Kishan Reddy: మద్దతు ధరపై కాంగ్రెస్ మొసలి కన్నీరు..
ABN, Publish Date - Jul 30 , 2024 | 04:21 AM
పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రైతు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు రైతు సమస్యలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శించారు.
కౌలు రైతులకు రూ.15వేల సాయం ఏమైంది
వరికి రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
లోక్‌సభలో బీజేపీ విప్‌గా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 29 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు వేదికగా ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ రైతు రాజకీయాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. 2004 నుంచి 2014 వరకు రైతు సమస్యలను కాంగ్రెస్ గాలికొదిలేసిందని విమర్శించారు. నిపుణుల కమిటీల రిపోర్టులను తుంగలో తొక్కిన కాంగ్రెస్.. ఇవాళ మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతులకు సమయానుగుణంగా కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) ఇస్తున్నా బురదజల్లే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ మొసలి కన్నీళ్లను ప్రజలు, రైతులు నమ్మే పరిస్థితి లేదని సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2004లో యూపీఏ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత.. రూపొందించుకున్న కనీస ఉమ్మడి ప్రణాళిక(సీఎంపీ)లో పేర్కొన్నట్లుగా ఎం.ఎస్ స్వామినాథన్ నేతృత్వంలో ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్ (ఎన్సీఎఫ్)’ ను 2004లో ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.
స్వామినాథన్ కమిటీ.. రైతు పెట్టుబడికి 50 శాతం అదనంగా కనీస మద్దతు ధర ఉండాలని చెప్పిన విషయాన్ని యూపీఏ సర్కారు పట్టించుకోలేదన్నారు. మోదీ అధికారంలోకి రాగానే ఆ సూచనను అమలు చేస్తున్నారని తెలిపారు. సమయానుగుణంగా పంటల ఎమ్మెస్పీలను పెంచుతున్నారని వెల్లడించారు. రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు, సూచనలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో వాగ్దానం చేసినట్లుగా అన్నదాతలకు, కౌలు రైతులకు రూ.15వేల ఆర్థిక సహాయం(రైతు భరోసా), రైతు కూలీలకు రూ.12 వేలు, వరికి రూ.500 బోనస్ ఇస్తామన్న హామీపై రాహుల్ ఎందుకు మాట్లాడరని కిషన్‌రెడ్డి నిలదీశారు.
బీజేపీ హయాంలోనే ఎస్సీ, ఎస్టీలకు గుర్తింపు: ఈటల
బీజేపీ హయాంలోనే దేశంలోని గిరిజనులు, దళితులు, మైనారిటీలకు గుర్తింపు లభించిందని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ తెలిపారు. సోమవారం లోక్ సభలో తొలిసారిగా ఈటల రాజేందర్ మాట్లాడారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాటలు విని ఆశ్చర్యం కలిగిందన్నారు. కాంగ్రెస్ పాలనలో దేశంలోని ఏ వర్గానికీ మంచి జరగలేదన్నారు. తెలంగాణలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఏ ఒక్క దళితుడు, గిరిజనుడు, ఓబీసీ ముఖ్యమంత్రి కాలేదన్నారు. బీజేపీ హయాంలోనే మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాం, దళిత సామాజిక వర్గానికి చెందిన కోవింద్, ఆదివాసీ మహిళ ద్రౌపది ముర్ములకు అవకాశం దక్కిందన్నారు.
లోక్‌సభలో విప్‌గా కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి లోక్‌సభలో బీజేపీ విప్‌గా అవకాశం దక్కింది. లోక్‌సభలో ఒక చీఫ్ విప్‌తో పాటు 16 మంది విప్‌లను నియమించినట్టు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శి శివ్ శక్తినాథ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. చీఫ్ విప్‌గా డాక్టర్ సంజయ్ జైశ్వాల్ నియమితులయ్యారు.
Updated Date - Jul 30 , 2024 | 04:21 AM