TGPSC: డిసెంబరుకు గ్రూప్-2 వాయిదా..
ABN , Publish Date - Jul 20 , 2024 | 04:52 AM
గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది.
డిప్యూటీ సీఎంను కలిసిన అభ్యర్థులు వాయిదా అంశాన్ని పరిశీలించాలని టీజీపీఎస్సీ
చైర్మన్‌కు సూచించిన భట్టి పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన కమిషన్
హైదరాబాద్/తార్నాక, జూలై 19 (ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 పరీక్షలు వాయిదా పడ్డాయి. ఆగస్టు 7, 8వ తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను డిసెంబరుకు వాయిదా వేశారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ (టీజీపీఎస్సీ) శుక్రవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. వరుసగా పోటీ పరీక్షలు ఉన్నందున గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతున్న విషయం తెలిసిందే. ఈ నెల 18న ప్రారంభమైన డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5 వరకు కొనసాగనున్నాయి. వెంటనే ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు ఉన్నాయి. దీంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గ్రూప్-2 అభ్యర్థులు, నిరుద్యోగులు శుక్రవారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు.
గ్రూప్-2 పరీక్షలను డిసెంబరులో నిర్వహించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధికారులతో చర్చిస్తామని భట్టి చెప్పారు. వెంటనే టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్‌రెడ్డికి ఫోన్ చేసి, పరీక్షలను డిసెంబరు చివరి వారానికి వాయిదా వేసే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ఉద్యోగ ఖాళీలను గుర్తించి, త్వరలోనే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తామని భట్టి తెలిపారు. ప్రభుత్వాన్ని బెదిరించి, కేసుల పాలైతే అభ్యర్థులే నష్టపోతారని అన్నారు. స్వార్థ రాజకీయాలతో కొందరు చేసే కుట్రల్లో ఇరుక్కుని నష్టపోవద్దని అభ్యర్థులకు హితవు పలికారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం నియోజకవర్గాల్లో అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామన్నారు. మంత్రి భట్టి సూచనల తర్వాత గ్రూప్-2 పరీక్షలను డిసెంబరుకు వాయిదా వేస్తున్నట్లు టీజీపీఎస్సీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే పరీక్షల తేదీలను మాత్రం ప్రకటించలేదు.
ఇది నిరుద్యోగుల విజయం: బీజేపీ
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం నిరుద్యోగుల విజయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తెలిపారు. నిరుద్యోగులకు మద్దతుగా బీజేపీ చేసిన పోరాటానికి ప్రభుత్వం దిగి వచ్చిందన్నారు. కొత్త తేదీల ప్రకటనతో పాటు పోస్టుల సంఖ్య పెంపుపై కూడా సానుకూల నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
ఓయూలో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేయడాన్ని హర్షిస్తూ టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ ఆధ్వర్యంలో అభ్యర్థులు శుక్రవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.