Madhapur: డ్రగ్స్‌కు బానిసైతే భవిష్యత్తు అంధకారం..
ABN , Publish Date - Jun 27 , 2024 | 05:20 AM
మాదకద్రవ్యాలకు బానిసైతే ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని, యువత వ్యసనాలను వీడి లక్ష్యం వైపు అడుగులేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు.
యువత వ్యసనాలు వీడి ఉన్నత లక్ష్యాలు చేరాలి: జూపల్లి
మాదక ద్రవ్యాల మత్తులోనే లైంగిక దాడులు, హత్యలు: సీతక్క
మాదాపూర్, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాలకు బానిసైతే ఉజ్వల భవిష్యత్తు అంధకారమవుతుందని, యువత వ్యసనాలను వీడి లక్ష్యం వైపు అడుగులేసి ఉన్నత స్థాయికి చేరుకుని భావితరాలకు స్ఫూర్తిగా నిలవాలని ఎక్సైజ్, పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం మాదాపూర్‌లోని శిల్పకళావేదికలో తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో నిర్వహించిన ‘డ్రగ్స్ నియంత్రణ.. అక్రమ రవాణా’పై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రి సీతక్కతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ.. మానవ జన్మ ఎంతో ఉత్తమమైనదని.. కానీ చెడు వ్యసనాల కారణంగా అనారోగ్యం పాలైన చాలామంది అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచానికి ఉగ్రవాదం తర్వాత అంతటి పెనుసవాలుగా డ్రగ్స్ వినియోగం మారిందన్నారు.
పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు కూడా డ్రగ్స్ చేరడం ఆందోళన కలిగించే విషయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో డ్రగ్స్ నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఎంతో డ్రగ్ పెడర్లతో పాటు వినియోగిస్తున్న వారినీ అదుపులోకి తీసుకుని కేసులు పెట్టామని వెల్లడించారు. సీతక్క మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల మాఫియా ప్రపంచాన్ని గడగడలాడించి, కోట్లు కొల్లగొడుతోందన్నారు. మాదకద్రవ్యాల మత్తులో లైంగిక దాడులు, హత్యలు చేస్తున్నారని, పెద్దపల్లిలో చిన్నారిపై లైంగికదాడి హత్య ఘటన మనసును కలవరపెట్టిందన్నారు. డ్రగ్స్ అనర్థాలపై మెగాస్టార్ చిరంజీవి సందేశంతో కూడిన వీడియో, పాటను మంత్రులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీజీపీ రవి గుప్తా, మాజీ క్రికెటర్ మిథాలీరాజ్, సినీ నటులు సుమన్, తేజా సజ్జా, గాయకుడు రామ్ మిరియాల, అధికారులు పాల్గొన్నారు.