ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా ..

ABN, Publish Date - Sep 01 , 2024 | 07:48 AM

హైదరాబాద్: ముంబైకి చెందిన నటి కాదంబరీ జెత్వానీ విషయంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు చూస్తున్నాం. ఐపీఎస్‌ అధికారులు సైతం తమ బాధ్యతను విస్మరించి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నారు.

హైదరాబాద్: ముంబైకి చెందిన నటి కాదంబరీ జెత్వానీ విషయంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో ఇప్పుడు చూస్తున్నాం. ఐపీఎస్‌ అధికారులు సైతం తమ బాధ్యతను విస్మరించి ప్రభుత్వ పెద్దల ఆదేశాలకు తలొగ్గి చట్టవిరుద్ధంగా వ్యవహరించి ఇప్పుడు చిక్కుల్లో ఇరుక్కున్నారు. ఈ వ్యవహారంలో ఆడపిల్ల అయిన కాదంబరికి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులకు వత్తాసు పలుకుతూ జగన్‌రెడ్డి మీడియాలో వార్తలు వండి వారుస్తున్నారు. ఇంతకంటే నీతిమాలిన చర్య ఉంటుందా? జర్నలిజంలోని కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా బాధితురాలినే విలన్‌గా చిత్రించడమా? అంతకంటే అపచారం ఉంటుందా? అందుకే జగన్‌రెడ్డి సొంత మీడియాను రోత మీడియా అని పిలవాల్సి వస్తోంది. సదరు రోత మీడియాకు వంత పాడుతున్న వారిని కూలి మీడియా అనడంలో తప్పేముంది? ప్రముఖ వ్యాపారి సజ్జన్‌ జిందాల్‌తో పాటు ఏషియన్‌ పెయింట్స్‌ అధినేతను కాదంబరి బ్లాక్‌ మెయిల్‌ చేశారని రోత మీడియా ఆవేశపడుతోంది. అది కూడా నిజమే అనుకుందాం. బ్లాక్‌ మెయిల్‌ సంఘటన జరిగివుంటే, అది ముంబైలో కదా జరిగింది? ఆంధ్రప్రదేశ్‌ పోలీసులకు ఏం పని? అయినా, ఆమె బ్లాక్‌ మెయిల్‌ చేసే అవకాశం సదరు వ్యాపార దిగ్గజాలు ఎందుకు కల్పించారు?


అప్పటి ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి, సజ్జన్‌ జిందాల్‌ను కలుసుకున్న తర్వాతే కాదంబరికి కష్టాలు మొదలయ్యాయని ప్రస్తుతం పోలీసు విచారణలో స్పష్టమవుతోంది. సజ్జన్‌ జిందాల్‌ తరఫున అనైతికంగా, చట్టవిరుద్ధంగా వ్యవహరించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి ఉండకపోవచ్చు. దాంతో జిందాల్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని ఆశ్రయించి ఉంటారు. అప్పటికే ఆటవిక పాలనకు అలవాటు పడిన జగన్‌రెడ్డి సదరు సజ్జన్‌ జిందాల్‌కు అభయం ఇవ్వడం, తాము చట్టానికి బాధ్యులం అన్న విషయం మరచిన కాంతి రాణా, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, విశాల్‌ గున్ని వంటి అధికారులు పాలకుడి ఆదేశాలను ఔదలదాల్చడంతో ఇదంతా జరిగింది. కాదంబరి అనే మోడల్‌ తమను బ్లాక్‌మెయిల్‌ చేస్తోందని సజ్జన్‌ జిందాల్‌ అండ్‌ కో మహారాష్ట్రలో అధికారికంగా ఎందుకు ఫిర్యాదు చేయలేదు? కాదంబరితో తమకున్న సంబంధం ఏమిటి? ఆమె తమను ఎలా బ్లాక్‌మెయిల్‌ చేశారో, ఎందుకు చేశారో సదరు పారిశ్రామికవేత్తలు చెప్పాలి కదా? తమను బ్లాక్‌మెయిల్‌ చేసే అవకాశం కల్పించిన పారిశ్రామికవేత్తలు నోరు విప్పాలి కదా? జిందాల్‌ అండ్‌ కోకు మేలు చేయడం కోసం నాటి ప్రభుత్వం కుక్కల విద్యాసాగర్‌ అనే వ్యక్తిని రంగప్రవేశం చేయించింది.


రోత మీడియా కథనాల ప్రకారం కుక్కల విద్యాసాగర్‌ను కూడా కాదంబరి బ్లాక్‌మెయిల్‌ చేసి భూమి రాయించుకున్నారు. దానిపై కుక్కల ఫిర్యాదు చేసినందునే పోలీసులు కాదంబరిని ముంబై నుంచి తీసుకువచ్చారట. ఫిబ్రవరి 2వ తేదీన కుక్కల విద్యాసాగర్‌ ఫిర్యాదు చేసినట్టు రికార్డులలో ఉంది. అలాంటప్పుడు ఫిబ్రవరి ఒకటవ తేదీనే విశాల్‌ గున్ని, రమణమూర్తి, ముత్యాల సత్యనారాయణ తదితర అధికారులు మహిళా పోలీసులు లేకుండా గన్నవరం నుంచి ముంబై ఎందుకు వెళ్లారు? కాదంబరి కొనకపోయినా, భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను డాక్యుమెంట్‌ రైటర్‌ను బెదిరించి తమకు కావాల్సింది రాయించారు. అయినా జగన్‌ రోత మీడియా తప్పు చేసిన అధికారులను రక్షించే ప్రయత్నాన్ని నిస్సిగ్గుగా చేస్తోంది.

Updated at - Sep 01 , 2024 | 07:48 AM