Share News

TMC: కౌన్సిల్‌ భేటీలో హైడ్రామా!

ABN , Publish Date - Feb 21 , 2025 | 01:40 AM

తనకు సరైన వివరణ అందలేదని మేయర్‌ బాయ్‌కట్‌ చేసి సభనుంచి వెళ్లిపోయారు. సుమారు 10 మంది కార్పొరేటర్లు ఆమెవెంట వెళ్లిపోయారు. ఇలా గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో హైడ్రామా నడిచింది.

TMC: కౌన్సిల్‌ భేటీలో హైడ్రామా!
సమావేశం జరుపుతున్న డిప్యూటీ స్పీకర్‌ ముద్ర నారాయణ (ఇన్‌సెట్లో) బయటకు వెళ్లిపోతున్న శిరీష

క్షమాపణలు చెప్పిన కమిషనర్‌, అధికారులు

డిప్యూటీ మేయర్‌ ముద్ర నారాయణ అధ్యక్షతన సాగిన కౌన్సిల్‌ సమావేశం

తిరుపతి, ఫిబ్రవరి20(ఆంధ్రజ్యోతి) : ‘డిప్యూటీ మేయర్‌ ఎన్నిక నేపథ్యంలో ఓ భవనం కూల్చివేతకు వెళ్లిన తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు ప్రవర్తించిన తీరు నన్ను బాధించింది. వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో కమిషనర్‌ చెప్పాలి. ఆ తర్వాతే కౌన్సిల్‌ సమావేశం కొనసాగుతుంది’ అంటూ మేయర్‌ డాక్టర్‌ శిరీష డిమాండ్‌ చేశారు.

‘ఆ భవనం కార్పొరేటర్‌ శేఖర్‌ రెడ్డి పేరుతో లేదు. అది పూర్తిగా అక్రమ కట్టడం. నిబంధనల మేరకే అధికారులం అక్కడకు వెళ్లాం. విధుల్లో భాగంగా తగిన గౌరవ, మర్యాదలు ఇవ్వలేకపోయివుంటే క్షమాపణలు చెబుతున్నా’ అని డీసీపీ మహాపాత్ర చెప్పారు. అయితే డీసీపీ క్షమాపణలకు తాను సంతృప్తి చెందలేదని, ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని కమిషనర్‌ను మేయర్‌ అడిగారు. ‘వాళ్ల తరపున నేను కూడా క్షమాపణ చెబుతున్నా. వాళ్లకు మెమో ఇచ్చి చర్యలు తీసుకుంటాం.’

ఇంతలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జోక్యం చేసుకుని మేయర్‌కు తగిన గుర్తింపు ఇవ్వని అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ చెప్పారని, సభను సజావుగా సాగేలా చూడాలని సూచించారు. తనకు సరైన వివరణ అందలేదని మేయర్‌ బాయ్‌కట్‌ చేసి సభనుంచి వెళ్లిపోయారు. సుమారు 10 మంది కార్పొరేటర్లు ఆమెవెంట వెళ్లిపోయారు. ఇలా గురువారం జరిగిన కౌన్సిల్‌ సమావేశంలో హైడ్రామా నడిచింది.

మేయర్‌గా ముద్రనారాయణకు బాధ్యతలు

అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి జీతభత్యాలు, పారిశుధ్యానికి సంబంధించిన కీలక అజెండా అంశాలపై చర్చించాల్సి ఉండడంతో కౌన్సిల్‌ సమావేశం జరగాలని కార్పొరేటర్లు పట్టుపడ్డారు. సభలో 15 మంది సభ్యులు ఉంటే కౌన్సిల్‌ జరుపుకోవచ్చన్న నిబంధన ఉండడంతో కమిషనర్‌ మౌర్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ అనుమతితో ఇద్దరు డిప్యూటీ మేయర్లలో సీనియర్‌గా ఉండే ముద్ర నారాయణకు సభ నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్సీ మునికృష్ణ ప్రతిపాదించగా, ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు బలపరిచారు. దీంతో సభ సజావుగా సాగింది.

రూ.271 కోట్ల బడ్జెట్‌ అంచనాకు ఆమోదం

తిరుపతి నగరపాలక సంస్థ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ272కోట్లతో సిద్ధం చేసిన బడ్జెట్‌ అంచనాలకు సభ ఆమోదం తెలిపింది. రెవెన్యూ ఆదాయం రూ.170 కోట్లు, ఖర్చు రూ.116కోట్లు, మూలధన రాబడి రూ.92కోట్లు, ఖర్చు రూ.130 కోట్లకు అంచనా వేశారు. అనంతరం జరిగిన కౌన్సిల్‌ సర్వసభ్య సమావేశంలో 41 అంశాలపై చర్చ జరపగా ఒక ఉద్యోగికి ప్రమోషన్‌ ఇచ్చే అంశాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. టేబుల్‌ అజెండాగా రెండు అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు.


మేయర్‌పై మండిపాటు

నాలుగేళ్ల పాలనలో మేయర్‌కు తగిన గౌరవం ఇవ్వకుండా మౌనంగా కూర్చోబెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదని ఎమ్మెల్యేతోపాటు పలువురు కార్పొరేటర్లు మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెకు గౌరవంతో పాటు తగిన స్వేచ్చ ఇచ్చామన్నారు. మేయర్‌ స్థానంలో ఉండి అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడానికి వెళ్లడమే పెద్ద తప్పు అని, అయినప్పటికీ సభా ముఖంగా కమిషనర్‌తో పాటు డీసీపీ క్షమాపణలు చెప్పిన తర్వాత లేచివెళ్లిపోవడం సభ్యత కాదన్నారు.

Updated Date - Feb 21 , 2025 | 01:40 AM