Share News

Narsapur: సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ..

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:32 AM

వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో చెలరేగిన వివాదం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది.

Narsapur: సునీతారెడ్డి ఇంటి వద్ద రచ్చ..

  • వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసులు కాల్చే విషయంలో వివాదం

  • కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల ఘర్షణ

  • ఓర్వలేకనే మాపై దాడి: ఎమ్మెల్యే సునీత

నర్సాపూర్‌/శివ్వంపేట, సెప్టెంబరు 23: వినాయక నిమజ్జనం సందర్భంగా టపాసుల కాల్చే విషయంలో చెలరేగిన వివాదం బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటి వద్ద కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ శ్రేణుల మధ్య రాజకీయ రచ్చకు దారి తీసింది. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం గోమారంలో భగత్‌సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వినాయక నిమజ్జన యాత్ర చేపట్టారు. యాత్ర ఆదివారం అర్ధరాత్రి ఒంటి సమయంలో ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్దకు చేరుకోగా.. అక్కడ టపాసులు కాల్చారు. దీంతో సునీతారెడ్డి ఇంట్లో ఉన్న కొందరు బయటకు వచ్చి టపాసులు కాల్చవద్దని చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. వివాదం ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని నిలువరించే ప్రయత్నం చేశారు.


విషయం తెలిసిన ఎమ్మెల్యే సునీతారెడ్డి సోమవారం ఉదయం ఇంటికి వచ్చి.. జరిగిన ఘటనపై ఆరా తీశారు. గాయపడిన వారితో పోలీసులకు ఫిర్యాదు చేయించారు. తాను నిరంతరం ప్రజల మధ్య ఉంటూ, వారితో మమేకమవుతుంటే జీర్ణించుకోలేక ఇక్కడి కాంగ్రెస్‌ నాయకులు ఇలా దాడులకు పాల్పడుతున్నారని సునీతారెడ్డి పేర్కొన్నారు. తమను భయబ్రాంతులకు గురిచేయడానికే ఈ దాడి చేశారని అన్నారు. విషయం తెలిసిన మాజీ మంత్రి హరీశ్‌ రావు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతప్రభాకర్‌, అందోలు మాజీ ఎమ్మెల్యే క్రాంతి.. సునీతారెడ్డి ఇంటికి వచ్చారు.


ఘటన వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలమంతా కలిసి డీజీపీ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, ఫ్యాక్షనిస్టుల్లా దాడులకు పాల్పడటం దారుణమన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వరుసగా జరుగుతున్న దాడుల వెనుక కాంగ్రెస్‌ ప్రభుత్వంలోని పెద్దల ప్రమేయం ఉందని ఆరోపించారు.

Updated Date - Sep 24 , 2024 | 03:32 AM