Share News

నేను బాసు మనిషిని!

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:54 AM

ఉన్నతాధికారుల్ని బుట్టలో పడేయడంలో సిద్ధహస్తుడైన ఆ సీఐ గతంలో ఉన్నతాధికారి కోసం ఎర్రచందనం దుంగల్ని తరలిస్తూ అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం చిత్తూరులో ఓ కీలకమైన స్టేషన్‌లో పనిచేస్తున్న ఆ సీఐ ఇప్పుడూ ఉన్నతాధికారి పేరు చెప్పుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.‘

 నేను బాసు మనిషిని!

చిలక్కొట్టుడులో ఆ సీఐ ప్రత్యేకం

ప్రతి పనికీ స్టేషన్‌లోనే లావాదేవీలు

ప్రజాప్రతినిధులనూ లెక్కపెట్టని వైనం

దొంగ నుంచి రూ.లక్షలు వసూలు చేసినా చర్యలు శూన్యం

గతంలోనూ ఎర్రచందనం తరలిస్తూ సస్పెండైన వైనం

చిత్తూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): ఉన్నతాధికారుల్ని బుట్టలో పడేయడంలో సిద్ధహస్తుడైన ఆ సీఐ గతంలో ఉన్నతాధికారి కోసం ఎర్రచందనం దుంగల్ని తరలిస్తూ అటవీశాఖ అధికారులకు పట్టుబడ్డారు. ప్రస్తుతం చిత్తూరులో ఓ కీలకమైన స్టేషన్‌లో పనిచేస్తున్న ఆ సీఐ ఇప్పుడూ ఉన్నతాధికారి పేరు చెప్పుకుని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి.‘ఎమ్మెల్యే, ఎంపీ.. ఎవడైనా నన్నేం చేయలేడు. నా వెనుక బాసున్నాడు. నాకేమైనా అయితే ఆయనే చూసుకుంటాడు’ ....ఇవీ ఆ సీఐ నోట నిత్యం వినిపించే మాటలు. అనుకున్నట్టే స్టేషన్‌లోనే పంచాయితీలు పెట్టడం, బెదిరించి రూ.లక్షలు వసూలు చేయడం నిత్యకృత్యమైపోయింది.తాజాగా ఓ దొంగ నుంచి రూ.లక్షల్లో వసూలు చేసిన విషయం బయటికి పొక్కినా ఇతనిపై చర్యలు లేకపోవడంతో నిజంగానే ఉన్నతాధికారి అండ ఉందని పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తోంది.

గతంలో ఎర్రచందనం దుంగల్ని తరలిస్తూ..

ఉన్నతాధికారుల్ని ప్రసన్నం చేసుకునే ఈ సీఐ గతంలో ఎర్రావారిపాలెం ఎస్‌ఐగా పనిచేస్తున్నప్పుడు కూడా ఉన్నతాధికారి పేరు చెప్పి.. ఎర్రచందనం దుంగల్ని తరలిస్తూ అటవీశాఖ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయారు.అప్పట్లో కేసు నమోదవగా సస్పెండయ్యారు. ఈ కారణంగానే ఆయన బ్యాచ్‌ వాళ్లంతా డీఎస్పీలుగా పనిచేస్తుంటే, ఆయన మాత్రం సీఐగానే ఉండిపోయారు.

దొంగ నుంచి డబ్బు వసూలు నిజమే..

గతేడాది చిత్తూరు నగరంలో తాళం వేసిన ఇంటిని పగులగొట్టి ఓ దొంగ రూ.లక్షల్లో నగదు, అర కిలోకు పైగా బంగారు ఆభరణాలను చోరీ చేశాడు. నిందితుడిని బెంగళూరులో పట్టుకున్న పోలీసులు కొంత నగదు, నగలు సీజ్‌ చేసి అరెస్టు చూపించారు. తాజాగా ఆ దొంగ రాయచోటి పోలీసులకు దొరకగా, ఓ దొంగతనానికి సంబంధించి చిత్తూరు సీఐకి రూ.12.50 లక్షలు ఇచ్చినట్లు అంగీకరించాడు. కొంత మొత్తాన్ని క్యాష్‌గా, మరికొంత మొత్తాన్ని ముగ్గురు కానిస్టేబుళ్లకు ఫోన్‌ పే ద్వారా చెల్లించినట్లు తెలుస్తోంది. మధ్య స్థాయి అధికారి విచారించి వసూలు చేసింది నిజమే, కానీ 12.50 లక్షలు కాదు, రూ.6 లక్షలే అని నిర్ధారించినట్లు సమాచారం. ఈ విషయం ఆయన చెప్పుకుని తిరిగే ఉన్నతాధికారి దృష్టికీ వెళ్లింది. విచారణకు ఆదేశించారు. 10 రోజులవుతున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.డబ్బిచ్చిన దొంగ అందుబాటులో ఉన్నాడు, తీసుకున్న సీఐ.. ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు, కళ్ల ముందే అందరూ ఉన్నా, తప్పు జరిగిందా లేదా అని నిర్ధారించడానికి 10 రోజులు అవసరమా అనేది చర్చ జరుగుతోంది. సీఐకి ఉన్నతాధికారి అండ ఉండడంతోనే విచారణ ముందుకు సాగడం లేదని డిపార్ట్‌మెంటులో గుసగుసలు వినిపిస్తున్నాయి.

సీఐ చిలక్కొట్టుడులో కొన్ని

తన స్టేషనులోని ఓ కానిస్టేబుల్‌ ద్వారా నగరంలోని ప్రతి లాడ్జి నుంచీ నెలకు రూ.10 వేల చొప్పున వసూలు .

గత నెలలో సంతపేటకు చెందిన ఓ యువకుడు గంజాయి సేవిస్తుండగా.. స్టేషన్‌కు పట్టుకొచ్చి అమ్ముతున్నావని బెదిరించారు. రూ.లక్ష డిమాండ్‌ చేయగా.. రూ.75 వేలకు బేరం కుదిరింది. తీసుకుని వదిలేశారు.

మద్యం దుకాణాల యజమానుల్ని స్టేషన్‌కు పిలిచి నెల మామూళ్లు ఇవ్వాలని బెదిరించారు.

ఓ ఇంట్లో పనికొచ్చిన వ్యక్తి ఇటీవల పనిచేస్తూ మిద్దెపైనుంచి పడి మృతి చెందాడు. యజమానిని పిలిచి బెదిరించి రూ.3 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

గతేడాది ఆగస్టులో మూడు గ్రానైట్‌ లారీలను సీజ్‌ చేశారు. రూ1.50 లక్షల చొప్పున ఫైన్‌ వేస్తానని బెదిరించి రూ.లక్షకు బేరం మాట్లాడారు. అంత ఇవ్వలేమని, అవసరమైతే ఆ రాయిని మీరే అమ్ముకోండి.. లారీలను మాత్రం వదిలేయండి.. అంటూ అడుక్కున్నా నాలుగు రోజులు వేధించి రెండు లారీల నుంచి రూ.75 వేల చొప్పున, మరో లారీ నుంచి రూ.50 వేలు చొప్పున వసూలు చేశారు.

Updated Date - Mar 25 , 2025 | 01:54 AM