Share News

Komatireddy Venkat Reddy: హైడ్రా అధికారులు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారు..

ABN , Publish Date - Aug 21 , 2024 | 09:23 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ జన్వాడలో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కారులో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కేటీఆర్ ఫామ్ హౌస్ చూసివచ్చినట్లు మంత్రి తెలిపారు.

Komatireddy Venkat Reddy: హైడ్రా అధికారులు కేటీఆర్ ఫామ్ హౌస్ కూల్చేస్తారు..
Minister Komatireddy Venkat Reddy

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ జన్వాడలో అక్రమంగా నిర్మించిన ఫామ్ హౌస్‌ను హైడ్రా అధికారులు కూల్చివేస్తారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల తన కారులో సెల్ఫ్ డ్రైవ్ చేసుకుంటూ కేటీఆర్ ఫామ్ హౌస్ చూసివచ్చినట్లు మంత్రి తెలిపారు. ఆ సమయంలో కేటీఆర్ భార్య అక్కడ పని చేయిస్తున్నారని చెప్పారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉంటే హైడ్రా అధికారులు ఫామ్ హౌస్ తప్పకుండా కూలుస్తారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.


సినిమా స్టార్లు ఉన్నా వదిలేది లేదు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఫామ్ హౌస్ ఉందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మండిపడ్డారు. సీఎంకు అసలు ఫామ్ హౌస్ ఎక్కడుందని ప్రశ్నించారు. హైదరాబాద్ నగర పరిధిలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు ఉన్నా హైడ్రా అధికారులు కూల్చివేస్తారని మంత్రి హెచ్చరించారు. సినిమా యాక్టర్ల బిల్డింగులు అక్రమంగా నిర్మించినట్లు తేలితే వాటిని కూడా వదిలే ప్రసస్తే లేదని మంత్రి పేర్కొన్నారు. ఈ విషయంలో ఎవరికీ మినహాయింపు ఉండదన్నారు.


బీఆర్ఎస్ కాదు బీజేపీ..

బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కావడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇకపై కేటీఆర్, హరీశ్‌ను బీజేపీ లీడర్లనే పిలవాలంటూ ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ఏం జరుగుతుందో తనకు తెలుసంటూ మంత్రి చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఆరోగ్యంపై శ్రద్ధపెట్టాలని కల్వకుంట్ల ఫ్యామిలీకి ఆయన హితవుపలికారు. కేటీఆర్ యువకుడని ఆయనకు ఏమైనా అయితే ఇబ్బంది అవుతుందని అన్నారు. ఆయణ్ని చూస్తేనే జాలి వేస్తోందంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పదేళ్లల్లో ఒక్కసారి కూడా అంబేడ్కర్‌కి దండ వేయని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్ మళ్లీ తామే అధికారంలోకి వస్తామని చెప్తుంటే నవ్వొస్తోందని ఎద్దేవా చేశారు.


రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి?

రాష్ట్ర ప్రజలందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చిందని, కేసీఆర్ లాగా తాము దొంగ దీక్షలు చేయలేదని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. దేశం కోసం మాంసపు ముద్దయిన రాజీవ్ గాంధీ విగ్రహం సచివాలయం ఎదుట పెడితే తప్పేంటని ప్రశ్నించారు. విగ్రహం ఏర్పాటును బీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని మండిపడ్డారు. వాజ్ పేయీ విగ్రహం పెడితే మంచిదేనని, మంచి స్థలం దొరికితే ఆయన విగ్రహాన్నీ పెడతామన్నారు. ఇక కేటీఆర్ తన జీవితంలో సర్పంచ్ కూడా కాలేరని విమర్శించారు. గురువారం రోజున బీఆర్ఎస్ నిర్వహించే ధర్నాకు కనీసం వెయ్యి మంది రారంటూ మంత్రి ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయ్యిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు.

Updated Date - Aug 21 , 2024 | 09:23 PM