CM Revanth Reddy: కేసీఆర్! ప్రతిపక్ష నేతగా.. నీ డ్యూటీ చెయ్
ABN , Publish Date - Dec 06 , 2024 | 04:00 AM
అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం రాష్ట్రానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హితవు పలికారు.
సభలో విపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం మంచిది కాదు
అధికార, ప్రతిపక్షాలంటే భారత్, పాకిస్థాన్‌లా ఉంది!
ఇరు పక్షాలనూ శత్రు సైనికుల్లా మార్చింది కేసీఆరే
ఇకనైనా అసెంబ్లీకి రావాలి.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి
పక్క పిల్లాడి బొమ్మలు విరగ్గొట్టే పిల్లల్లా హరీశ్, కేటీఆర్
కేసీఆర్ వారికి బుద్ధి చెప్పి పెద్దరికం నిలుపుకోవాలి
‘తెలంగాణ తల్లి’ విగ్రహావిష్కరణకు కేసీఆర్‌నూ పిలుస్తాం
ఇందిరమ్మ ఇళ్ల యాప్ ఆవిష్కరణలో సీఎం రేవంత్
కాంగ్రెస్‌తో టచ్‌లో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు!: మహేశ్‌గౌడ్
హస్తం పార్టీలోకి సోయం బాపూరావు, ఆత్రం సక్కు
హైదరాబాద్, డిసెంబరు 5 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కుర్చీ ఖాళీగా ఉండడం రాష్ట్రానికి మంచిది కాదని సీఎం రేవంత్ రెడ్డి.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హితవు పలికారు. గడిచిన పదేళ్లలో రాష్ట్రంలో అధికార, విపక్షాలు అంటే భారత్-పాకిస్థాన్ మాదిరిగా కొట్లాడుకునే వైరి వర్గాల తరహాగా తయారైందని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. శాసనసభ శీతాకాల సమావేశాలకు కేసీఆర్ హాజరై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కోరారు. ప్రజల సమస్యలపై సభలో చర్చ పెట్టాలని.. ఆయన చతురతను, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా పని చేసిన అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వాలని సూచించారు. గురువారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, పొన్నం, జూపల్లి కృష్ణారావులతో కలిసి ‘ఇందిరమ్మ ఇళ్ల యాప్’ను ఆవిష్కరించిన సీఎం.. పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు కల వకుండా చేసింది కేసీఆరేనని.. ఇరు పక్షాలనూ శత్రు దేశ సైనికుల్లా మార్చివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికేౖనా ఆయనలో మానసిక పరివర్తన రావాలని అభిప్రాయపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత వైఎస్.. ఆయన సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు.. ప్రభుత్వానికి నివేదికల రూపంలో అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చేవారని రేవంత్ గుర్తుచేశారు. అంతేకాదు.. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు, తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున జరుగుతున్నప్పుడే ఆయన్ను హరీశ్ కలిశారని.. మరి ఇప్పుడేమైందని ప్రశ్నించారు. ఉమ్మడి ఏపీలో తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మంత్రులను కలిసి కొడంగల్ నియోజకవర్గానికి రూ.వందల కోట్లు తీసుకెళ్లానని పేర్కొన్నారు. తమిళనాడులో రాజకీయ వైరుధ్యాలు ఎన్ని ఉన్నా.. తమ రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మాత్రం పార్టీలకు అతీతంగా నేతలంతా ఏకమవుతారని.. ఇక్కడ కూడా అలానే కావాలని అభిప్రాయపడ్డారు. కేంద్రం నుంచి సాధించాల్సిన అంశాలపై రాష్ట్ర ఎంపీలకు (17 మంది లోక్‌సభ, ఏడుగురు రాజ్యసభ సభ్యులకు) సూచనలు ఇచ్చేందుకు కలిసి రావాలని కేసీఆర్‌ను ఆహ్వానించారు. తాము అభివృద్థి.. సంక్షేమం రెండింటినీ సమతూకం చేసుకుంటూ ముందుకు పోతుంటే కేటీఆర్, హరీశ్ చిన్నపిల్లల్లా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ మండిపడ్డారు. పదేళ్ల కాలంలో బీఆర్‌ఎస్ చేయలేనిది తాము ఏడాదిలోనే చేస్తుంటే.. హోం వర్క్ చేయని పిల్లలు చేసిన పిల్లాడి నోట్సు చింపేసినట్టుగా.. పక్కవాడి చేతిలో ఆట బొమ్మలు విరగొట్టే చిన్నపిల్లల్లా.. వారిద్దరూ ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు. తాము చేస్తున్న అభివృద్థిని, సంక్షేమాన్ని మారీచ, సుబాహుల్లా, రాహుకేతువుల్లా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వయసులో, అనుభవంలో కేసీఆర్ పెద్దవారని, ఆయన పెద్దరికాన్ని నిలుపుకోవాలని, తప్పులు చేస్తున్న తమ పిల్లలకు బుద్ధి చెప్పాలని సూచించారు.
అందర్నీ పిలుస్తాం..
సచివాలయంలో 9వ తేదీన నిర్వహించనున్న తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కేసీఆర్‌నూ ఆహ్వానించనున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. అలాగే.. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంఐఎం, సీపీఐ, ఇతర ప్రతిపక్ష నేతలను కూడా ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉత్సవానికి ప్రతిపక్ష నేతగా వచ్చి కేసీఆర్ తన పెద్దరికాన్ని నిలుపుకోవాలని సూచించారు. 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వహిస్తామని.. తెలంగాణ సంస్కృతికి పట్టం కట్టే కార్యక్రమాలు, పిండి వంటలు, మహిళా సంఘాల స్టాళ్లు అందులో ఉంటాయని చెప్పారు. ఈ ఉత్సవాల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఇస్తున్నది మనమే
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ఆవిష్కరించిన సీఎం.. ఈ పథకం కింద ప్రతి శాసనసభ నియోజకవర్గానికీ 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికీ రూ.5 లక్షలు ఇస్తున్నామని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేశారు. 2004 నుంచి 2014 వరకు.. పదేళ్లపాటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 25.04 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తే.. కేసీఆర్ సర్కారు గడిచిన పదేళ్లలో లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభించి కేవలం 65వేల ఇళ్లను మాత్రమే పూర్తిచేసిందని విమర్శించారు. గత ప్రభుత్వం అసంపూర్తిగా వదిలేసిన 35 వేల ఇళ్లకి సంబంధించి కూడా తమ ప్రభుత్వం రూ.195 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమం కింద మొదటివిడతలో.. సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు మంజూరు చేస్తామని చెప్పారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, పారిశుద్థ్య సిబ్బంది, దళితులు, గిరిజనులు, వితంతువులు, ట్రాన్స్‌జెండర్లకు ఇళ్ల కేటాయింపులో ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. ఇందిరా గాంధీ ప్రధానిగా, ఎన్టీఆర్ సీఎంగా ఉన్న కాలంలో గిరిజనులకు ఇళ్లు కేటాయించారని.. ఆ తర్వాత వారికి ఇళ్ల కేటాయింపు సక్రమంగా జరగలేదన్నారు.
ఈ నేపథ్యంలో తమ ప్రభుత్వం.. ఐటీడీఏల పరిధిలోని నియోజకవర్గాలు, ఆదివాసీ ప్రాంతాల్లోని గిరిజనుల కోసం ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో ప్రత్యేక కోటా ఇస్తుందని వెల్లడించారు. ‘‘నల్లమల చెంచులు.. ఆదిలాబాద్ గోండులు..భద్రాచలం కోయలు.. ఎవరైతే తెలంగాణ మట్టి మనుషులో.. తెలంగాణ మూలపురుషులో.. వారికి ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేకంగా కేటాయిస్తాం’’ అని సీఎం హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం ఎలాంటి నమూనాను సూచించట్లేదన్న ఆయన.. ప్రతి మండల కేంద్రంలో మోడల్ హౌస్‌లు నిర్మిస్తామని, లబ్థిదారులు వాటిని పరిశీలించాలని సూచించారు. లబ్థిదారులు తమ స్థోమతకు తగ్గట్లు అదనపు గదులు నిర్మించుకునే వెసులుబాటు కల్పిస్తున్నట్టు చెప్పారు. అర్హులైన పేదలకు అన్యాయం జరగకూడదనే.. ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తుల పరిశీలనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సైతం వినియోగిస్తున్నామన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రద్దు చేసిన గృహ నిర్మాణ శాఖను పునరుద్ధరించడమే కాక శాఖకు పూర్తిస్థాయి సిబ్బందిని కేటాయించుకుంటున్నామన్న సీఎం.. ఇందిరమ్మ ఇళ్ల కోసం గతంలో తీసుకున్న వారి రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ప్రతి ఒక్కరికీ గూడు అవసరం: డిప్యూటీ సీఎం భట్టి
ఇందిరమ్మ ఇళ్ల యాప్‌ను ఆవిష్కరించిన డిసెంబరు 5.. సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో రూ.5లక్షలతో ఇంటిని నిర్మించుకుంటున్నామంటూ.. లబ్ధిదారులంతా సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు. తాను, రేవంత్‌రెడ్డి పాదయాత్రలు చేసినప్పుడు.. ఆత్మగౌరవంతో బ్రతకడానికి ఇందిరమ్మ ఇల్లు కావాలంటూ ప్రజలు పెద్ద ఎత్తున తమను కోరారని, అందుకే ఇప్పుడు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించుకుంటున్నామని అన్నారు. మొదటి విడతలో రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లను మంజూరు చేయనున్నట్టు చెప్పారు.
నేటి నుంచి గ్రామాలకు అధికారులు: మంత్రి పొంగులేటి
ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క తెలంగాణలోనే 18.56 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని.. కానీ పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం లక్ష ఇళ్లను కూడా నిర్మించలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గత ప్రభుత్వం కేవలం తమ అనుచరులకే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను కేటాయించుకుని, పేదలకు అన్యాయం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో ఇంటికీ రూ.5లక్షల ఆర్ధిక సాయాన్ని నాలుగు దశల్లో అందించనున్నామని తెలిపారు. శుక్రవారం నుంచి ప్రతీ గ్రామానికి అధికారులు వెళ్లి, లబ్ధిదారులను గుర్తిస్తారని చెప్పారు. దరఖాస్తుదారులు ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.