Share News

శబరిమలలో పూజ.. వివాదంలో మలయాళ సూపర్ స్టార్స్..

ABN , Publish Date - Mar 26 , 2025 | 05:14 PM

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్‌లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా శబరిమల గుడికి వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఓ పనితో వివాదం రాజుకుంది.

శబరిమలలో పూజ.. వివాదంలో మలయాళ సూపర్ స్టార్స్..
Mohanlal And Mammootty

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఆయన బెస్ట్ ఫ్రెండ్.. మలయాళ మెగాస్టార్ ముమ్ముట్టి వివాదంలో చిక్కుకున్నారు. శబరిమలలో ప్రత్యేక పూజల సందర్భంగా మోహన్ లాల్ చేసిన ఓ పని ఈ వివాదానికి దారి తీసింది. దీనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతోంది. కొంతమంది నెటిజన్లు మోహన్ లాల్, మమ్ముట్టిలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతున్నారు. ఆ ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ తీరుపై మండిపడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. మోహన్ లాల్ నటించిన లూసిఫర్ 2 సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా మోహన్ లాల్ ప్రమోషన్లలో బిజీ అయిపోయారు. దేశం ఈ మూలనుంచి ఆ మూల వరకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మార్చి 18వ తేదీన ఆయన శబరిమల వెళ్లారు.


అక్కడ ప్రత్యేకంగా ‘ఉష పూజ’ చేయించారు. తన బెస్ట్ ఫ్రెండ్ మమ్ముట్టి పేరు మీద కూడా పూజ చేయించారు. మమ్ముట్టి ఒరిజినల్ పేరు మహ్మద్ కుట్టి అని, జన్మ నక్షత్రం విశాఖ అని పూజలు చేసే పంతులుకు తెలిపారు. దేవస్థానం ఆఫీస్ నుంచి విడుదలైన రిసిప్ట్ కారణంగా ఈ విషయాలు బయటపడ్డాయి. ఆ రిసిప్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో వివాదం రాజుకుంది. హిందూ దేవాలయంలో ముస్లిం వ్యక్తి గురించి పూజలు ఎలా చేయిస్తావంటూ కొంతమంది మోహన్ లాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుళ్లతో ఆటలు ఆడుతున్నారా? అంటూ తిట్టిపోస్తున్నారు. మాధ్యమం అనే మలయాళ న్యూస్ పేపర్ మాజీ ఎడిటర్ అబ్దుల్లా మమ్ముట్టిపై మండిపడ్డారు.


మోహన్ లాల్‌కు చెప్పి శబరిమలలో పూజలు చేయించుకుని ఉంటే కచ్చితంగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇస్లాం లా ప్రకారం.. ఇస్లాం మతాన్ని ఫాలో అయ్యేవారు.. అల్లాను మాత్రమే ప్రార్థించాలని స్పష్టం చేశారు. ఇక, ఈ వివాదంపై మోహన్ లాల్ స్పందించారు. ఓ జాతీయ మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘ పూజలు చేయటం అనేది వ్యక్తిగత విషయం. మమ్ముట్టి గురించి పూజ చేయడంలో తప్పేమీలేదు. మమ్ముట్టికి ఆరోగ్యం బాగా లేదని తెలిసి పూజలు చేయించా. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. అదృష్టమో.. దురదృష్టమో .. ఈ విషయం బయటకు వచ్చింది. మేమిద్దరం ప్రతీ వారానికి ఒకసారి కలుస్తుంటాం. రెండు, మూడు రోజులకు ఓ సారి కాల్స్ చేసుకుని మాట్లాడుకుంటాం. మేము మంచి స్నేహితులం’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

ఒకే సారి అంతమంది

PM Modi: రామనవమికి పంబన్ బ్రిడ్జిని ప్రారంభించనున్న మోదీ

Global Startup Ecosystem: స్టార్టప్ ర్యాంకింగ్‌లో ఇండియా ఎక్కడ..దేశంలో ఈ నగరమే టాప్..

Updated Date - Mar 26 , 2025 | 05:35 PM