Share News

Bhatti: పాత అప్పులు, వడ్డీలకే రూ.56,440 కోట్లు కట్టాం

ABN , Publish Date - Oct 17 , 2024 | 04:13 AM

గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు/అసలుకే ఇప్పటిదాకా రూ.56,440కోట్లు కట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.

Bhatti: పాత అప్పులు, వడ్డీలకే రూ.56,440 కోట్లు కట్టాం

  • మేము వచ్చాక చేసిన అప్పులు రూ.49,618 కోట్లు

  • కేటీఆర్‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్‌

  • వడ్డీలు చెల్లించేందుకే కొత్త అప్పులు

  • ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేంతో కొట్టాలి: మంత్రి సీతక్క

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించి వడ్డీలు/అసలుకే ఇప్పటిదాకా రూ.56,440కోట్లు కట్టామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ రూ.80 వేల కోట్లకు పైగా అప్పులు చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం... ఒక్క ప్రాజెక్టు అయినా కట్టిందా...? డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? అని ‘ఎక్స్‌’ వేదికగా కేటీఆర్‌ అడిగిన ప్రశ్నకు భట్టి కౌంటర్‌ ఇచ్చారు. 2023 డిసెంబరు నుంచి ఈనెల 15వ తేదీ దాకా రూ.49,618 కోట్ల అప్పులు చేశామని, ఇందులో మూలధన వ్యయం కింద రూ.21,881 కోట్లు వెచ్చించామని గుర్తు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక అమలు చేసిన రైతు రుణమాఫీ, రైతు భరోసా, చేయూత, ఎల్పీజీ సబ్సిడీ, మహాలక్ష్మి, గృహజ్యోతి(200 యూనిట్ల దాకా ఉచిత కరెంట్‌), విద్యుత్‌ సబ్సిడీ, రైస్‌ సబ్సిడీ, ఉపకార వేతనాలు, ఆర్టీసీతో పాటు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్‌ వంటి పథకాలకు రూ.54,346 కోట్లు వెచ్చించామని వెల్లడించారు.


ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు వేతనాలు చెల్లిస్తున్నామని కౌంటర్‌ ఇచ్చారు. తొమ్మిదన్నరేళ్లలో బీఆర్‌ఎస్‌ చేసిన అప్పులకు.. వడ్డీలు కట్టడం కోసమే కొత్త అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొందని మంత్రి సీతక్క తెలిపారు. కేటీఆర్‌ పోస్టుపై ‘ఎక్స్‌’ వేదికగానే ఆమె ఘాటుగా స్పందించారు. ‘‘అప్పుల వారసత్వానికి ఆద్యులు మీరే. ప్రతినెలా సగటున రూ.6వేలకోట్ల ప్రజాధనాన్ని మీ అప్పుల కుప్పను కడిగేందుకే సరిపోతోంది. అప్పుల అప్పారావులా అందిన కాడల్లా అప్పు చేసి.. రాష్ట్రాన్ని తిప్పలు పెట్టి, వడ్డీలతో ఆర్థిక వ్యవస్థ నడ్డి విరిచిన మిమ్మల్ని దేంతో కొట్టాలి’’ అని ప్రశ్నించారు. అది చాలదన్నట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్య శ్రీ బకాయిలు మోపారని, చేసిన పనులకు బిల్లులూ చెల్లించలేదని మండిపడ్డారు. ప్రతి శాఖలో వందల కోట్లు బకాయిలు పెట్టి... ఇప్పుడు బుకాయిేస్త ఎలా? అని నిలదీశారు. అప్పులు, బకాయిలు, హమీల విషయమై కేటీఆర్‌ నీతులు చెప్పడం.. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందని విమర్శించారు.

Updated Date - Oct 17 , 2024 | 04:13 AM