Share News

Rice Mills: రైస్‌మిల్లర్ల వద్ద భారీగా సీఎంఆర్‌!

ABN , Publish Date - Aug 27 , 2024 | 05:11 AM

రాష్ట్రంలో రైస్‌ మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను తిరిగివ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది.

Rice Mills: రైస్‌మిల్లర్ల వద్ద భారీగా సీఎంఆర్‌!

  • 36 లక్షల టన్నుల మేర పేరుకుపోయిన బకాయిలు

  • సీఎంఆర్‌ టార్గెట్‌ పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్న మిల్లర్లు

హైదరాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రైస్‌ మిల్లర్లు కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌)ను తిరిగివ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతేడాది (2023-24)కి సంబంధించిన సీఎంఆర్‌ టార్గెట్‌ను పూర్తి చేయడంలో రైస్‌మిల్లర్లు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిరుడు రెండు సీజన్ల (వానాకాలం, యాసంగి)కు కలిపి 36.19 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం బకాయిలు మిల్లర్ల వద్దనే ఉన్నాయి. ఇందులో వానాకాలం బియ్యం బకాయిలు 13.88 లక్షల టన్నులు కాగా, యాసంగి బకాయిలు 22.31 లక్షల టన్నులున్నాయి. పౌరసరఫరాల సంస్థ రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని కస్టమ్‌ మిల్లింగ్‌ కోసం రైస్‌మిల్లర్లకు అప్పగించింది.


బాయిల్డ్‌ రైస్‌ 68 శాతం, రా రైస్‌ అయితే 67 శాతం రికవరీ చొప్పున బియ్యం తిరిగి అప్పగించాలి. అయితే మిల్లర్లు నిర్ణీత గడువులోగా టార్గెట్‌ పూర్తి చేయడం లేదు. 6 నెలల్లోపు సీఎంఆర్‌ టార్గెట్‌ పూర్తి చేయాల్సి ఉండగా తీవ్ర జాప్యం చేస్తున్నారు. కొందరు రైస్‌మిల్లర్లు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) బియ్యం... కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ కోటాలో ప్రభుత్వానికి అప్పగించొచ్చనే ఉద్దేశంతో సీఎంఆర్‌ టార్గెట్‌ పూర్తి చేయడం లేదు. ఇక ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్ముకునేవారు కొందరుంటే, బియ్యంగా మార్చాక బహిరంగ మార్కెట్లో అమ్ముకునే మిల్లర్లు కొందరున్నారు. చౌక డిపోల్లో బియ్యం పంపిణీ జరిగే తొలి పక్షం (ప్రతి నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు) సీఎంఆర్‌ డెలివరీ ఎక్కువ ఉంటోంది. వినియోగదారులు, రేషన్‌ డీలర్లు, దళారుల వద్ద పీడీఎస్‌ బియ్యం కొని రీ-సైక్లింగ్‌ చేసి బస్తాలు మార్చి ఎఫ్‌సీఐకి డెలివరీ చేస్తున్నారు. ప్రతి నెల రెండో పక్షంలో పీడీఎస్‌ బియ్యం లభ్యతలేకపోవడంతో సీఎంఆర్‌ డెలివరీ తక్కువ ఉంటోంది.

Updated Date - Aug 27 , 2024 | 05:11 AM