Seethakka: 22 జిల్లాల్లో మహిళా శక్తి భవనాలు
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:56 AM
మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకుగాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ‘ఇందిరా మహిళా శక్తి భవనాల’ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఒక్కో భవనానికి రూ.5 కోట్లు.. ఉత్తర్వులు జారీ
ఎస్‌హెచ్‌జీలు మరింత బలోపేతం: మంత్రి సీతక్క
హైదరాబాద్, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): మహిళా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకుగాను రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ‘ఇందిరా మహిళా శక్తి భవనాల’ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా జిల్లాల్లో భవనాల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కార్యదర్శి లోకేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. మేడ్చల్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, కామారెడ్డి, నిజామాబాద్, ములుగు, నారాయణపేట, జగిత్యాల, భూపాలపల్లి, వనపర్తి, మెదక్, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్, నిర్మల్, మహబూబాబాద్, కొత్తగూడెం, జనగామ, ఆసిఫాబాద్, పెద్దపల్లి, గద్వాల జిల్లాల పరిధిలో చేపట్టే భవనాల నిర్మాణానికి అనుమతులిచ్చారు.
ఒక్కో భవనానికి రూ.5 కోట్ల చొప్పున.. మొత్తం రూ.110 కోట్ల వ్యయంతో చేపట్టాలని నిర్ణయించారు. కాగా, ఇప్పటివరకు 10 జిల్లాల్లోనే మహిళా సంఘాల సమాఖ్యలకు సొంత భవనాలున్నాయని మిగిలిన 22 జిల్లాల్లో భవనాల అవసరం గుర్తించి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని మంత్రి సీతక్క తెలిపారు. ఈ భవనాల నిర్మాణం ద్వారా స్వయం సహాయక సంఘాలను మరింత బలోపేతం చేసేందుకు అవకాశం ఏర్పడుతుందన్నారు.