Drugs Case: రాడిసన్ డ్రగ్స్ కేసు: నేడు విచారణకు హాజరు కాలేను: క్రిష్
ABN , Publish Date - Feb 28 , 2024 | 12:21 PM
హైదరాబాద్: రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ బుధవారం పోలీసుల విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు.
హైదరాబాద్: రాడిసన్ హోటల్ (Radisson Hotel)లో డ్రగ్స్ (Drugs) వ్యవహారంలో సినీ దర్శకుడు జాగర్లమూడి క్రిష్ (Krish) బుధవారం విచారణకు హాజరుకాలేనని పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రస్తుతం తాను ముంబైలో ఉన్నందున మరో రెండు రోజులు సమయం కావాలని కోరారు. శుక్రవారం వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానని తెలిపారు. కాగా ఇప్పటికే డ్రగ్స్ సప్లై చేసిన సయ్యద్ అబ్బాస్ అలీని పోలీసులు అరెస్టు చేశారు. సయ్యద్ అబ్బాస్ అలీ ఫోన్లో ప్రముఖుల చిట్టా ఉంది. ఈ డ్రగ్ కేసులో సయ్యద్‌తో పలువురు చాటింగ్ చేశారు. గతంలో సయ్యద్ రాడిసన్ హోటల్లో ఉద్యోగిగా పనిచేశారు. డ్రగ్ పార్టీలో పరారీలో ఉన్న ఇద్దరు యువతులు నటి లిషి, శ్వేత కోసం పోలీసులు గాలిస్తున్నారు.
కాగా రాడిసన్ హోటల్లో డ్రగ్స్ వ్యవహారంలో ప్రధాన నిందితుడు వివేకానంద వాంగ్మూలం మేరకు.. పోలీసులు క్రిష్ పేరును ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు మంగళవారం క్రిష్‌తో ఫోన్లో మాట్లాడారు. విచారణకు హాజరవ్వాలని, ఈ కేసు దర్యాప్తునకు సహకరించాలని కోరారు. అయితే.. తాను బయట ఉన్నానని, బుధవారం విచారణకు వస్తానని పోలీసులతో అన్నారు. అయితే ముంబైలో ఉన్న నేపథ్యంలో మరో రెండు రోజులు సమయం కావాలని క్రిష్ కోరారు. క్రిష్‌తోపాటు.. లిషి గణేశ్ పేర్లు వెలుగులోకి రావడంతో.. తాజా ఘటన మరోసారి టాలీవుడ్‌ను ఉలిక్కిపడేలా చేసింది.
పరారీలో ప్రముఖులు
ఈ కేసులో మొత్తం పది మంది ఉన్నట్లు ఎఫ్ఐఆర్ స్పష్టం చేస్తుండగా.. వివేకానంద, అతనికి డ్రగ్స్ సరఫరా చేసే అబ్బాస్, కేదార్, నిర్భయ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. కేదార్, నిర్భయ్‌లకు నార్కోటిక్స్ పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలినట్లు మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. మిగతా ఆరుగురు పరారీలో ఉన్నారు. వీరంతా నగరంలోనే ఉన్నారా? అనేదానిపై పోలీసులు దృష్టి సారించారు. వీరిలో.. క్రిష్‌తోపాటు.. సెలబ్రిటీలు శ్వేత, నీల్, సినీనటి లిషి, సందీప్, రఘుచరణ్ ఉన్నారు. వీరిని పట్టుకునేందుకు గచ్చిబౌలి, ఎస్వోటీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీసీపీ చెప్పారు. వారు డ్రగ్స్ తీసుకున్నారా? లేదా? అనేదాన్ని బట్టి కేసు దర్యాప్తులో పురోగతి ఉంటుందని వివరించారు. అబ్బాస్ అనే డ్రగ్ పెడ్లర్ గతంలో మంజీరా గ్రూప్‌లో పనిచేశాడని, అప్పటి నుంచే వివేకానందకు అతనితో పరిచయం అని పోలీసులు తెలిపారు. వివేకానందకు అతను 10 సార్లు డ్రగ్స్‌ను సరఫరా చేశాడని వెల్లడించారు. కాగా.. తనపేరు బయటకు రావడంపై క్రిష్ స్పందించారు. తాను ఆరోజు రాడిసన్ హోటల్‌కు వెళ్లింది నిజమేనని, ఓ అరగంట ఉండి.. సాయంత్రం 6.45కు బయటకు వచ్చానని వివరించారు. ఈ క్రమంలో వివేకానందతో కాసేపు మాట్లాడానన్నారు. పోలీసుల విచారణకు హాజరవుతానని చెప్పారు.
ఆ రెండు గదుల కథేంటి?
గచ్చిబౌలిలోని రాడిసన్ యజమాని వివేకానంద ఆ హోటల్ 12వ అంతస్తులోని 1200 1204 నంబర్ ఉన్న గదులను సొంత పార్టీల కోసం కేటాయించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ‘‘బయటి నుంచి చూస్తే.. ఇవి వేర్వేరు గదులు. లోపల మాత్రం రెండు గదులకు మధ్య ద్వారం ఉంటుంది’’ అని పోలీసులు వివరించారు. ఈ గదుల్లోనే డ్రగ్స్ పార్టీలు జరిగేవని గుర్తించామన్నారు. గతంలో ఎప్పుడెప్పుడు పార్టీలను నిర్వహించారు? ఎవరెవరు ఎంత డ్రగ్స్ తీసుకున్నారు? అనే కోణంపై మరో బృందం దృష్టి సారించింది. ఈ కోణంలో ఇప్పటికే పలు వివరాలను సేకరించిన పోలీసులు..ఆధారాలు లభిస్తే మరిన్ని ఎఫ్ఐఆర్లను నమోదు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.