Share News

Minister Thummala: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..

ABN , Publish Date - Dec 02 , 2024 | 01:54 PM

ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల చెప్పారు.

Minister Thummala: సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు సైతం ఆయిల్ పామ్ సాగు బాట పట్టారు..
Minister Tummala Nageswara Rao

ఖమ్మం: ఆయిల్ పామ్ సాగుతో రైతన్నను రాజుగా మార్చడమే తన కలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రైతులు నష్టాల బారిన పడకుండా లాభాలు తెచ్చిపెట్టే పంట ఆయిల్ పామ్ అని తుమ్మల చెప్పారు. తాను మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయ్యే నాటికి పామాయిల్ గెల ధర భారీగా పెరిగిందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం టన్ను పామాయిల్ గెలల ధర రూ.20,413 ఉన్నట్లు ఆయన వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పొలం బాట పట్టేలా ఆయిల్ పామ్ సాగు ఉందని, తెలంగాణను ఆయిల్ పామ్ సాగుకు హబ్‌గా మార్చడమే తన జీవిత లక్ష్యమని చెప్పుకొచ్చారు.


ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. "నా చిరకాల కోరిక సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయడం. ఆగస్టు 15, 2025 కల్లా సీతారామ ప్రాజెక్టు ద్వారా సాగునీరు అందిస్తాం. రూ.66 కోట్లతో మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంక్రాంతి నాటికి శంకుస్థాపన చేస్తాం. జాతీయ రహదారుల ఏర్పాటుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతి బాట పడుతోంది. నా రాజకీయ జీవితంలో ఇరిగేషన్ నేషనల్ హైవేల కోసం క్యాబినెట్‌లో పనిచేసే అవకాశం లభించింది. రైతు బిడ్డనైన నాకు వ్యవసాయ శాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి పనిచేసే అవకాశం కల్పించారు.


ఉద్యాన పంటలు సాగుతో రైతాంగానికి మేలు జరుగుతుంది. ఎకరాకు నాలుగు ఏళ్లలో రూ.50 వేలు ప్రోత్సాహకం అందిస్తాం. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీ నిర్మాణం చేయనున్నాం. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈనెల 7న దానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రభుత్వ ఆస్పత్రిలో వసతులు కల్పించడం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో సీట్ల పెంపుపై ఆరోగ్య శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపా. విద్యా రంగంలో అంతర్జాతీయస్థాయి ప్రఖ్యాతి గాంచిన స్వామి నారాయణ ట్రస్ట్ గురుకుల పాఠశాల ఏర్పాటు చేస్తున్నాం.


ఖమ్మం ఎమ్మెల్యేగా క్యాబినెట్‌లో ఉండే అవకాశం రావడం నియెజకవర్గ ప్రజల ఆశీర్వాదం. రఘునాథపాలెం మండలం సాగునీటి కష్టాలు తీరేలా సాగర్ కాలువపై లిఫ్ట్ ఏర్పాటు చేస్తాం. దిగుమతి సుంఖాలు పెంచడం వల్ల దేశీయంగా ఆయిల్ పామ్ రైతాంగానికి లాభాలు వస్తాయి. ఏడాదికి లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అరాచకం, అక్రమాలు లేని ప్రశాంతమైన ఖమ్మం కోసం ప్రజలు గత ఎన్నికల్లో తీర్పు ఇచ్చారు. ప్రజాపాలనలో ప్రజలు కోరినట్లుగానే ఖమ్మం ప్రగతి బాట పడుతోంది" అని అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:
G News: కారుతో ఢీకొట్టి.. ఆపై కత్తితో దాడి చేసి.. హైదరాబాద్‌లో దారుణం

Suicide: ములుగు జిల్లాలో ఎస్ఐ ఆత్మహత్య

Updated Date - Dec 02 , 2024 | 01:56 PM