07:21 AM