YCP : కీలక నేతల ఇలాకాలో వైసీపీకి బిగ్ షాక్.. ఆ నేతలంతా జనసేనలోకే..
ABN , Publish Date - Jan 27 , 2025 | 06:31 PM
Shock In YCP : వైసీపీలో అగ్రనేతలకు అండగా ఉన్న.. నేతలంతా తమ తమ అనుచర గణంతో పార్టీలు మారుతోన్నారు. దీంతో వైసీపీ నుంచి ఇతర పార్టీలకు వలసలు వెల్లువెత్తాయి.

అమరావతి, జనవరి 27: అధికార కూటమిలోని పార్టీల్లోకి వైసీపీ నుంచి వలసల జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా వైసీపీలో అగ్రనేతలకు చెందిన నియోజకవర్గాల్లోని కీలక నేతలు, వారి ప్రధాన అనుచరులు పార్టీలు మారుతోన్నారు. సోమవారం దాదాపు38 మంది వైసీపీ నాయకులు, వారి ప్రధాన అనుచరులు జనసేన పార్టీలో చేరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో వారంతా కుండువాలు కప్పుకున్నారు.
వీరంతా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు, చంద్రగిరి, పీలేరుతోపాటు ఉమ్మడి కృష్ణాజిల్లాలోని నందిగామ నియోజక వర్గాలకు చెందిన వారు. గతంలో వైసీపీలో వీరు కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. పుంగనూరు అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రగిరి అంటేనే చెవిరెడ్డి భాస్కరరెడ్డి. వీరిద్దరు గత వైసీపీ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించిన సంగతి అందరికి తెలిసిందే.
అయితే కూటమి ప్రభుత్వం కొలువు తీరి ఏడాది కూడా పూర్తి చేసుకోలేదు. అంతలోనే వైసీపీలోని పలువురు అగ్రనేతలు ఆ పార్టీకి వరుసగా గుడ్ బై చెప్పేస్తున్నారు. తాజాగా వైసీపీలో రెండో స్థానంలో అంటే.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తర్వాత స్థానంలో ఉన్న విజయసాయిరెడ్డి సైతం ఆ పార్టీకే కాదు.. తన రాజకీయ జీవితానికి సైతం గుడ్ బై చెప్పేశారు.
ఇక 2024, సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడారు. అలాగే ఎన్నికల్లో కూటమిలోని పార్టీలకు ఓటరు పట్టం కట్టాడు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. దాంతో వైసీపీ నుంచి ఆ పార్టీ నేతలు వరుసగా రాజీనామాలు చేసి బయటకు వస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు సైతం తన రాజ్య సభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. అనంతరం మోపిదేవి, బీదా మస్తాన్ రావులు టీడీపీలో చేరగా.. ఆర్ కృష్ణయ్య బీజేపీలో చేరారు. ఆ క్రమంలో టీడీపీ నుంచి బీదా, బీజేపీ నుంచి ఆర్ కృష్ణయ్యలు పెద్దల సభలో మళ్లీ అడుగు పెట్టారు.
Also Read: స్కూల్‌లో జెండా ఎగరవేస్తుండగా ప్రిన్సిపాల్ అరెస్ట్.. ఎందుకో తెలిస్తే..ముక్కున వేలేసుకుంటారు
ఇక విజయసాయిరెడ్డి రాజీనామాతో.. వైసీపీ భవిష్యత్తు ఏమిటనే ఓ చర్చ అయితే ఆ పార్టీ కేడర్‌లో నడుస్తోంది. ఎందుకంటే ప్రతిపక్షానికి పరిమితమైన పార్టీని అధికారంలోకి తీసుకు రావడంలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్ర ద్వారా ఎంతో కష్ట పడ్డారు. అలాగే విజయసాయిరెడ్డి సైతం తెర వెనుక అంతే కష్టపడ్డారనే ఓ చర్చ అయితే పార్టీ కేడర్‌లో నేటికి బలంగా ఉంది. అలాంటి విజయసాయిరెడ్డి లేని పార్టీని ఊహించ లేని పరిస్థితి నెలకొందని చర్చ నడుస్తోంది.
Also Read: టెన్త్ అర్హతతో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. వేలల్లో ఖాళీలు
Also Read: ప్రధాని మోదీకి పేద ప్రజల కంటే ‘వారే’ ముఖ్యం
ఇక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కానీ.. జిల్లాలకే పరిమితమని మహా అయితే రాష్ట్రానికి మాత్రమే పరిమితమని అంటున్నారు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం ఢిల్లీలో వైసీపీ తరఫున చక్రం తిప్పారని.. అందుకు గతంలో చోటు చేసుకొన్న ఘటనలను సైతం ఈ సందర్భంగా సోదాహరణగా వివరిస్తున్నారు. అలాంటి విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకొంటే.. ఇక పెద్దిరెడ్డి, చెవిరెడ్డిల సంగతి ఏమో కానీ.. పార్టీ అధినేత వైఎస్ జగన్ పరిస్థితి ఏమిటనే ఓ చర్చ సైతం ఆ పార్టీ శ్రేణుల్లో చాలా బలంగా నడుస్తోంది. ఏదీ ఏమైనా.. వైసీపీ నుంచి మరిన్ని వలసలు భవిష్యత్తులో పెరిగే అవకాశముందని వాదన ఆ పార్టీలోనే వినిపిస్తోంది.
For AndhraPradesh News And Telugu News