Hyderabad : 10,000 కోట్లు సిద్ధం?
ABN , Publish Date - Jul 10 , 2024 | 05:51 AM
రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది.
రుణమాఫీకి నిధులు సమకూర్చుకుంటున్న సర్కారు
ప్రతినెలా మార్కెట్ రుణాల నుంచి కొంత నిల్వ
వ్యయాలు పోను, రాబడుల నుంచీ ఆదా
ఇతర మార్గాల్లోనూ నిధుల సేకరణకు చర్యలు
మూడు దశల్లో రుణమాఫీ పథకం అమలు
రూ.లక్ష, లక్షన్నర, 2 లక్షల రుణాలు మాఫీ
ఆగస్టు 15లోపు ప్రక్రియ పూర్తికి చర్యలు!
హైదరాబాద్, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రైతు రుణమాఫీ పథకం అమలుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటోంది. ముఖ్యంగా నిధుల సేకరణకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే పలు మార్గాలను ఆలోచించి పెట్టుకుంది. వీటిపై కసరత్తు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించింది. అదేసమయంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ స్థాయిలోనూ ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్కెట్ నుంచి సేకరించే బడ్జెట్ అప్పులను జూలై, ఆగస్టు నెలల్లో ఎక్కువ మొత్తంలో తీసుకునేందుకు అవకాశం కల్పించాలని కేంద్రాన్ని కోరుతూనే.. భూములను హామీగా పెట్టి తీసుకునే రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకోవద్దంటూ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు నెలవారీగా తీసుకుంటున్న బడ్జెట్ రుణాలను ఖజానాలో జమ చేసి పెడుతోంది. ఇప్పటికే రుణమాఫీ పథకం కోసం రూ.10 వేల కోట్ల వరకు ఖజానాలో నిల్వ చేసినట్లు సమాచారం.
వాస్తవానికి రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమవుతాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇది ప్రాథమికంగా అంచనా వేసిన మొత్తం. పథకాన్ని పూర్తిగా అమలు చేసేనాటికి నిధుల మొత్తం తగ్గవచ్చన్న అభిప్రాయాలున్నాయి. ఏదేమైనా రుణమాఫీ పథకానికి నిధుల కోసం ప్రభుత్వం అనేక మార్గాల్లో కసరత్తు చేస్తోంది. ఆగస్టు 15లోగా రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తామని సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో నిధుల సేకరణపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యంగా ప్రతి నెలా తీసుకుంటున్న రుణాలను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, పాత అప్పుల కిస్తీలు కడుతూ ఎంతో కొంత నిధులను ఆదా చేస్తూ వచ్చింది. రాష్ట్ర ఖజానాకు వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఆదాయంలోనూ కొంత నిల్వ చేస్తోంది. ఇలా పలు రకాలుగా ఆదా చేస్తూ.. ప్రస్తుతం ఖజానాలో రూ.10 వేల కోట్ల వరకు నిల్వ చేసి పెట్టినట్లు తెలిసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఏప్రిల్‌లో రూ.4000 కోట్లు, మేలో 4000 కోట్లు, జూన్‌లో 5000 కోట్ల చొప్పున మార్కెట్ రుణాలను సేకరించింది.
రుణ మాఫీకి జూలై, ఆగస్టు రుణాలు
జూలై, ఆగస్టు నెలల్లో తీసుకునే మార్కెట్ రుణాల్లో కొన్ని నిధులను రుణమాఫీ పథకానికి మళ్లించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జూలైలో రూ.6,500 కోట్లు, ఆగస్టులో రూ.5000 కోట్ల మేర రుణం తీసుకోవాలని ముందస్తు ప్రణాళికను నిర్దేశించుకుంది. ఆ 11,500 కోట్లలో ప్రభుత్వ వ్యయాలు, పాత అప్పుల కిస్తీలు పోను ఎంతో కొంత ఆదా చేయనుంది. ఈ రెండు నెలల రుణాల్లో ఇప్పటికే రూ.2000 కోట్లు తీసుకున్నందున మిగతా రూ.9,500 కోట్లలో ఒకేసారి ఎక్కువ మొత్తాన్ని తీసుకోవడానికి అనుమతివ్వాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. కేంద్రం అనుమతించి, ఒకేసారి పెద్ద మొత్తంలో రుణం తీసుకుంటే ఎక్కువ భాగాన్ని రుణమాఫీ పథకానికి మళ్లించాలని సర్కారు యోచిస్తోంది.
ఇతర మార్గాలపైనా దృష్టి
రుణమాఫీ పథకంతో పాటు ఇతర వ్యయాల కోసం ప్రభుత్వం పలు రకాలుగా నిధుల సేకరణ ప్రయత్నాలు చేస్తోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ భూములను ప్రైవేటు బ్యాంకుల వద్ద హామీగా పెట్టి రుణాలు తీసుకోవడంపై కసరత్తు చేస్తోంది. కానీ, ఇలాంటి రుణాలపై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ రుణాలను కూడా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే లెక్కిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం భీష్మిస్తే ఇబ్బంది తప్పదన్న అభిప్రాయాలున్నాయి.
బడ్జెట్ వెలుపల తీసుకునే ఎలాంటి రాష్ట్ర ప్రభుత్వ రుణాలనైనా ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకుంటామని కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. ఇలాంటి రుణాలను ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి తీసుకోవద్దంటూ సీఎం, డిప్యూటీ సీఎంలు ప్రధాని, ఆర్థిక మంత్రిని కోరారు. దీనికి కేంద్రం ఆమోదం తెలపాల్సి ఉంది. మరోవైపు పరిశ్రమలకు కేటాయించిన భూములను వాణిజ్య, నివాస అవసరాల కోసం మార్పిడి చేయాలన్న ఆలోచన కూడా ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చాలా భూములను పారిశ్రామిక యూనిట్లకు కేటాయించారు. కానీ, కొన్నింటిలో ఎలాంటి యూనిట్లు ఏర్పాటు కాలేదని, ఆర్థిక, పారిశ్రామిక ఉత్పత్తి కార్యకలాపాలను ప్రారంభించలేదని ప్రభుత్వం గుర్తించింది. అలాంటి భూములను నివాసయోగ్య స్థలాలుగా మార్చి, విక్రయించే ఆలోచన చేస్తోంది. ఇలా వచ్చే నిధులను రుణమాఫీ పథకానికి మళ్లించడంతో పాటు రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలకు వినియోగించాలన్న ఆలోచనలో ఉంది.
మూడు దశలుగా రుణమాఫీ..
రుణమాఫీని 3 దశలుగా అమలు చేయాలని యోచిస్తోంది. ముందుగా రూ.లక్ష లోపు రుణాలను, తర్వాత రూ.లక్షన్నర లోపు, అనంతరం రూ.2 లక్షల లోపు పంట రుణాలను మాఫీ చేయాలని భావిస్తోంది. ఇదంతా కొన్ని రోజుల తేడాతో సాగే ప్రక్రియ అయినందున.. ఒకేసారి రుణమాఫీ పథకాన్ని వర్తింపజేశామని చెప్పనుంది.
Also Read:
స్కూల్‌లో దెయ్యం.. ఆ టీచర్ ఏం చేశాడంటే..!
గ్రీన్ హైడ్రోజన్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్..
జగన్ కోటరీకి ఝలక్.. ప్రక్షాళన ఆరంభం..
For More Telangana News and Telugu News..