Share News

Heavy Rains: వర్షం.. రైతుల్లో హర్షం!

ABN , Publish Date - Jul 01 , 2024 | 04:09 AM

రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అరకొర వానలతో అవస్థలు పడుతున్న అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాధార పంటలైన పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది పంటలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి.

Heavy Rains: వర్షం.. రైతుల్లో హర్షం!

  • రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వానలు.. పత్తి, కంది తదితర పంటలకు ఊపిరి

  • హైదరాబాద్‌లోనూ మోస్తరు వర్షం

  • నేడు, రేపు తేలికపాటి వర్షాలు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అరకొర వానలతో అవస్థలు పడుతున్న అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. వర్షాధార పంటలైన పత్తి, జొన్న, మొక్కజొన్న, కంది పంటలు తిరిగి జీవం పోసుకుంటున్నాయి. సాగు పనులు ఊపందుకోనున్నాయి. ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌తో పాటు హైదరాబాద్‌లో వానలు పడ్డాయి. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో అత్యధికంగా 7.2, ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో 6.9, ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరులో 5.7, వికారాబాద్‌ జిల్లా తాండూరులో 5.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.


పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల్లోకి స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతోంది. రహదారులపై వరద నీరు నిలిచి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. తాండూరు మునిసిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం, కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో రోజంతా ముసురు పట్టడంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పలు జిల్లాల్లో ముసురులోనే రైతు కూలీలు మొక్కజొన్న, పత్తి తదితర పంటల్లో కలుపు తీత పనులు చేపట్టారు.


మణుగురు, ఇల్లెందు, కొత్తగూడెం సింగరేణి ప్రాంతాల్లో భారీ వర్షంతో సింగరేణి ఓపెన్‌కాస్టు గనుల్లో వర్షపునీరు నిలిచిపోవడంతో సుమారు 50 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ములకలపల్లి నుంచి అన్నపురెడ్డిపల్లి గ్రామానికి పాములేరువాగుపై డైవర్షన్‌ రోడ్డు వరద నీటితో కొట్టుకపోవడంతో రెండు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కారణంగా పాత కలెక్టరేట్‌ చౌరస్తా, రైల్వేస్టేషన్‌ చౌరస్తా, రైల్వే కమాన్‌ తదితర ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.


ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు స్థాయిలో వర్షాలు కురిశాయి. ఆ జిల్లాలోని కుంటాల, పొచ్చెర, గాయత్రి, కనకాయి జలపాతాలు వరద నీటితో పరవళ్లు పెడుతున్నాయి. ఆదివారం సెలవు దినం కావడంతో జలపాతాల వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. రాష్ట్రంలో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్‌ తీరాలకు ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతంపై ఉన్న ఆవర్తనం తూర్పు ఝార్ఖండ్‌, దాని పరిసరాల్లో సగటు సముద్రపమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని పేర్కొంది.


మేడిగడ్డకు కొనసాగుతున్న వరద

మహదేవపూర్‌ రూరల్‌: మేడిగడ్డ బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. మానేరు, గోదావరి నదుల నుంచి వచ్చే నీటితో మేడిగడ్డ బ్యారేజీకి ఇన్‌ఫ్లో క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఆదివారం 14,050క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా... ఫ్రీఫ్లో పద్ధతిన వచ్చిన నీటిని వచ్చినట్లే వదిలేస్తున్నారు. కుంగుబాటుకు గురైన బ్లాక్‌-7లో తాత్కాలిక మరమ్మతులు పూర్తయ్యాయి. బ్యారేజీకి దిగువన అప్రోచ్‌రోడ్లను పూర్తిగా తొలగించారు. ఎగువన తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కాఫర్‌డ్యాం వరద వస్తే కొట్టుకుపోతుందనే ఉద్దేశంతో వదిలేసినట్లు తెలుస్తోంది. పగుళ్లు తేలిన పిల్లర్లకు మరమ్మతులు చేసే అవకాశం లేకపోవడంతో వంతెనపై నుంచి వాటి మధ్యలో సిమెంటు, కాంక్రీటు మిశ్రమాలను నింపుతున్నారు.

Updated Date - Jul 01 , 2024 | 04:09 AM