Protest: శంషాబాద్ ఎయిర్‌పోర్టు రహదారిపై ట్రాఫిక్ జామ్.. ఎందుకంటే?
ABN , Publish Date - Aug 05 , 2024 | 12:25 PM
పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
హైదరాబాద్: పెండింగ్ స్కాలర్షిప్(Pending Scholarships) ఫీజులు వెంటనే చెల్లించాలంటూ విద్యార్థులు చేపట్టిన ధర్నాతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెండింగ్‌లో ఉన్న ఫీజులు చెల్లించాలని గత కొన్ని రోజులుగా వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతున్నాయి. అయితే ఇదే అంశంపై ఏబీవీపీ ఆధ్వర్యంలో సుమారు 2వేల మంది విద్యార్థులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లే ప్రధాన రహదారిపై భైఠాయించారు.
తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కోరికలు తీర్చే వరకూ రోడ్డుపై నుంచి లేచేదే లేదంటూ భీష్మించారు. భారీగా ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెంటనే ధర్నాను నిలిపివేయాలంటూ విద్యార్థులకు సూచించారు. వారు నిరాకరించడంతో ఏబీవీపీ నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రాఫిక్ జామ్‌తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా విదేశాలు వెళ్లాల్సిన ప్రయాణికులు విమానాశ్రయానికి చేరుకోవడం కష్టంగా మారడంతో అయోమయానికి గురవుతున్నారు.