Year Ender 2024: కడపలో సంచలన రాజకీయ పరిణామం..
ABN , Publish Date - Dec 26 , 2024 | 03:32 PM
Year Ender 2024: ఎన్నికల్లో అంతా అవాక్కయ్యేలా ఓటర్లు తీర్పునిచ్చారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓటర్లు వైసీపీకి పొతచేశారు. మంచి పరిపాలన అందిస్తారని జనం వైసీపీకి ఓట్లు వేసి కట్టబెడితే..
2024 జగన్ అండ్ కోకు బ్యాడ్ ఇయర్.
ఇష్టారాజ్య పాలనకు సొంత జిల్లాలోనే చెక్.
ఐదు చోట్ల కూటమి విజయ దుందుభి.
పులివెందుల, బద్వేలుకే వైసీపీ పరిమితం.
తొలిసారి ముగ్గురు అసెంబ్లీకి.
ఈ ఏడాది రెండు ప్రభుత్వాల పాలన.
తొలి ఆరు నెలలు వైసీపీ.
మరో ఆరు నెలలు కూటమి ప్రభుత్వం.
ఎన్నికల్లో అంతా అవాక్కయ్యేలా ఓటర్లు తీర్పునిచ్చారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లాలోనే ఓటర్లు వైసీపీకి పొతచేశారు. మంచి పరిపాలన అందిస్తారని జనం వైసీపీకి ఓట్లు వేసి కట్టబెడితే.. హలన గాలికొదిలేసి కష్టాలు, సెటిల్మెంట్లు, పన్నుల పెంపుతో జనం నడ్డి విరగ్గొట్టారు. దీంతో విసిగిపోయి జనం ఫ్యాను రెక్కలు పీకి పడేశాడు. కూటమికి పట్టంగట్టారు. 2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేశాయి. జిల్లా రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. ఈ ఎన్నికల్లో తొలిసారిగా ముగ్గురు ఎమ్మెల్యేలు అసెంబ్లీ మెట్లెక్కారు. ఆ ముగ్గురూ టీడీపీ వారే కావడం విశేషం.
కడప, డిసెంబర్ 26: కడప దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అండగా ఉంటూ వస్తోంది. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. 2004, 2009 ఎన్నికల్లో జనం ఉమ్మడి జిల్లాలో మెజార్టీ స్థానాలు కాంగ్రెసు కట్టబెట్టారు. జగన్ 2011లో పార్టీ స్థాపించిన తరువాత జరిగిన ఉప ఎన్నికలు, 2014 ఎన్నికలు, 2019 ఎన్నికల్లో వైసీపీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మనోడే సీఎం అయితే జిల్లా అభివృద్ధి చెందుతుందని అందరూ ఆశించారు. అయితే జనం ఆశించిన రీతిలో జగన్ పాలన సాగలేదు. 30 ఏళ్లు తామే అధికారంలో ఉంటామన్న ధీమాతో అభివృద్ధి మరిచి బటన్ నొక్కడమే పనిగా పెట్టుకున్నారు. సంక్షేమ జపం చేస్తూ తప్పక జనం ఓట్లు వేస్తారనే నమ్మకంతో కాలం గడిపారు. ఇక భూకబ్జాలు, ఇసుక, మట్టి దందా, ప్రశ్నిస్తే దాడులతో ఐదేళ్లు ఒక విధమైన భయంకర వాతావరణం ఉండేది అవకాశం కోసం చూసిన జనం 2004 ఎన్నికల్లో ఫ్యాను రెక్కలు విరిచి పడేశారు. కడప పార్లమెంటులో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉంటే పులివెందుల నుంచి జగన్, బద్వేలు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ మాత్రమే గెలిచారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో కూడా చావు తప్పి కన్ను లొట్టబోయినట్లుగా తక్కువ మెజార్టీతో అవినాశ్ రెడ్డి బయటపడ్డారు. ఆ తరువాత ఈ ఆరు నెలల్లో వైసీపీ పరిస్థితి ఆశాజనకంగా లేదు. కడప కార్పొరేషన్ నుంచి 8 మంది కార్పొరేటర్లు సైకిలెక్కేశారు. ప్రొద్దుటూరులో పలువురు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. కార్పొరేటర్లతో వైఎస్ జగన్ సమావేశమై వారిని బుజ్జగించాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా ఎంతమంది ఉంటారో, ఎంతమంది సైకిలెక్కుతారో తెలియని పరిస్థితి నెలకొంది.
2024లో ఎన్నెన్నో..
2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి తొలిసారిగా పోటీ చేశారు. కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, పులివెందుల నుంచి టీడీపీ పోటీ చేయగా, జమ్మలమడుగు, బద్వేలు నుంచి బీజేపీ అభ్యర్థులు పోటీ చేశారు. జమ్మలమడుగులో బీజెపీ నుంచి మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి గెలుపొందగా, కడప నుంచి ఆర్.మాధవి, కమలాపురం నుంచి పుత్తా క్రిష్ణచైతన్యరెడ్డి, మైదుకూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్, ప్రొద్దుటూరు నుంచి ఎన్.వరదరాజులరెడ్డి టీడీపీ తరఫున గెలిచారు.
వైఎస్ కుటుంబానికి మరో ఓటమి..
జిల్లా రాజకీయాల్లో వైఎస్ కుటుంబానికి చెరగని ముద్ర ఉంది. అయితే ఆ కుటుంబం నుంచి ఎన్నికల్లో ముగ్గురు ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి వైజాగ్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకా ఓటమి చెందగా, 2016లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి చేతిలో వివేకా ఓటమి చెందారు. ఇక 2004 ఎన్నికల్లో జగన్ చెల్లి వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి కడప ఎండీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.
వివేకా హత్య చుట్టూ...
మాజీ మంత్రి వివేకానంద రెడ్డి 2019 మార్చి 15వ తేదీన తన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. అయితే ఆ కేసు హాలీవుడ్ సినిమాను తలపించే విధంగా ఎన్నో మలుపులు తిరిగింది. చివరికి సీబీఐ కడప ఎంపీ అవినాష్, ఆయన తండ్రితో సహా పలువురిపై అభియోగాలు మోపింది. కొందరు జైలుకు వెళ్లి బెయిల్‌పై బయటకు వచ్చారు. అయితే ఈ ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల వివేకా హత్యను ప్రచారంలో ప్రధానాస్త్రంగా వాడుకున్నారు. ఇక టీడీపీ కూడా హూకిల్డ్ బాబాయ్ అంటూ ప్రచారంలో మారుమోగించింది.
తొలిసారిగా ముగ్గురు అసెంబ్లీకి..
2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను వైసీపీ గెలుచుకుంది. అయితే ప్రజలు ఈసారి ఆ సంప్రదాయానికి తెరదించారు. కూటమి ప్రభుత్వానికి బ్రహ్మరథం పట్టారు. కడప నుంచి ఆర్. మాధవి, కమలాపురం నుంచి పుత్తా కృష్ణచైతన్య రెడ్డి తొలిసారిగా పోటీ చేసి గెలుపొందారు. ఇక మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ తొలిసారిగా గెలిచారు. ఈ ముగ్గురూ అసెంబ్లీలో మొదటిసారి అడుగు పెట్టారు.
కూటమికి గుడ్ఇయర్..
కూటమికి 20021 గుడ్ ఇయర్. టీడీపీ, జనసేన, బీజేపీ ఓట్లు ఆయా అభ్యర్థులకు పరస్పరం బదిలీ అయ్యాయి. కేడరు కూడా బాగా కలిసి పనిచేసింది. జనం కూడా కూటమిపై నమ్మకం పెట్టుకుని పట్టం గట్టారు. ఉమ్మడి జిల్లాలోని రైల్వేకోడూరులో జనసేన నుంచి ఆరవ శ్రీధర్, రాయచోటిలో టీడీపీ నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందారు. సొంతజిల్లాలో తిరుగులేదని భావించిన జగన్ అండ్ కో కేవలం పులివెందుల, బద్వేలుతో సరిపెట్టుకోవలసి వచ్చింది. ఇక వైఎస్ కూతురుగా కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టి కడప పార్లమెంటుకు పోటీ చేసిన షర్మిలకు తొలి ప్రయత్నంలోనే చేదు అనుభవం ఎదురైంది. ఓ విధంగా చెప్పాలంటే వైఎస్ కుటుంబానికి 2024 బ్యాడ్ ఇయర్.. కూటమికి గుడ్ ఇయర్. మొత్తానికి 2024 ఆరునెలలు వైసీపీ పాలన సాగగా మిగతా ఆరు నెలలు కూటమి పాలన సాగుతోంది. జిల్లా రాజకీయాలపై ఈ సంవత్సరం చెరగని ముద్రవేసింది.
Also Read:
పాన్ 2.0 వెర్షన్‌పై కేంద్రం స్పష్టత
15 సెకెన్లలో ఈ పజిల్ సాల్వ్ చేస్తే.. మీ కళ్ల పవర్ పీక్స్‌లో
For More Andhra Pradesh News and Telugu News..