సచివాలయంలో పార్కింగ్ సౌకర్యం!
ABN , Publish Date - Apr 22 , 2024 | 05:14 AM
ఎట్టకేలకు సచివాలయంలో వాహనాల పార్కింగ్, డ్రైవర్ల సమస్యలు తీరనున్నాయి. పార్కింగ్, డ్రైవర్ల కోసం రెస్ట్ రూమ్‌లతో పాటు మరికొన్ని సౌకర్యాల కల్పనకు రంగం సిద్ధమైంది. దీనికి

డ్రైవర్ల కోసం రెస్ట్ రూమ్‌ల నిర్మాణం
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో చర్యలు
15 కోట్లతో కొత్తగా అంచనాల తయారీ
హైదరాబాద్, ఏప్రిల్ 21(ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు సచివాలయంలో వాహనాల పార్కింగ్, డ్రైవర్ల సమస్యలు తీరనున్నాయి. పార్కింగ్, డ్రైవర్ల కోసం రెస్ట్ రూమ్‌లతో పాటు మరికొన్ని సౌకర్యాల కల్పనకు రంగం సిద్ధమైంది. దీనికి ఆర్ అండ్ బీ అధికారులు అంచనాలు సిద్ధం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ నిర్మాణాలు పూర్తి చేయాలని నిర్ణయించారు. పార్కింగ్ సౌకర్యం కోసం సోలార్ రూఫ్‌టాప్ సహా మరో రెండు రకాల నమూనాలు పరిశీలిస్తున్నారు. సుమారు రూ.15 కోట్ల మేర ఖర్చవుతుందని భావిస్తున్నారు. ‘వాహనాలు నిలువ నీడ లేకపాయే.!’ శీర్షికన ఏప్రిల్ 6న ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. ఆ కథనం చర్చనీయాంశం అవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సచివాలయ నిర్మాణ సమయంలో పార్కింగ్ కోసం సిద్ధం చేసిన మ్యాప్‌ను పరిశీలించడంతో పాటు అప్పుడు ఎందుకు ఏర్పాటు చేయలేకపోయామనే దానిపై చర్చించుకున్నారు. డ్రైవర్లకు కనీస సౌకర్యాలు కల్పించలేకపోవడంపైనా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త నమూనా సిద్ధం చేస్తున్నారు. వాస్తవానికి అప్పట్లో పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు కోసం రూ.10 కోట్లు అవసరమవుతాయని నిర్ణయించి, బడ్జెట్ కూడా కేటాయించారు. కానీ కార్యరూపం దాల్చలేదు. దీంతో గతంలో కేటాయించిన పనులను రద్దు చేయనున్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి లేఖ రాయాలని అధికారులు నిర్ణయించారు.
ఎంట్రీ పాయింట్ సమస్య ఎలా?
సందర్శకుల ఎంట్రీ పాయింట్ అంశంపైనా స్పష్టత రావాల్సి ఉంది. మంత్రులు, అధికారులను కలిసేందుకు వచ్చేవారు పాసులు జారీ చేసే కౌంటర్ నుంచి లోపలికి వెళ్లాలంటే కిలోమీటరుకు పైగా దూరం ఉంది. దాంతో వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కౌంటర్ ఎదురుగా నుంచే సచివాలయంలోకి వెళ్లేలా మార్గం ఏర్పాటు చేయడంతో పాటు, వృద్ధులు, వికలాంగులు వెళ్లేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు అందుబాటులో ఉంచాలని పలువురు సూచిస్తున్నారు. సచివాలయం ప్రారంభోత్సవ సమయంలో నలుగురు వెళ్లేందుకు వీలుగా రెండు, మూడు ఎలక్ట్రిక్ వాహనాలను అక్కడ ఉంచారు. వాటిని ఇప్పుడు వృద్ధులు, వికలాంగుల కోసం వినియోగించాలని ప్రభుత్వానికి వినతులు వస్తున్నాయి.