Share News

Health Services: 7 నుంచి వైద్య సేవలు బంద్‌

ABN , Publish Date - Apr 04 , 2025 | 06:30 AM

ఏపీ రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలు ఈ నెల 7 నుంచి నిలిపివేస్తున్నట్లు ఆస్పత్రుల అసోసియేషన్‌ ప్రకటించింది. ప్రభుత్వం రూ.3,500 కోట్లు బకాయిలు చెల్లించకపోవడంతో సేవలు నిలిచిపోతున్నాయని తెలిపారు

 Health Services: 7 నుంచి వైద్య సేవలు బంద్‌

నెట్‌వర్క్‌ ఆస్పత్రుల నిర్ణయం

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఎన్టీఆర్‌ వైద్యసేవలను ఈ నెల 7నుంచి నిలిపివేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ కె.విజయ్‌కుమార్‌ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు దాదాపు రూ.3,500 కోట్లు బకాయిలు పెట్టిందని, దీనివల్ల తాము దుర్భర పరిస్థితుల్లో ఉన్నామని చెప్పారు. బకాయిల విడుదల కోసం ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌కు అనేకసార్లు విన్నవించామని, లిఖితపూర్వకంగానూ కోరామని తెలిపారు. పెండింగ్‌ బిల్లులు చెల్లిస్తే కానీ మందులు, సర్జికల్‌ ఐటమ్స్‌ సరఫరా చేయలేమని ఆయా కంపెనీలు చేతులెత్తేస్తున్నాయని చెప్పారు. వైద్యులు, సిబ్బందికి 2నెలలుగా జీతాలు నిలిపివేశామని చెప్పారు. దీనిపై గతనెల 7నే ట్రస్ట్‌కు లేఖ రాశామని, ప్రభుత్వం నుంచి స్పందన రాలేదని తెలిపారు. బకాయిలు విడుదల చేయాలంటూ గతేడాది జూలై నుంచి ప్రభుత్వానికి 26 సార్లు లేఖలు రాశామన్నారు. 2025-26 బడ్జెట్‌లో ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకానికి రూ.4వేల కోట్లు కేటాయించగా, బకాయిలే రూ.3,500కోట్లు ఉన్నాయన్నారు. కనీసం రూ.1,500కోట్లు చెల్లిస్తే తప్ప సేవలు కొనసాగించే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆశా కార్యదర్శి డాక్టర్‌ అవినాశ్‌ మాట్లాడుతూ బీమా విధానంలోకి మారే క్రమంలో ఆయుష్మాన్‌ భారత్‌తో పథకాన్ని ఇంటిగ్రేట్‌ చేస్తామని అంటున్నారని, ఆయుష్మాన్‌ భారత్‌లోని 1,500 ప్రొసీజర్లు ఎన్టీఆర్‌ వైద్యసేవ కంటే తక్కువ ప్యాకేజీల్లో ఉన్నాయని తెలిపారు.


ఇవి కూడా చదవండి

కళ్లను బాగా రుద్దుతున్నారా.. జాగ్రత్త

Vijay Kumar ACB Questioning: రెండో రోజు విచారణకు విజయ్ కుమార్.. ఏం తేల్చనున్నారో

Read Latest AP News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 06:30 AM