organic farming సేంద్రీయ సాగుతో అధిక లాభాలు
ABN , Publish Date - Apr 05 , 2025 | 12:31 AM
సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగుచేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయాధికారి నటరాజ్ రైతులకు సూచించారు.

కొత్తచెరువు, ఏప్రిల్ 4(ఆంధ్రజ్యోతి): సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగుచేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని వ్యవసాయాధికారి నటరాజ్ రైతులకు సూచించారు. మీర్జాపురం గ్రామంలో శుక్రవారం పొలం బడి కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో ఆయన మాట్లాడుతూ... ఈ గ్రామానికి చెందిన రైతు వెంకటేశ సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగుచేస్తున్నారని, ఆయన పంటలను ఇండ్‌గ్యాప్ సంస్థ వారు ప్రకృతి వ్యవసాయాన్ని పరీక్షించి అందులో రసాయనిక మందులు, ఎరువులు వాడకుండా ఉంటే ఆయనకు సర్టిఫికెట్ అందజేస్తారని అన్నారు. ఆ సర్టిఫికెట్ ఉంటే ఆ రైతు పండించిన పంటలను మార్కెట్‌లో అమ్ముకోవడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా రసాయనిక పద్ధతిలో పంటలు సాగుచేస్తుండటంతో ప్రజలు అనారోగ్యాల పాలు అవుతున్నారని, ఇటీవల అందరూ సేంద్రీయ సాగు వైపు మొగ్గు చూపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌టీఓ క్యూఎంఎస్ మేనేజర్ గోపాలకృష్ణ, టెక్నికల్ అడ్వజర్ నటరాజ్, ఇంటర్నల్ ఇనస్పెక్టర్ ప్రతా్‌పరెడ్డి, ఫీల్డ్ ఆఫీసర్ అశ్వని, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.