Cricket Year Ender 2024: ఈ ఏడాది భారత క్రికెట్‌లో టాప్-5 హైలైట్స్.. అన్నీ అద్భుతాలే.. అదొక్కటే అవమానం
ABN , Publish Date - Dec 22 , 2024 | 04:35 PM
Cricket Year Ender 2024: టీమిండియాకు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలిచింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్‌ను భారత్ అందుకుంది. అయితే అద్భుత విజయాలతో పాటు ఈ ఏడాది మన టీమ్‌కు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయి.
టీమిండియాకు ఈ ఏడాది ఎంతో స్పెషల్‌గా నిలిచింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న వరల్డ్ కప్‌ను భారత్ అందుకుంది. ఐసీసీ ట్రోఫీ కోసం 11 ఏళ్లుగా చేసిన నిరీక్షణ కూడా ఫలించింది. కోట్లాది మంది అభిమానుల పూజలు ఫలించాయి. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ సారథ్యంలోని మెన్ ఇన్ బ్లూ.. టీ20 ప్రపంచ కప్‌ను సొంతం చేసుకుంది. ఈ విజయంతో పాటు ఎప్పటికీ గుర్తుండిపోయే మరిన్ని విక్టరీలు కొట్టింది భారత్. అయితే అద్భుత విజయాలతో పాటు ఈ ఏడాది మన టీమ్‌కు కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలో 2024లో భారత క్రికెట్‌కు సంబంధించిన స్పెషల్ హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..
సఫారీ ఛాలెంజ్‌లో సక్సెస్
ఈ ఏడాది మొదట్లో సౌతాఫ్రికా టూర్‌కు వెళ్లింది భారత జట్టు. అక్కడ టెస్టులను 1-1తో డ్రా చేసుకుంది. సఫారీ గడ్డ మీద సిరీస్ కోల్పోకుండా ఉండటం మామూలు విషయం కాదు. అది సిరీస్ గెలిచిన దాంతో సమానమనే చెప్పాలి.
పొట్టి ప్రపంచ కప్
సౌతాఫ్రికా టూర్ తర్వాత ఆఫ్ఘానిస్థాన్‌తో టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంది భారత్. అయితే ఈ ఏడాది అతిపెద్ద విజయం అంటే టీ20 వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడమనే చెప్పాలి. ఫైనల్‌లో ప్రొటీస్‌ను చిత్తు చేసి కప్పును సొంతం చేసుకుంది రోహిత్ సేన. కప్పు కోసం నిరీక్షిస్తున్న ఫ్యాన్స్ దాహం తీర్చింది మెన్ ఇన్ బ్లూ. ఈ ఏడాది మాత్రమే కాదు.. భారత క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే విక్టరీ ఇది.
విక్టరీ పరేడ్
టీ20 వరల్డ్ కప్ విన్నింగ్ ట్రోఫీతో స్వదేశానికి వచ్చిన టీమిండియాకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. మొదట ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన భారత ఆటగాళ్లు.. ఆ తర్వాత ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో పాల్గొన్నారు. ఇసుక వేస్తే రాలనంత జనంతో మెరీనా బీచ్ నిండిపోయింది. జనసంద్రానికి అభివాదం చేస్తూ తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు రోహిత్ అండ్ కో. ఆ తర్వాత వాంఖడే స్టేడియంలో డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్‌మెంట్ డోస్ డబుల్ చేశారు.
పెర్త్ విక్టరీ
ఆస్ట్రేలియాను వాళ్ల సొంతగడ్డపై టెస్టుల్లో ఓడించడం ఎంత కష్టమో చెప్పనక్కర్లేదు. కానీ భారత్ మరోసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. పటిష్టమైన కంగారూ టీమ్‌ను పెర్త్ టెస్ట్‌లో ఏకంగా 295 పరుగుల తేడాతో చిత్తు చేసింది బుమ్రా సేన. ఇది భారత టెస్ట్ హిస్టరీలో బెస్ట్ విక్టరీస్‌లో ఒకటిగా చెప్పొచ్చు.
ఘోర అవమానాలు
టీ20 వరల్డ్ కప్ తర్వాత జింబాబ్వే, శ్రీలంక టూర్‌కు వెళ్లింది భారత జట్టు. జింబాబ్వే టూర్‌లో సక్సెస్ అయినా లంకలో మిశ్రమ ఫలితాలు చూసింది. టీ20 సిరీస్ నెగ్గినా.. వన్డేల్లో మాత్రం ఆతిథ్య జట్టు చేతిలో 0-2 తేడాతో ఓటమి పాలైంది భారత్. ఆ తర్వాత న్యూజిలాండ్ చేతుల్లో టెస్టుల్లో 0-3 తేడాతో వైట్‌వాష్ అయింది టీమిండియా. ఈ ఏడాది ఇవి రెండూ మన జట్టుకు అతిపెద్ద ఓటములుగా చెప్పాలి.
Also Read:
భారత్-పాక్ మ్యాచ్ అక్కడే.. వెన్యూ ఫిక్స్
అరెస్ట్ వారెంట్‌పై ఊతప్ప రియాక్షన్.. ఇలా అనేశాడేంటి..
హెల్మెట్‌లో కెమెరాతో బ్యాటింగ్.. అశ్విన్ మామూలోడు కాదు
అశ్విన్.. అదొక్కటి మర్చిపోకు.. స్టార్ స్పిన్నర్‌కు ప్రధాని సజెషన్
For More Sports And Telugu News