Tummala: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను నిర్మించండి
ABN , Publish Date - Aug 20 , 2024 | 06:01 AM
ఆయిల్‌పామ్ కంపెనీలు వెంటనే ఫ్యాక్టరీల నిర్మాణాలు చేసి, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ మొదలుపెట్టేలా కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
పరిశ్రమల పరిధిలో సాగును పెంచండి
లక్ష్యాన్ని పూర్తి చేయకపోతే చర్యలు తప్పవు: తుమ్మల
హైదరాబాద్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): ఆయిల్‌పామ్ కంపెనీలు వెంటనే ఫ్యాక్టరీల నిర్మాణాలు చేసి, ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ మొదలుపెట్టేలా కార్యాచరణ ప్రారంభించాలని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం టార్గెట్ పూర్తి చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై 14 కంపెనీల నిర్వాహకులతో సోమవారం సచివాలయంలో తుమ్మల సమీక్ష నిర్వహించారు.
రాష్ట్రంలో పంట ఉత్పత్తి చేస్తూ, ఇతర రాష్ట్రాలకు ఆయిల్ పామ్ గెలలను తరలించేందుకు తమ ప్రభుత్వం అనుమతించదని తెలిపారు. అన్ని కంపెనీలు ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. ఫ్యాక్టరీ పూర్తయ్యే నాటికి ఫ్యాక్టరీ పరిధిలో కనీసం 10 వేల ఎకరాల్లో ఆయిల్ పామ్ గెలలు వచ్చేలా సాగు విస్తీర్ణాన్ని పెంచాలన్నారు.
2024-25 సంవత్సరానికి గాను లక్ష ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేపట్టేందుకు ప్రణాళిక చేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 12,448 ఎకరాల్లో మాత్రమే సాగులోకి తేవడం పట్ల మంత్రి తుమ్మల అసహనం వ్యక్తం చేశారు.