Kavitha: అందుకే కేటీఆర్‌ను టార్గెట్ చేశారు
ABN , Publish Date - Dec 23 , 2024 | 01:56 PM
Telangana: రాష్ట్ర ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరి కోసం కాకుండా.. కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పెద్దల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.
హైదరాబాద్, డిసెంబర్ 23: ప్రతిపక్షాలపై అటాక్ చేయటమే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) లక్ష్యంగా పెట్టుకున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) వ్యాఖ్యలు చేశారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో కవిత మాట్లాడుతూ.. తెలంగాణలో 10 శాతం కమిషన్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. కాంగ్రెస్ హామీ మేరకు ఇప్పటి వరకు ఒక్కో మహిళ కనీసం 30 వేలు కోల్పోయిందని తెలిపారు. అందరి కోసం కాకుండా.. కొందరి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని విమర్శించారు. రేవంత్ రెడ్డి పెద్దల కోసమే ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆరోపించారు.
గురుకులాలు ట్రాక్‌లోకి వచ్చే వరకు ప్రభుత్వాన్ని వెంటపడుతామని స్పష్టం చేశారు. తెలంగాణను ప్రపంచ బ్యాంకుకు తాకట్టు పెడ్తున్నా... కమ్యూనిస్టులు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ, నామినేట్ పోస్టుల కోసమే కమ్యూనిస్టులు మౌనంగా ఉంటున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. పాలమూరు, రంగారెడ్డిపై సీఎం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం కోసం కార్యాచరణ తీసుకుంటామని తెలిపారు.
మాకు ఫస్ట్రేషన్ లేదు..
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఈడీ కేసు కక్షసాధింపులో భాగమని విమర్శించారు. కేసీఆర్ కుటుంబం టార్గెట్‌గా కాంగ్రెస్ సర్కార్ కేసులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నందునే కేటీఆర్‌ను టార్గెట్ చేశారన్నారు. అధికారం పోయినంత మాత్రాన తమకు ఫ్రస్టేషన్ లేదన్నారు. తాము పదవుల నుంచి వచ్చిన వాళ్ళం కాదని.. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళమని తెలిపారు. కేసీఆర్ తప్పులు చేస్తే.. వాటిని సరిచేసి పాలన చేయొచ్చు.. కానీ అసెంబ్లీలో వ్యక్తిగతంగా టార్గెట్ చేయటం సరికాదన్నారు. ధరణి స్థానంలో వచ్చిన భూభారతిపై కాలమే సమాధానం చెప్తుందన్నారు.
ప్రభుత్వాన్ని నడిపేది వాళ్లే..
కాంగ్రెస్, బీజేపీలు బాయ్ బాయ్ అని కేటీఆర్ కేసుతో రుజువైందన్నారు. ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమే కానీ.. నడుపుతున్నది బీజేపీ వాళ్ళు అంటూ హాట్ కామెంట్స్ చేశారు. గతంలో ఏ కేసులో కూడా ఇంత త్వరగా ఈడీ కేసు నమోదు చేయలేదన్నారు. సీఎం ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశాకనే ఫార్ములా కేసు నమోదు అయ్యిందన్నారు. ఫార్ములా రేసు కేసును రాజ్‌భవన్ నుంచి నడిపించారన్నారు. ప్రాంతీయ పార్టీలు ఉండకూడదని కాంగ్రెస్, బీజేపీల ప్లాన్ అని తెలిపారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇప్పుడున్న నిర్భంధాలు లేవన్నారు. అప్పటి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిస్తే.. బతుకమ్మ కోసం ఉమ్మడి జిల్లాకు లక్ష చొప్పున ఇచ్చారని గుర్తుచేశారు.
అల్లు అర్జున్ వివాదంపై..
‘‘కేసీఆరే మా బాస్. మేమంతా ఆయన సైనికులం. కేసీఆర్ బయటకు రావటం లేదనటం సరైంది కాదు. కేసీఆర్ సలహా ఇచ్చేంత గొప్ప పనులను ప్రభుత్వం చేయటంలేదు. కేసీఆర్ సూచనల మేరకే బీఆర్ఎస్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. తెలంగాణ తల్లి, భూభారతిపై ప్రతిపక్షాలను నుంచి సలహాలు ఎందుకు తీసుకోలేదు?’’ అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అల్లు అర్జున్ అంశాన్ని ప్రభుత్వం వాడుకుంటోందని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సినిమాల ప్రభావం తక్కువన్నారు. ప్రతి దాని వెనుక బీఆర్ఎస్ ఉందనటం దారుణమన్నారు. అంబేడ్కర్‌పై అమిత్ షా కామెంట్స్ ఖండిచాల్సిన అంశం అని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
నోటీసులకు స్పందించిన పేర్ని నాని కుటుంబం..
గుడ్ న్యూస్.. జియో న్యూ ప్లాన్.. వివరాలు ఇవే..
Read Latest Telangana News And Telugu News