BANDI SANJAY: రేవంత్ ప్రభుత్వానికి డెడ్‌లైన్ పెట్టిన బండి సంజయ్.. ఎందుకంటే..
ABN, Publish Date - Dec 29 , 2024 | 04:55 PM
BANDI SANJAY: విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రేవంత్ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
కరీంనగర్: ఒక్కో నిరుద్యోగికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 48 వేల నిరుద్యోగ భృతి బాకీ ఉందని కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. 25వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి 50 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ ప్రభుత్వం చెప్పుకుంటుందని అన్నారు. ఇవాళ(ఆదివారం) కరీంనగర్‌లో బండి సంజయ్ పర్యటించారు. పలు కార్యక్రమాల్లో బండి సంజయ్ పాల్గొని మీడియాతో మాట్లాడారు. సంక్రాంతిలోపు ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ ప్రకటించిన యూత్ డిక్లరేషన్ హామీ ఏమైందని నిలదీశారు. 6 గ్యారెంటీలను పూర్తిగా అమలు చేయడంలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చే వరకు ఆందోళన చేస్తామని బండి సంజయ్ కుమార్ వార్నింగ్ ఇచ్చారు.
ఎమ్మెల్సీ కవిత ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: మెదక్ ఎంపీ రఘునందన్ రావు
సంగారెడ్డి జిల్లా: బీసీలపై బీఆర్ఎస్ నేతలు మొసలికన్నీరు కారుస్తున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు విమర్శించారు. సంగారెడ్డిలో ఇవాళ(ఆదివారం) సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ నేతలను భయపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కేసులు నమోదు చేస్తుందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని అన్నారు. మాజీ మంత్రి కేటీఆర్‌పై నమోదు చేసిన కేసుకు బీజేపీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఏం సంబంధమని ప్రశ్నించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఎన్నికల కమిషన్, ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా దేశ సంపదను విదేశాలకు పంపినందుకు కేటీఆర్‌పై కేసు నమోదు అయిందని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు.
బీసీలకు ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధమని నిలదీశారు. బీఆర్ఎస్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు బీసీల గురించి కవిత ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బీసీలకు పది మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉండగా రెండు, మూడు మాత్రమే ఇచ్చారని.. అప్పుడు కవిత నోరు ఎందుకు మూత పడిందని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ చచ్చిన పాము అని విమర్శించారు. బీసీల పట్ల నిజాయతీ ఉంటే ప్రతిపక్ష నేత లేదా పార్టీ అధ్యక్ష పదవి వారికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాడు బీసీ కులగణన గురించి కవిత ఎందుకు మాట్లాడలేదు.. ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Harish Rao: పోలీస్ శాఖలో మరణ మృదంగం.. ఈ ప్రభుత్వానికి పట్టదా?
Telangana Crime Rate Report 2024: తెలంగాణ క్రైమ్ రేటు నివేదికలో వెలుగులోకి సంచలన విషయాలు
New Year: తారల తళుకులు.. మోడళ్ల మెరుపులు.. ఈసారి అంతకుమించి..
For More Telangana News And Telugu News
Updated Date - Dec 29 , 2024 | 05:02 PM