Share News

Dussehra: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే

ABN , Publish Date - Oct 11 , 2024 | 09:48 AM

దసరా పండగ వేళ.. భాగ్యనగరం నిర్మానుష్యంగా మారింది. పండగ కోసం నగర ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. దీంతో నగరంలోని రహదారులన్నీ బొసిపోయాయి. అలాగే నగరంలోని ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణికులు లేకుండా ఖాళీగా తిరుగుతున్నాయి. దసరా పండగ నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతోపాటు నగర జీవులు.. వారి వారి స్వస్థలాలకు పయనమయ్యారు.

Dussehra: హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీ.. ఎందుకంటే

దసరా పండగ వేళ.. భాగ్యనగరం నిర్మానుష్యంగా మారింది. పండగ కోసం నగర ప్రజలు స్వస్థలాలకు వెళ్లారు. దీంతో నగరంలోని రహదారులన్నీ బొసిపోయాయి. అలాగే నగరంలోని ఆర్టీసీ బస్సులు సైతం ప్రయాణికులు లేకుండా ఖాళీగా తిరుగుతున్నాయి. దసరా పండగ నేపథ్యంలో వరుసగా సెలవులు రావడంతోపాటు నగర జీవులు.. వారి వారి స్వస్థలాలకు పయనమయ్యారు. మరోవైపు నవరాత్రుల్లో ప్రధాన పండగలు దుర్గాష్టమి, నవమి, దశమిలు గురువారం నుంచి ప్రారంభమవుతున్నాయి.


దీంతో బుధవారమే హైదారబాద్ నుంచి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు ప్రజలు పయనమయ్యారు. దాంతో రైళ్లు, బస్సులన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఇక హైదరాబాద్ నగరం నుంచి వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతుంది. అలాగే దక్షిణ మధ్య రైల్వే సైతం ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.


ఇంకోవైపు విజయవాడ, బెంగళూరు, వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా వద్ద బస్సులు, ప్రైవేట్ వాహానాలు భారీగా బారులు తీరాయి. మరోవైపు రైళ్లలో, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్లు లేకపోవడంతో ప్రయాణికులు.. ప్రైవేట్ బస్ సర్వీసులను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ప్రైవేట్ బస్ సర్వీస్ ఆపరేటర్లు టికెట్ రేట్లను భారీగా పెంచేశారు.


దీంతో తప్పని సరి పరిస్థితుల్లో ప్రయాణికులు.. ప్రైవేట్ బస్సును ఆశ్రయిస్తున్నారు. మరోపైపు దసరా నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ఇవి ఈ నెల 14వ తేదీతో ముగియనున్నాయి. దాంతో నగరాన్ని విడిచి వెళ్లిన వారంతా మంగళ, బుధవారాల్లో మళ్లీ హైదరాబాద్‌కు తిరిగి ప్రయాణం కానున్నారు. దీంతో హైదరాబాద్ నగరంలోని రహదారులు మళ్లీ ప్రయాణికులతో కిక్కిరిసిపోనుంది.


మరోవైపు పండగ వేళ.. ఇళ్లకు తాళాలు వేసి అంతా ఊర్లకు వెళ్లపోతున్నారు. ఈ నేపథ్యంలో దొంగలు హల్‌చల్ చేసే అవకాశముంది. ఎందుకంటే.. గతేడాది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భారీగా చోరీ కేసులు ఈ సమయంలోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో నగరంలోని మూడు కమిషనరేట్ పరిధిలో పోలీసులు ప్రణాళికలు సిద్దం చేశారు. అందులోభాగంగా నైట్ పెట్రోలింగ్ పెంచారు. గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు, వ్యక్తిగత గృహాలపై నిరంతరం నిఘా పెట్టారు.


అలాగే గతంలో చోరీల కేసులో అరెస్టయి.. జైలు నుంచి విడుదలైన పాత నేరస్తుల కదలికలపై సైతం పోలీసులు గమనిస్తున్నారు. ఇక గతేడాది ఏ ప్రాంతాల్లో చోరీలు అధికంగా జరిగాయో గమనించిన పోలీసులు.. ఆయా ప్రదేశాల్లోని ప్రజలు అప్రమత్తం చేశారు. ఆ పరిసర ప్రాంతాల్లో అనుమానిత వ్యక్తులు సంచరిస్తే.. వెంటనే పోలీసులకు సమాచారం అందివ్వాలని సూచించారు. అదే విధంగా ఆ ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను సైతం నిరంతరం పర్యవేక్షించేలా పోలీసులు చర్యలు చేపట్టారు.

For Telangana News And Teugu News..

Updated Date - Oct 11 , 2024 | 11:08 AM