Share News

Hyderabad: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

ABN , Publish Date - Oct 24 , 2024 | 03:59 AM

తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ అనుమతించాలని.. అలా అనుమతించకుంటే ఎంతవరకైనా వెళతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌ రెడ్డి అన్నారు.

Hyderabad: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి

  • అనుమతించకుంటే ఎంతవరకైనా వెళ్తాం

  • కృష్ణా జలాలు తెలంగాణ నుంచే వెళతాయన్న సంగతి మరవొద్దు

  • ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌రెడ్డి వ్యాఖ్యలు

మహబూబ్‌నగర్‌, అక్టోబరు 23: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ అనుమతించాలని.. అలా అనుమతించకుంటే ఎంతవరకైనా వెళతామని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్‌ రెడ్డి, జనుంపల్లి అనిరుధ్‌ రెడ్డి అన్నారు. ఏపీకి కృష్ణా, గోదావరి జలాలు తెలంగాణ నుంచే వస్తాయన్న విషయం గుర్తుంచుకోవాలని వారు హెచ్చరించారు. ఏపీ సీఎం చంద్రబాబు తమ మాట వినేలా ఒత్తిడి తీసుకువస్తామని చెప్పారు. ‘‘మా నుంచి వచ్చే కృష్ణానది జలాలను వాడుకుంటున్న మీరు.. వెంకన్న స్వామి దర్శనానికి మా ఎమ్మెల్యేల లేఖలను ఎందుకు అనుమతించరో తేల్చుకోవాలి. లేదంటే మీకు తిప్పలు తప్పవు’’ అని వ్యాఖ్యానించారు.


బుధవారం మహబూబ్‌నగర్‌లో జరిగిన ముడా చైర్మన్‌ లక్ష్మణ్‌యాదవ్‌ ప్రమాణస్వీకారోత్సవ సభలో వారు మాట్లాడారు. ‘‘తెలంగాణకు అంధ్రప్రదేశ్‌ నాయకులు ఆస్తుల కోసం, వ్యాపారం కోసం వస్తారటగానీ.. తెలంగాణ ప్రజలు వద్దట. అలా అయితే తెలంగాణకు చంద్రబాబు రావలసిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించారు. తమ సిఫారసు లేఖలతో తెలంగాణ ప్రజలకు వెంకన్న దర్శనం ఇప్పించలేకపోవడం బాధాకరమన్నారు. ఇది తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల ఆవేదన అని.. అసెంబ్లీ సమావేశాలలో దీన్ని సీఎం రేవంత్‌ దృష్టికి తీసుకెళ్లి, ఏపీ సీఎం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తామని స్పష్టంచేశారు.

Updated Date - Oct 24 , 2024 | 03:59 AM