Bhatti Vikramarka: కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది పాత్ర అనివార్యం కావాలి
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:39 AM
కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యమయ్యేలా పార్లమెంటు నియోజకవర్గాల విభజన ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు.

ఆ దిశగా నియోజకవర్గాల పునర్విభజన ఉండాలి
దీనిపై ఎలా ముందుకెళ్లాలో అభిప్రాయాలు చెప్పండి
అఖిలపక్ష సమావేశంలో భట్టి కొంతకాలం ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలి: జానారెడ్డి
అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరిస్తాం: నేతలు భేటీకి బీఆర్‌ఎస్, బీజేపీ గైర్హాజరు
హైదరాబాద్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి): కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో దక్షిణాది రాష్ట్రాల పాత్ర అనివార్యమయ్యేలా పార్లమెంటు నియోజకవర్గాల విభజన ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అన్నారు. నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయని, ప్రధానంగా తెలంగాణకు తీవ్ర నష్టం జరుగుతుందని తెలిపారు. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలో అభిప్రాయాలు అఖిలపక్ష నాయకులు చెప్పాలని కోరారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలోని కమిటీ హాల్‌లో నియోజకవర్గాల పునర్విభజనపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం మాట్లాడారు. సమావేశానికి బీఆర్‌ఎ్‌సను కూడా ఆహ్వానించినా.. వారు ప్రత్యేక రాజకీయ కారణాలతో హాజరు కాలేమని చెప్పినట్లు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పార్లమెంటు సమావేశాల్లో బిజీగా ఉండడం, ప్రత్యేక రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో హాజరు కాలేదని పేర్కొన్నారు. సమావేశానికి హాజరైన నేతలంతా ఇచ్చిన సమాచారం మేరకు భవిష్యత్తు ప్రణాళికను రూపొందిస్తామన్నారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ శాసన సభలో ఏకగ్రీవ తీర్మానం చేసి, కేంద్రానికి పంపాలని అక్బరుద్దీన్ ఒవైసీ సూచించారు. కాగా, దేశంలో ఆందోళనలకు దారి తీయకుండా ఉండేందుకు కొంతకాలం పాటు ప్రస్తుత విధానాన్నే కొనసాగించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అభిప్రాయపడ్డారు. శాస్త్రీయ నిర్ణయం వెలువడే వరకు పునర్విభజన ప్రక్రియను వాయిదా వేయాలని కేశవరావు అన్నారు. ఉత్తరాదిలో పెరుగుతున్న సీట్లకు అనుగుణంగానే దక్షిణాది రాష్ట్రాల్లోనూ సీట్ల సంఖ్యను పెంచాలని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, జాన్ వెస్లీ సూచించారు. కాగా, నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేయడం అభినందనీయమని సీపీఎం మాస్‌లైన్ నేత హనుమేశ్ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై విస్తృతంగా చర్చ, కార్యక్రమాలు చేపట్టాలని నేతలు ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ విషయంలో అఖిలపక్ష కమిటీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆచరించడానికి తాము సిద్ధమని తెలిపారు.
కాంగ్రెస్ సర్కారుకు స్పష్టతలేదు: కేటీఆర్
నియోజకవర్గాల పునర్విభజన అంశంలో కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం స్పష్టతలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. అఖిలపక్ష సమావేశ నిర్వహణపై కూడా వారికి స్పష్టతలేదని సోమవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణకు దక్షిణాది రాష్ర్టాలకు జరగనున్న నష్టాలపై దేశంలో మొదట మాట్లాడింది బీఆర్‌ఎస్ పార్టీయేనన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేనందున.. దీనిపై కేంద్ర ప్రభుత్వంపై పోరాడతామని తెలిపారు. ఈ నెల 22న చెన్నైలో చేపట్టే డీఎంకే సమావేశానికి బీఆర్‌ఎస్ తరఫున తానే హాజరై పార్టీ విధానాన్ని బలంగా వినిపిస్తానన్నారు.