Share News

త్వరలోనే పెండింగ్‌ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తాం

ABN , Publish Date - Mar 24 , 2025 | 01:39 AM

జిల్లాలో 2,500 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. వీటిల్లో అత్యధికంగా పుంగనూరు విద్యుత్‌ డివిజన్‌లోనే 1,800 ఉన్నాయని చెప్పారు. ఆరు నెలలుగా మెటీరియల్‌ రాలేదని, త్వరలోనే కనెక్షన్నీ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే పలు అంశాలపై ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడారు.

త్వరలోనే పెండింగ్‌ వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఇస్తాం
ఇస్మాయిల్‌ అహ్మద్‌

- ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌

జిల్లాలో 2,500 వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయని ఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ ఇస్మాయిల్‌ అహ్మద్‌ తెలిపారు. వీటిల్లో అత్యధికంగా పుంగనూరు విద్యుత్‌ డివిజన్‌లోనే 1,800 ఉన్నాయని చెప్పారు. ఆరు నెలలుగా మెటీరియల్‌ రాలేదని, త్వరలోనే కనెక్షన్నీ ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే పలు అంశాలపై ఆంధ్రజ్యోతి ప్రతినిధితో మాట్లాడారు.

? నాణ్యమైన విద్యుత్‌ కోసం తీసుకుంటున్న చర్యలు

! పీఎం కుసుమ్‌ అనే పథకం వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలని కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి సబ్‌స్టేషన్‌ ఫీడర్‌లో సోలార్‌ విద్యుత్‌ ఉత్పత్తికి ఏర్పాటు చేస్తున్నాం. దీనివల్ల రైతులకు వ్యవసాయ మోటర్లు కాలిపోవు. లోఓల్టేజీ సమస్య ఉండదు. కుప్పంలోని అన్ని విద్యుత్‌ సబ్‌స్టేషన్లలో 100 శాతం ఏర్పాటు చేయడానికి 140 మెగా యూనిట్లు, జిల్లా మొత్తం 80 మెగా యూనిట్లు ఉత్పత్తికి సోలార్‌ కరెంట్‌కు చర్యలు తీసుకున్నాం.

? సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారా

! గతంలో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో విద్యుత్‌ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేయకపోవడంతో కుప్పంలో 6, పలమనేరులో 3, గంగాధరనెల్లూరులో 2 చొప్పున ప్రస్తుతం విద్యుత్‌ సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయి. పెద్దపంజాణి మండలంలో ఉన్న విద్యుత్‌ సమస్యలు పరిష్కారానికి ప్రత్యేక దృష్టి పెట్టాం.

? విద్యుత్‌ బకాయిలు చెల్లింపులు ఎలా ఉన్నాయి

! జిల్లాలో గృహ అవసరాలు, ప్రైవేటు సంస్థలు వినియోగించిన విద్యుత్‌కు సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, హాస్టళ్లు, విద్యాసంస్థలు, ఆస్పత్రులు, రెవెన్యూ తదితర కార్యాలయాలకు సంబంధించి బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఏప్రిల్‌ 17వ తేదీలోపు ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు చెందిన పెండింగ్‌ విద్యుత్‌ బకాయిలు చెల్లిస్తే సర్‌చార్జి మాఫీ అవుతుందని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అధికారులు సహకరించాలి.

? పీఎం సూర్యఘర్‌ పథకంతో ప్రయోజనం

! పీఎం సూర్యఘర్‌ పథకంతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇంటి పైకప్పుపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసి కరెంట్‌ ఉత్పత్తికి కంపెనీలనుబట్టి రూ.2.50 లక్షల వరకు వ్యయం అవుతుండగా బ్యాంకుల ద్వారా 80 శాతం రుణం ఏర్పాటు చేసి నెలలోపు రాయితీ మొత్తం ప్రభుత్వం వినియోగదారుడి బ్యాంక్‌ ఖాతాలో జమచేస్తుంది. బ్యాంకు రుణం అవసరం లేకుండా ఏర్పాటు చేసుకున్న వారికి కూడా రాయితీ ఇస్తుంది. ఇంటి అవసరాలకు వాడుకుని మిగిలిన సోలార్‌ కరెంట్‌ను ఒక యూనిట్‌ రూ.2.09 పైసలుకు ఎస్పీడీసీఎల్‌ కొనుగోలు చేస్తుంది.

- పుంగనూరు, ఆంధ్రజ్యోతి

Updated Date - Mar 24 , 2025 | 01:39 AM