Share News

Hyderabad Traffic: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల పాట్లు..

ABN , Publish Date - Sep 17 , 2024 | 05:26 PM

Ganesh Immersion Hyderabad: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం కనుల పండువగా సాగుతోంది. వేలాది విగ్రహాలు వడి వడిగా గంగమ్మ ఒడికి చేరేందుకు వస్తున్నాయి. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాని హుస్సేన్ సాగర్ తీరానికి చేరుతుండటంతో ఆయా రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు..

Hyderabad Traffic: ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల పాట్లు..
Metro Train

Ganesh Immersion Hyderabad: భాగ్యనగరంలో వినాయక నిమజ్జనం కార్యక్రమం కనుల పండువగా సాగుతోంది. వేలాది విగ్రహాలు వడి వడిగా గంగమ్మ ఒడికి చేరేందుకు వస్తున్నాయి. నగరం నలుమూలల నుంచి వినాయక విగ్రహాని హుస్సేన్ సాగర్ తీరానికి చేరుతుండటంతో ఆయా రూట్లలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులను, మెట్రో ట్రైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ పరిసరాల్లో జనం తాకిడీ అధికంగా ఉంది. హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రజలు తిరుగుప్రయాణంలో మెట్రో ట్రైన్‌ను ఆశ్రయిస్తున్నారు. అయితే, దీంతో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్‌లో ప్రయాణికుల రద్దీ విపరీతంగా ఉంది.


ప్రయాణికుల రద్దీ అధికంగా ఉండటంతో మెట్రో అధికారులు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ గేట్లు మూసివేశారు. మొత్తంగా తెరిచి ఉంచకుండా.. 10 నిమిషాలకు ఒకసారి ఎంట్రీ వద్ద గేట్లు తెరిచి ప్రయాణికులను లోపలికి పంపిస్తున్నారు. ఈ విధానంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బస్ సర్వీసులు కూడా ఫుల్ అవుతున్నాయి. బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి.


ఖైరతాబాద్‌ పరిసరాల్లో ఇసుకేస్తే రాలనంత జనం ఉన్నారు. మహాగణపతి నిమజ్జనం సహా, గణనాథుల నిమజ్జనాన్ని కనులారా వీక్షించేందుకు ట్యాంక్ పరిసరాలకు భక్తులు భారీగా చేరుకున్నారు. దీంతో ట్యాంక్‌బండ్, ఎన్టీఆర్ మార్గ్, సచివాలయం, ఐమాక్స్ రూట్, తెలుగుతల్లి ఫ్లైఓవర్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. మరోవైపు.. ప్రజల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - Sep 17 , 2024 | 05:26 PM