Share News

Happy Life: ఈ టిప్స్‌తో మీ జీవితం సంతోషమయమం

ABN , Publish Date - Apr 07 , 2025 | 06:42 PM

ఆరోగ్యం అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం. కానీ మంచి ఆరోగ్యానికి కారణమైన అతి ముఖ్యమైన మానసిక ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించకపోవడం తగినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం.

Happy Life: ఈ టిప్స్‌తో మీ జీవితం సంతోషమయమం
Happy Life

ప్రతి వ్యక్తి సంతోషమైన జీవితాన్ని గడపాలని ఆశిస్తుంటారు. కానీ జీవితంలో ఎన్నో సమస్యలతో సతమతమవుతుంటారు. ముఖ్యంగా అసలు సమస్యను పక్కనపెట్టి తనకు ఏమైందనే ఆందోళనతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ.. ఎన్నో పరీక్షలు చేయించుకుంటుంటారు. ఇంకొందరు ఆహారాపు అలవాట్లను మార్చుకుంటే మరికొందరు లైఫ్‌స్టైల్‌లో మార్పులు చేసుకుంటారు. అయినా లైఫ్‌లో హ్యాపీనెస్ మిస్‌ అవుతున్నామనే ఆందోళన చాలామందిలో కనిపిస్తుంటుంది. అలా ఫీలయ్యే వారంతా జీవితాన్ని సంతోషంగా గడపాలంటే ఏమి చేయాలి. చాలామంది ఏ విషయాన్ని మిస్సవుతున్నారనేదానిపై హైదరాబాద్‌కు చెందిన కౌన్సిలింగ్ సైకాలజిస్టు ఉమాదేవి పలు సూచనలు చేస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హ్యాపీ లైఫ్ కోసం ఆమె చెబుతున్న టిప్స్ ఏమిటో తెలుసుకుందాం.


ఆరోగ్యం అనగానే అందరి మదిలో ముందుగా మెదిలేది మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం. కానీ మంచి ఆరోగ్యానికి కారణమైన అతి ముఖ్యమైన మానసిక ఆరోగ్యం గురించి ఎవరు ఆలోచించకపోవడం తగినంత ప్రాధాన్యతను ఇవ్వకపోవడం బాధాకరమైన విషయం. మంచి ఆహారపు అలవాట్లు, శారీరక వ్యాయామం ఉన్నప్పటికీ చాలా మంది అనారోగ్యం బారిన పడటం నిత్యం గమనిస్తునే ఉంటాం. నిపుణుల అభిప్రాయం ప్రకారం మనకు కలిగే శారీరక బాధలకు మానసిక సమస్యలే ప్రధాన కారణం. దీన్నే Phsychosomatic (సైకోసోమాటిక్) అంటారు. ఉదాహరణకు ఒక మనిషి యొక్క తలనొప్పి, అలసట, ఆకలి, అతిగా తినడం వంటి చిన్న సమస్యల నుండి మొదలుకొని గుండె జబ్బులు, పక్షవాతం, రక్తపోటు వరకు మనల్ని ఇబ్బంది గురి చేస్తున్నవి మానసిక సమస్యలే . ఏదో సినిమాలో చెప్పినట్టు మన రోజువారీ జీవితం ఎలా ఉంది అంటే “కంటికి కనబడని శత్రువుతో బయటకి కనబడని యుద్ధం చేస్తున్నాం”. యుద్ధం కనపడక పోవడంతో దానికి సన్నద్ధం అవ్వడం అనే విషయం గురించి ఆలోచించడం మానేసాం, ఇంకా చెప్పాలంటే మరిచే పోయాము.

Maditaion.jpg


దాదాపుగా శారీరక సమస్యలన్నిటికీ కారణం పరోక్షంగా మానసిక సమస్యలని అనుకున్నపుడు, అసలు సమస్యలు ఎందుకు వస్తున్నాయి అనేది మన ముందు ఉండే ప్రశ్న.

దానికి కారణాలు అనేకం, వయసు, స్థాయి, ప్రాంతంతో సంబంధం లేకుండా, కులమత తారతమ్యాలు లేకుండా , లింగ బేధం లేకుండా అందరిని పీడిస్తున్న సమస్య. నిశితంగా పరిశీలిస్తే ఈ సమస్యలన్నిటికీ మూలం ఒకే దగ్గర ఉండటం గమనార్హం. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటో తెలుసుకుందాం.


అతిగా ఆలోచించడం

మనలో చాలా మంది ప్రజెంట్లో (ప్రస్తుతంలో) జీవించక పోవడం. మన మానసిక ఆందోళనకి మొదటి కారణం మన భవిష్యత్తు గురించి అతిగా దిగులు చెందడం, రెండవది మనకు బాధను కలిగించే గతాన్ని గురించి తరచూ ఆలోచించడం. మన చేతిలో లేని అంటే మనం మార్చలేని గతం గురించి మనకు తెలియని భవిషత్తు గురించి అతిగా ఆలోచించడం ఎంతవరకు సబబు. భవిష్యత్తు గురించి ప్రణాళిక అవసరం కానీ ఆందోళన అనవసరం, గతం నుంచి పాఠాన్ని నేర్చుకోవాలి కానీ ఆ గతం మన ప్రస్తుత జీవితానికి అడ్డు కాకూడదు. అందుకే భవిష్యత్తు గురించి, గతం గురించి ఎక్కువుగా ఆలోచించడం మానస్తే సగం ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

Over Thinking.jpg


భావోద్వేగ మేధస్సు

మన యొక్క నిత్యా జీవితాన్ని భావోద్వేగ మేధస్సు( EQ ) బాగా ప్రభావితం చేస్తుంది. ఎప్పుడు అయితే మనలని మనం అర్థం చేసుకుంటామో, ఇతరుల భావాలను ఆర్థం చేసుకుంటామో మన సమస్యలకు సగం పరిష్కారం దొరికినట్టే. "నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి' అన్నమాట. దీని వాళ్ళ అందరితో మనం సత్సంబంధాలు ఏర్పరచుకోవచ్చు, తద్వారా మనశాంతి పొందవచ్చు.

Emotional intelligence.jpg


గమనం-గమ్యం

ఆహ్లాదకరమైన ప్రయాణం ఆనందకరమైన గమ్యానికి బాటలు. మీరు ఎప్పుడు ఆనందంగా ఉంటారు అంటే మనలో చాలా మంది చెప్పే సమాధానం మనం అనుకున్న లక్ష్యం చేరుకున్నప్పుడు అని, అయితే మనం చేసే పనిలో ఆనందం ఉంటే మనం లక్ష్యాన్ని చేరుకోవడం తేలిక అని నిపుణులు చెబుతున్న మాట. ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం వల్ల మీరు గమ్యాన్ని చేరుకోవడం ఆలస్యం అయినా, నిరుత్సాహం, నిరాశ మీ దరికి చేరవు. కాబట్టి ముందు గమనంలో సంతోషాన్ని పొందండి తరువాత గమ్యం సంతోషాన్ని ఇవ్వకపోయినా కనీసం మళ్ళీ ప్రయత్నం చేసే ధైర్యం వస్తుంది.

Stress Management.jpg


తన్-మన్-ధన్ సేవ

చిత్రమైన విషయం ఏమిటంటే మనలో చాలా మంది సంతోషంగా ఉండాలి అంటే మనల్ని మనం ఎలా సంతోషంగా ఉంచుకోవాలి అని ఆలోచిస్తాం, కానీ ఇతరుల సంతోషానికి మనం కారణం అయినప్పుడు కూడా మనం సంతోషాన్ని పొందుతాం అనేది మనలో చాలామందికి తెలియని విషయం. మనం ఇతరులకి చేసే ఏ సహాయం అయినా అది తనువుతో కానీ, ధనముతో కానీ, మనన్సుతో కానీ వారికి ఊరటను, ఆనందాన్ని కలిగించేలా ఉంటే మనకు కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి.

పై విషయాలను నిత్య జీవితంలో భాగంగా చేసుకుంటే ఇతర ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవ్వలేని ఆరోగ్యాన్ని, తద్వారా ఆంనందాన్ని పొందవచ్చు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 07 , 2025 | 07:25 PM