Share News

Hyderabad: వైద్యానికి 5 వేల కోట్లు!

ABN , Publish Date - Sep 16 , 2024 | 04:03 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

Hyderabad: వైద్యానికి 5 వేల కోట్లు!

  • ప్రపంచ బ్యాంకు సాయం కోసం సర్కారు యత్నం?

  • ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్‌ సెంటర్‌

  • డయాలసిస్‌, క్యాన్సర్‌ పరీక్షా కేంద్రాల ఏర్పాటు

  • ఎనిమిది నిమిషాల్లోనే బాధితుల వద్దకు అంబులెన్స్‌

  • టీ డయాగ్నస్టిక్‌ కేంద్రాల బలోపేతంపై ప్రతిపాదనలు

హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ప్రజారోగ్యాన్ని బలోపేతం చేసి, సామాన్య ప్రజలకు ప్రభుత్వ వైద్యాన్ని మరింత చేరువ చేయాలని చూస్తోంది. వైద్యరంగంలో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకోసం ప్రపంచ బ్యాంకు సాయం కోరాలని యోచిస్తోంది. వైద్య, ఆరోగ్య విభాగంలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలకు సుమారు రూ.5 వేల కోట్ల సాయాన్ని పొందేందుకు ప్రతిపాదనలను వైద్య ఆరోగ్యశాఖ సిద్ధం చేస్తోంది. వీటిని తొలుత కేంద్ర ఆరోగ్య శాఖకు పంపుతారు.


ఇప్పటికే అమల్లో ఉన్న పథకాలు, కొత్తగా చేపట్టాలనుకునే పథకాలకు అవసరమైన మానవ వనరులు, ఇతర సౌకర్యాలు ఉంటే కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాష్ట్ర ప్రతిపాదనలను అంగీకరించి.. ప్రపంచ బ్యాంకుకు పంపుతుందని వైద్యవర్గాలు వెల్లడించాయి. ఆ ప్రతిపాదనలకు అనుగుణంగా బ్యాంకు కూడా సాయం అందిస్తుందని తెలిపాయి. ప్రభుత్వ డయాగ్నిస్టిక్‌ కేంద్రాలు మొదులుకొని.. మానవ వనరుల అభివృద్ధి, సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో పరికరాలు వంటి అన్ని రకాల మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా రూ.4,944 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.


  • ప్రతి 30 కిలోమీటర్లకు ఓ ట్రామాకేర్‌ కేంద్రం

వైద్య ఆరోగ్యశాఖ ప్రధానంగా 14 అంశాలపై దృష్టి సారించింది. ట్రామాకేర్‌ సెంటర్లు; డయాలసిస్‌ సెంటర్లు; వాస్క్యులర్‌ యాక్సెస్‌ సెంటర్లు; అత్యవసర సేవలకు గాను సిమ్యులేషన్‌, స్కిల్‌ ల్యాబ్‌లు; ఎమర్జెన్సీ కేర్‌; ఇంటిగ్రేటెడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్‌లు; డయాగ్నస్టిక్‌ సేవల పెంపు; అవయవాల సేకరణ, నిల్వ కేంద్రాలు; ఆరోగ్య మహిళ కార్యక్రమంతో కలిపి ఎంసీహెచ్‌ సర్వీసులు మెరుగుపరచడం; కోక్లియర్‌ ఇంప్లాంట్‌ సెంటర్లు; డ్రగ్‌ డీ అడిక్షన్‌ సెంటర్లు; టిమ్స్‌; సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో పరికరాలు; ఉస్మానియా కొత్త ఆస్పత్రికి పరికరాలు, ఆరోగ్య కార్డులు; క్యాన్సర్‌ కేర్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించనుంది.


రాష్ట్రంలోని జాతీయ రహదారుల వెంట ప్రతి 30 కిలోమీటర్లకు ఒక ట్రామాకేర్‌ కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 109 ట్రామాకేర్‌ సెంటర్ల ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. ఒక్కో కేంద్రంలో 73 మంది సిబ్బందిని నియమించబోతోంది. వీటిని మూడు దశల్లో ఏర్పాటు చేయనుంది. ఇందుకు సుమారు రూ.1000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అలాగే టీ డయాగ్నస్టిక్‌ సేవల బలోపేతానికి రూ.1,044 కోట్లు వెచ్చించనుంది. టీ డయాగ్నస్టిక్‌ల కింద మరో 60 మినీ హబ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి బోధనాస్పత్రిలో ఒక ఎంఆర్‌ఐ ఏర్పాటుకు మొత్తం రూ.444 కోట్లు ఖర్చు కానుంది.


  • నిమిషాల్లో చేరుకునేలా..

ప్రస్తుతం రోడ్డు ప్రమాదం జరిగితే బాధితుల వద్దకు అంబులెన్సులు చేరుకోవడానికి సుమారు 17-20 నిమిషాలు పడుతోంది. పైగా కాలం చెల్లిన అంబులెన్స్‌లు తరచూ మరమ్మతులకు గురికావడం జరుగుతోంది. అంబులెన్సులు ఆలస్యంగా వెళ్లడంతో ప్రమాద బాధితులు కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా ప్రమాదం, అత్యవసర ఘటనలు సంభవిస్తే బాధితుల వద్దకు కేవలం 8 నిమిషాల్లోపు అంబులెన్సులు చేరుకునే వ్యవస్థను వైద్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా మరో 100 అంబులెన్సులను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అలాగే హైవేలపై ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, వాటికి సమీపంలో ఈ 108 అంబులెన్సులను ఎక్కువగా మోహరించనుంది. టిమ్స్‌, సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో అత్యాధునిక పరికరాల కోసం రూ.750 కోట్లు వెచ్చించనుంది. గచ్చిబౌలి టిమ్స్‌లో నెఫ్రాలజీ, యూరాలజీలో రూ.150 కోట్లతో సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ను ఏర్పాటు చేస్తారు. రాష్ట్రంలోని 35 జీజీహెచ్‌ ఆస్పత్రుల్లో రూ.350 కోట్లతో ‘డ్రగ్‌ డీ అడిక్షన్‌ సెంటర్ల’ను నెలకొల్పాలని ప్రతిపాదించారు.


  • డయాలసిస్‌, క్యాన్సర్‌ కేర్‌..

రాష్ట్రంలో డయాలసిస్‌, క్యాన్సర్‌ రోగుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఒక డయాలసిస్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వాటిలోని యంత్రాలు సరిపోవడం లేదు. అదనంగా డయాలసిస్‌ యంత్రాలను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాగే డయాలసిస్‌ రోగుల కోసం వాస్క్యులర్‌ కేంద్రాలు కూడా అవసరం. ఇందులో భాగంగా రాష్ట్రంలో నలు దిక్కులా నాలుగు చోట్ల ఈ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొత్తగా 108 డయాలసిస్‌ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 54 కోట్లు వెచ్చించనున్నారు.

  • 35 జీజీహెచ్‌ల్లో రూ.49 కోట్లతో వాస్క్యులర్‌ సెంటర్ల ఏర్పాటు.

  • 35 బోధనాస్పత్రుల్లో ఎమర్జెన్సీ కేర్‌ శిక్షణ కోసం సిములేషన్‌ లేబరేటరీలను ఏర్పాటు చేస్తారు. అందుకోసం రూ.245 కోట్లు కేటాయిస్తారు.

  • ఇంటిగ్రేటెడ్‌ క్వాలిటీ కంట్రోల్‌ ల్యాబ్స్‌ కోసం రూ.510 కోట్లు కేటాయిస్తారు.

  • సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్స్‌ ఆధునికీకరణ కోసం రూ.100 కోట్లు కేటాయించనున్నారు.

  • హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌, ఉస్మానియా, గాంధీ, నిమ్స్‌ ఆస్పత్రులు సహా నిజామాబాద్‌, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఆదిలాబాద్‌, వరంగల్‌లలో అవయవాల సేకరణ, నిల్వ కేంద్రాల కోసం రూ.30 కోట్లు కేటాయిస్తారు.

  • ప్రస్తుతం 376 కేంద్రాల్లో ఆరోగ్య మహిళ కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాటిని 1000కి పెంచుతారు. అందుకు రూ.300 కోట్లు వెచ్చిస్తారు.

  • నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌లలో రూ.11 కోట్లతో కొత్తగా ఐవీఎఫ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.

  • కోక్లియర్‌ ఇంప్లాంట్‌ సెంటర్లను రూ.79 కోట్లతో ఏర్పాటు చేస్తారు.

  • కొత్త ఉస్మానియా ఆస్పత్రిలో పరికరాల

  • కొనుగోలుకు రూ.250 కోట్లు ఖర్చు చేస్తారు.

  • రాష్ట్రవ్యాప్తంగా హెల్త్‌ కార్డులు, కార్యక్రమాల పర్యవేక్షణ యూనిట్‌ (పీఎంయూ)ల కోసం రూ.180 కోట్లు ఖర్చు చేస్తారు.

  • రూ.165 కోట్లతో పలు చోట్ల క్యాన్సర్‌

  • కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తారు.

Updated Date - Sep 16 , 2024 | 04:03 AM