HYderabad: బొగ్గు.. భగ్గు!
ABN, Publish Date - Jun 21 , 2024 | 03:57 AM
రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటిమంటలు అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని రెండు బొగ్గు నిక్షేపాల బ్లాక్‌లను దాదాపు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా... తాజాగా మరో మూడో బ్లాక్(శ్రావణపల్లి)ని శుక్రవారం వేలం వేస్తున్నారు.
గనుల వేలంపై రాజుకున్న రాజకీయం
దేశవ్యాప్తంగా 60 బ్లాకుల వేలంలో మంచిర్యాల జిల్లా శ్రావణపల్లి బ్లాక్ కూడా
హైదరాబాద్ కేంద్రంగా నేడు వేలం.. పోటీ పడొద్దని ప్రభుత్వ నిర్ణయం
హైదరాబాద్, జూన్ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బొగ్గు గనుల వేలంపై సెంటిమంటలు అంటుకున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని రెండు బొగ్గు నిక్షేపాల బ్లాక్‌లను దాదాపు రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం వేలం వేయగా... తాజాగా మరో మూడో బ్లాక్(శ్రావణపల్లి)ని శుక్రవారం వేలం వేస్తున్నారు. కొత్త గనులు లేక సింగరేణి ఇబ్బందులు పడుతున్న వేళ రాష్ట్రంలోని నిక్షేపాలను వేలం వేయడం అధికార, విపక్షాల మధ్య వాడివేడిని పెంచింది. మేలు చేస్తారని చెరి ఎనిమిది సీట్లు కట్టబెడితే కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలోని బొగ్గు బ్లాక్‌లను వేలంలో ప్రయివేటు సంస్థలకు కట్టబెట్టి సింగరేణిని ప్రయివేటుపరం చేయాలని చూస్తున్నాయంటూ బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు.
తాము వేలానికి అంగీకరించబోమని, బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వేలం వేసిన రెండు బ్లాక్‌లతో సహా రాష్ట్రంలో అన్ని బ్లాక్‌లను సింగరేణికే కేటాయించాలని కోరతామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఈ రాజకీయ వేడి నేపథ్యంలో దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని 60 గనుల వేలం పాటకు హైదరాబాద్ కేంద్రంగా మారింది. తెలంగాణలో కొత్తగా మూడు బ్లాక్‌లలో బొగ్గు నిల్వలు ఉన్నాయని స్వయంగా సింగరేణి గుర్తించింది. అందులో రెండింటిని బీఆర్‌ఎస్ ప్రభుత్వహయాంలోనే కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. తాజాగా మూడో గనిని వేలం వేస్తున్నారు. 2010లో సుప్రీంకోర్టు తీర్పు వచ్చేవరకు బొగ్గు గనులను ముందు వచ్చిన వాళ్లకు ముందు పద్ధతిలో కేటాయించే వాళ్లు. ప్రభుత్వరంగ సంస్థలకు కూడా అడగగానే గనులను కేటాయించేవారు. ముందు వచ్చిన వారికి ముందు పద్ధతిలో భారీగా అవినీతి జరుగుతోందని, వేలం వేయాలని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత 2014లో కేంద్ర ప్రభుత్వం కొత్త బొగ్గు విధానాన్ని అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం ప్రయివేటు సంస్థలే కాకుండా ప్రభుత్వరంగ సంస్థలు కూడా బొగ్గు బ్లాక్‌లు కావాలంటే వేలంలో పాల్గొనాల్సిందే. ఈ నేపథ్యంలో రెండున్నరేళ్ల క్రితం తెలంగాణలోని రెండు బ్లాక్‌లను కేంద్ర ప్రభుత్వం వేలం వేసినా సింగరేణి నిస్సహాయంగా ఉండిపోవాల్సి వచ్చింది. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం వేలానికి దూరంగా ఉండిపోయింది.
దాంతో సత్తుపల్లి బ్లాక్-3, కోయిగూడెం బ్లాక్ -3(ఇల్లెందు) గనులను సింగిల్ బిడ్డర్లుగా ప్రైవేట్ సంస్థలు దక్కించుకున్నాయి. అయితే, అవి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించలేక పోయాయి. బొగ్గును వెలికితీసే సాధనా సంపత్తి ఆ సంస్థలకు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రెండు బ్లాక్‌లను తమకు కేటాయించాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. వేలంలో దక్కించుకున్న సంస్థలకు విధించిన షరతులన్నీ తాము నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పింది. కేంద్రం నుంచి స్పందనలేదు. కిషన్‌రెడ్డి బొగ్గు మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్ కేంద్రంగా దేశవ్యాప్తంగా ఉన్న 60 బ్లాక్‌ల వేలం జరుగుతోంది. అందులో సింగరేణి గనుల మధ్యలో ఉన్న శ్రావణపల్లి బ్లాక్(శ్రీరాంపూర్, మందమర్రి) కూడా ఉంది. వేలం ప్రక్రియను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబే, కార్యదర్శి అమృత్ లాల్ మీనా తదితరులు పాల్గొంటారు. వేలాన్ని నిలిపివేయాలని రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్ డిమాండ్ చేసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ కార్యక్రమానికి హాజరై, శ్రావణపల్లి గనిని తమకే కేటాయించాలని కేంద్రాన్ని కోరనున్నారు. ప్రైవేట్ సంస్థలతో పోటీపడి, గనులను దక్కించుకునే ఆర్థిక పరిస్థితులు సింగరేణికి లేవు.
రెండున్నరేళ్ల నుంచి కోరుతున్నా
తెలంగాణలో తలపెట్టిన నాలుగు బొగ్గు బ్లాకుల వేలాన్ని నిలిపివేయాలని 2021 డిసెంబరులో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. బొగ్గు గనుల వేలాన్ని నిరసిస్తూ 2021 డిసెంబరులో మూడు రోజుల పాటు కార్మిక సంఘాలు సమ్మె కూడా చేపట్టాయి. కేంద్రం నుంచి సానుకూల స్పందన రాలేదు. సింగరేణి మనుగడ ఓపెన్ కాస్ట్ గనుల మీదే ఆధారపడి ఉంది. భూగర్భ గనులు నష్టాల్లో ఉండగా వాటిని ఓపెన్ కాస్టు లాభాలతో సింగరేణి సర్దుబాటు చేసుకుంటోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు విద్యుత్ కేంద్రాల బొగ్గు అవసరాలను తీర్చడంలో సింగరేణి కీలక భూమిక పోషిస్తోంది. ఇప్పటికే వేలం వేసిన రెండు బ్లాక్‌లను దక్కించుకున్న ప్రైవేటు సంస్థలు ఉత్పత్తి ప్రారంభించకపోవడాన్ని, కొత్తగా వేలం వేయడానికి సిద్ధంగా ఉన్న శ్రావణపల్లి బ్లాక్ సింగరేణి గనుల మధ్య ఉన్న విషయాన్ని కేంద్రానికి నివేదించి, ప్రత్యేక అనుమతితో దక్కించుకోవాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి విజ్ఞప్తే చేయగా ఇటీవలే తాడిచర్ల బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడానికి కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిన విషయం విదితమే.
వేలానికి దూరంగాసింగరేణి
హైదరాబాద్‌లో శుక్రవారం జరుగనున్న వేలం పాటకు సింగరేణి దూరంగాఉండబోతోంది. 60 బ్లాకుల్లో అత్యధికంగా ఒడిశాకు చెందిన 16 బ్లాకులు, ఛత్తీ్‌సగఢ్‌కు చెందిన 15 బ్లాకులు, ఆ తర్వాత జార్ఖండ్‌కు చెందిన 6 బ్లాకులు, బిహార్, పశ్చిమ బెంగాల్‌లకు చెందిన చెరో మూడు బ్లాకులతో పాటు తెలంగాణలోని ఒక బ్లాకు(శ్రావణపల్లి)కూడా ఉంది. ఈ బ్లాకు లో 11.99కోట్ల టన్నుల బొగ్గునిల్వలు ఉన్నట్లు గతంలో సింగరేణి నిర్వహించిన అన్వేషణలో తేలింది. సింగరేణి తాజా వేలంపాటకు దూరంగా ఉండి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది.
అనుమతుల్లో వేగం పెంచండి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, జూన్ 20 (ఆంధ్రజ్యోతి) : కొత్తగా కేటాయించిన బొగ్గు బ్లాకుల అనుమతుల ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. బొగ్గు గనుల నిర్వహణ, కేటాయింపు తదితర అంశాలపై ఢిల్లీలోని తన కార్యాలయంలో అధికారులతో గురువారం ఆయన సమీక్ష నిర్వహించారు. కేటాయించిన బొగ్గు బ్లాకుల నుంచి వీలైనంత త్వరగా ఉత్పత్తి ప్రారంభం కావాలని సూచించారు. ఈ మేరకు సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలతో సమన్వయంతో వ్యవహరించాలని అన్నారు. దేశంలో బొగ్గు దిగుమతిని తగ్గించేందుకు ప్రతి ఒక్కరూ చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు.
Updated Date - Jun 21 , 2024 | 03:57 AM