3దాకా మిథున్ అరెస్టు వద్దు
ABN , Publish Date - Mar 27 , 2025 | 04:32 AM
మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఏప్రిల్ 3న తుది నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.

పిటిషనర్ తండ్రి పెద్దిరెడ్డి చేతికి శస్త్రచికిత్స
మెడికల్ సర్టిఫికెట్‌ను పరిశీలించిన హైకోర్టు
3 వరకు అరెస్టు చేయొద్దని సీఐడీకి ఆదేశం
‘ముందస్తు’ పిటిషన్‌పై ముగిసిన వాదనలు
కేసులో పిటిషనర్‌ను నిందితుడిగా చేర్చలేదు
ఎఫ్‌ఐఆర్‌లో ఎంపీ పేరు ప్రస్తావించనే లేదు
మీడియాలో కథనాలు వచ్చాయని చెబుతూ ముందస్తు బెయిల్ కోరడానికి వీల్లేదు
సీనియర్ న్యాయవాది లూథ్రా వాదనలు
వాసుదేవరెడ్డి వాంగ్మూలంలో మిథున్‌రెడ్డి పేరు
అరెస్టు చేస్తారన్న ఆందోళన సహేతుకమైనదే
వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది
అమరావతి, మార్చి 26(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణం వ్యవహారంలో సీఐడీ నమోదు చేసిన కేసులో వైసీపీ ఎంపీ మిథున్‌రెడి ్డ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో ఏప్రిల్ 3న నిర్ణయం వెల్లడిస్తామని న్యాయమూర్తి జస్టిస్ టి. మల్లికార్జునరావు బుధవారం ప్రకటించారు. పిటిషనర్ తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేతికి శస్త్రచికిత్స జరిగిందని, ఆయన్ను చూసేందుకు వచ్చినప్పుడు పిటిషనర్‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేసే ప్రమాదం ఉందని సీనియర్ న్యాయవాది ఆందోళన వ్యక్తం చేస్తున్నారని గుర్తు చేశారు. శస్త్రచికిత్సకు సంబంధించి వైద్యులు ఇచ్చిన మెడికల్ సర్టిఫికెట్‌ను కోర్టు ముందు ఉంచడంతో దాన్ని పరిశీలించిన న్యాయమూర్తి ఏప్రిల్ 3 వరకూ మిథున్‌రెడ్డిని అరెస్టు చేయొద్దని సీఐడీ అధికారులను ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలోని మద్యం కుంభకోణంలో గత సెప్టెంబరు 23న సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మిథున్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. ఈ వ్యాజ్యం బుధవారం విచారణకు రాగా సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. కేసులో పిటిషనర్‌ను నిందితుడిగానే చేర్చలేదని, ఆయనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని, విచారణకు హాజరుకావాలని కోరలేదని తెలిపారు.
ఎఫ్‌ఐఆర్‌లో ఎంపీ పేరు ప్రస్తావించలేదని, అపరిపక్వ దశలో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ ఇచ్చిన 164 స్టేట్‌మెంట్ ఆధారంగా మిథున్‌రెడ్డిని మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా చేర్చబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయని చెబుతూ ముందస్తు బెయిల్ కోరడానికి వీల్లేదని స్పష్టం చేశారు. నిందితుడిగా ఎవరిని చేర్చాలి, ఎవరిని అరెస్టు చేయాలనేది దర్యాప్తు అధికారి విచక్షణాధికారమని అన్నారు. మద్యం కుంభకోణం రూ.4,000 కోట్లతో ముడిపడి ఉన్న వ్యవహారమని కోర్టుకు నివేదించారు. నిందితుడిగా లేని వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసేందుకు సహేతుకమైన కారణాలు ఉండాలని, కేవలం అరెస్టు చేస్తారనే ఆందోళనతో పిటిషన్లు వేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. పిటిషనర్‌కు చెందిన పీఎల్‌ఆర్ ప్రాజెక్ట్స్ కంపెనీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారని చెబుతూ పిటిషనర్ బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని, అయితే ఆ కంపెనీలో ఆయన డైరెక్టర్ కాదని తెలిపారు. కోర్టును తప్పుదోవ పట్టిస్తున్న పిటిషనర్‌కు ఖర్చులు విధించాలని లూథ్రా కోరారు. దర్యాప్తు సంస్థపై పిటిషనర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, ముందస్తు బెయిల్ పిటిషన్‌కు విచారణార్హత లేదన్నారు. ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.
అరెస్టు నుంచి రక్షణ కల్పించండి: పిటిషనర్
పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి. నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ... ఏప్రిల్ 4 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయని, 5న పిటిషనర్‌ను అరెస్టు చేసే ప్రమాదం ఉందన్నారు. కేసులో నిందితుడిగా ఉన్న బెవరేజ్ కార్పొరేషన్ అప్పటి ఎండీ వాసుదేవరెడ్డి ఇచ్చిన 161 స్టేట్‌మెంట్‌ను పరిశీలిస్తే నచ్చిన కంపెనీలకు మద్యం ఆర్డర్లు ఇవ్వడంలో మిథున్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని ఉందని చెప్పారు. వాస్తవాలు చెప్పకుండా దర్యాప్తు అధికారి కోర్టును తప్పుదోవపట్టిస్తున్నారని, ఆయనపై కోర్టు ధిక్కరణ చర్యలు ప్రారంభించాలని కోరారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు గత ప్రభుత్వ హయాంలో పెట్టిన కేసుల్లో నిందితులు కాకపోయినా హైకోర్టు నుంచి రక్షణ పొందారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మద్యం పాలసీలోని లోపాలకు ఎంపీని బాధ్యుడిని చేయడం సరికాదన్నారు. అరెస్టు చేస్తారనే పిటిషనర్ ఆందోళన సహేతుకమైనదేనని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇరువైపుల వాదనలు ముగియడంతో న్యాయమూర్తి 3న నిర్ణయం వెల్లడిస్తామని ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Yogi Adityanath: యోగి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
కొబ్బరి నీళ్ల కంటే.. మంచి నీళ్లు మేలు.. డాక్టరేంటి ఇలా అన్నాడు..