Share News

KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..

ABN , Publish Date - Jul 06 , 2024 | 04:10 PM

రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిష్కారం కానీ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి.. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్‌లో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో స్పందించారు.

KCR: రోజా ఇంట్లో చేపల పులుసు తిని..
Congress Party MLC Thinmar Mallanna

హైదరాబాద్, జులై 06: రాష్ట్ర విభజన నేపథ్యంలో పరిష్కారం కానీ సమస్యలపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్‌రెడ్డి.. ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్‌లో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హైదరాబాద్‌లో స్పందించారు. ఇలా ఈ ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ శుభసూచకమని తెలుగు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారన్నారు. రాష్ట్రాలు విడిపోయినా.. అన్నదమ్ముల వలె విభజన హామీల పరిష్కారం కానీ అంశాలు పరిష్కారం కోసం ఈ చర్చ జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రాష్ట్రం పట్ల ఉన్న ప్రేమ అందరికీ అర్ధమవుతుందన్నారు.

ప్రజల ఆకాంక్షల మేరకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతుంటే.. దీనిని రాజకీయంగా ఉపయోగించుకొని బురద చల్లాలని బీఆర్ఎస్ పార్టీ నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. కేసీఆర్‌తోపాటు ఆయన పరివారానికి నచ్చడం లేదన్నారు. గత ముఖ్యమంత్రులు కేసిఆర్, జగన్‌లు పదేళ్లు స్వార్థ రాజకీయాల తప్ప.. సమస్యల పరిష్కారం కోసం కనీసం చర్చ కూడా చేయలేదని ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న గుర్తు చేశారు.


అలాగే నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఇంట్లో చేపల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తా అని సీఎం కేసిఆర్ గతంలో చెప్పారన్నారు. అయితే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపారని.. మరి ఆ విషయాన్ని నేడు ఇంతగా రచ్చ చేయడం చూస్తుంటే.. హంతకులే సంతాపం తెలిపినట్లుగా ఉందని బీఆర్ఎస్ నేతల వైఖరిపై తీన్మార్ మల్లన్న నిప్పులు చెరిగారు.

పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పని చేస్తుందన్నారు. ఆంధ్రా నుంచి రావాల్సిన వాటా వదిలిపెట్టి ఇక్కడి సంపద అక్కడికి బీఆర్ఎస్ నేతలు తరలించారని ఆరోపించారు. ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ఇప్పటికైనా ప్రతిపక్ష పాత్ర పోషిస్తే బాగుంటుందని తీన్మార్ మల్లన్న ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు. ఇరు రాష్ట్రాల సీఎంలా భేటీని వివాదం చేయాలని చూస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిపై మండిపడ్డారు.


తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఆర్థిక, భూ దోపిడీ చేసిందని.. ఆ పార్టీ ప్రజా సమస్యలపై ఎప్పుడు ఆలోచన చేయలేదన్నారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణను.. కుక్కలు చింపిన విస్తరి చేశాడంటూ కేసీఆర్‌పై తీన్మార్ మల్లన్నా ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. కేసిఆర్ పార్టీ దినదిన గండం అన్నట్లు సాగుతుందన్నారు. కేసిఆర్ గతంలో చేసిన పాపాలను సీఎం రేవంత్ రెడ్డి కడగల్సిన పరిస్థితి ఉందన్నారు. గతంలో సీఎంలు కేసిఆర్, జగన్‌లు చీకటి భేటీ లయ్యేవారన్నారు. ప్రతి దానిలో కేసిఆర్ కుటుంబం రాజకీయ ప్రయోజనాలు చూస్తుందన్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ప్రజల ప్రయోజనాలు చేస్తున్నారని వివరించారు. తెలంగాణ ఆకాంక్షను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నా సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజల తరుపున తీన్మార్ మల్లన్న ధన్యవాదాలు తెలిపారు.

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 06 , 2024 | 04:11 PM