Share News

Telangana Formation Day: అంబరాన్నంటేలా.. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు

ABN , Publish Date - May 30 , 2024 | 08:28 PM

తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Telangana Formation Day: అంబరాన్నంటేలా..  తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ముగింపు ఉత్సవాలు
Telangana Formation Day

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాల ముగింపు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రకటించారు. ఈసారి ఉదయం, సాయంత్రం రెండు పూటలా ఘనంగా వేడుకలకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. సచివాలయంలో గురువారం శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు ఉత్తమ్​ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖతో పాటు మాజీ మంత్రి జానారెడ్డి, ప్రొఫెసర్ కోదండరాంతో పాటు కవి అందెశ్రీ, సంగీత దర్శకులు కీరవాణి, సీపీఐ ఎమ్మెల్యే కూనమనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ బిల్లును ఆమోదించినప్పుడు సభలో ఉన్న మాజీ ఎంపీలు, ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన పార్టీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సమావేశమయ్యారు.


ఉదయం గన్ పార్క్‌లో..

జూన్ 2న ఉదయం 9.30గంటలకు గన్ పార్క్‌లో అమర వీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరులైన వారికి నివాళులు అర్పిస్తారు. ఉదయం 10 గంటలకు పరేడ్ గ్రౌండ్‌లో ముఖ్యమంత్రి జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. పోలీసు బలగాల పరేడ్, మార్చ్ ఫాస్ట్, వందన స్వీకార కార్యక్రమం ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతాన్ని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. అనంతరంసోనియాగాంధీ ప్రసంగం, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. పోలీసు సిబ్బందికి, ఉత్తమ కాంటింజెంట్లకు అవార్డులను ప్రదానం చేస్తారు. అవార్డు స్వీకర్తలతో ఫొటో సెషన్ అనంతరం కార్యక్రమం ముగుస్తుంది.


వివిధ రకాల ఫుడ్ స్టాల్స్, కార్నివాల్

జూన్ 2 సాయంత్రం ట్యాంక్ బండ్‌పై తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ప్రారంభమవుతాయి. తెలంగాణకు సంబంధించిన హస్తకళలు, ప్రత్యేక ఉత్పత్తులు, వివిధ రకాల ఫుడ్ స్టాల్స్ ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6.30గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ ట్యాంక్ బండ్‌కు చేరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను సందర్శిస్తారు. అనంతరం తెలంగాణ కళారూపాల అద్భుత ప్రదర్శనకు అద్దం పట్టే కార్నివాల్ నిర్వహిస్తారు. దాదాపు 700 మంది కళాకారులు ఇందులో పాల్గొంటారు. అనంతరం ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన వేదికపై 70 నిమిషాల పాటు వివిధ సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఉంటాయి.


ట్యాంక్​ బండ్‌పై భారీ ఫ్లాగ్​‌వాక్​ ..

స్టేజ్​ షో అనంతరం జాతీయ జెండాలతో ట్యాంక్​ బండ్‌పై ఇటు చివర నుంచి అటు చివరి వారకు భారీ ఫ్లాగ్​‌వాక్​ నిర్వహిస్తారు. దాదాపు 5 వేల మంది ఇందులో పాల్గొంటారు. ఈ ఫ్లాగ్​వాక్​ జరుగుతున్నంతసేపు జయ జయహే తెలంగాణ ఫుల్​ వర్షన్ (13.30 నిమిషాల) గీతాన్ని విడుదల చేస్తారు. అదే వేదికపై తెలంగాణ కవి శ్రీ అందెశ్రీ, సంగీత దర్శకుడు శ్రీ ఎం.ఎం. కీరవాణికి సన్మానం చేస్తారు. రాత్రి 8.50 గంటలకు పది నిమిషాల పాటు హుస్సేన్ సాగరం మీదుగా ఆకాశంలో రంగులు విరజిమ్మేలా బాణాసంచా (ఫైర్‌వర్క్స్) కార్యక్రమంతో వేడుకలను ముగిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG Politics: అఖిలపక్ష సమావేశంలో సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

Telangana: తెలంగాణ కొత్త లోగో ఆవిష్కరణ వాయిదా.. ఎందుకంటే..?

BJP: ఫోన్ ట్యాపింగ్‌‌పై కేంద్రానికి ఫిర్యాదు చేయనున్న బీజేపీ

New Logo: ఖరారైన తెలంగాణ కొత్త లోగో..!

Read Latest Telangana News and Telugu News

Updated Date - May 30 , 2024 | 08:40 PM