Nalgonda: కుర్చీలోనే ప్రసవించిన నిండు గర్భిణి!
ABN , Publish Date - Aug 24 , 2024 | 03:21 AM
నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. ఈ దారుణం నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది.
నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో దారుణం
నల్లగొండ, ఆగస్టు 23: నిండు గర్భిణి పట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్, నర్సులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆమె కూర్చున్న కుర్చీలోనే ప్రసవించింది. ఈ దారుణం నల్లగొండ జిల్లా ప్రభుత్వాస్పత్రిలో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లా నేరడుగొమ్ము మండలానికి చెందిన గర్భిణి నల్లవెల్లి అశ్వినికి నొప్పులు రావడంతో గురువారం రాత్రి 10గంటల సమయంలో దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి వెళ్లింది. అక్కడ డాక్టర్లు లేకపోవడంతో నర్సులు ఆమెను అంబులెన్స్ ఏర్పాటు చేసి నల్లగొండ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రాత్రి 12.30 గంటలకు ఆమె అక్కడికి చేరుకోగా డాక్టర్ నిఖితతో పాటు నర్సులు అశ్వినిని పరిశీలించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని చెప్పారు.
అరగంట తర్వాత రెండోసారి బీపీని పరీక్షించి ప్రసవానికి ఇంకా సమయం ఉందని, అటూఇటూ నడవాలని సూచించారు. తెల్లవారు జామున 2 గంటల సమయంలో అశ్విని నడుస్తుండగా నొప్పులు అధికమై అక్కడే ఉన్న కుర్చీలో కూర్చోగా ఆ మరుక్షణమే ప్రసవించింది. అశ్విని తల్లి బిడ్డను గట్టిగా పట్టుకొని డాక్టర్లను పిలవగా నర్సులు వచ్చి వైద్య సేవలు అందించారు. అయితే బిడ్డకు మాత్రం ఎలాంటి ప్రమాదం జరగలేదు. డాక్టర్‌తో పాటు నర్సుల నిర్లక్ష్యం వల్లే ఆమె కుర్చీలోనే ప్రసవించినట్టు అధికారులు గుర్తించారు.
ఇందుకు బాధ్యులైన డ్యూటీ డాక్టర్ నిఖితతో పాటు స్టాఫ్ నర్సులు ప్రమీల, ఉమ, పద్మ, సుజాతలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అదేవిధంగా దేవరకొండ ప్రభుత్వాస్పత్రిలో డాక్టర్ శాంతి స్వరూప లేకపోవడం, నర్సుల నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతో డాక్టర్ శాంతి స్వరూపతో పాటు నర్సులు విజయలక్ష్మి, సైదమ్మ, మౌనిక, సరితలను సస్పెండ్ చేయాలని డీసీహెచ్‌ఎ్‌సకు అదనపు కలెక్టర్ పూర్ణచంద్ర ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం సందర్శించిన అదనపు కలెక్టర్.. దేవరకొండ, నల్లగొండ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటనలపై కలెక్టర్‌కు ప్రాథమిక నివేదికలు సమర్పించారు.