Pilot forgets Passport: గగనతలంలో ఉండగా జరిగిన పొరపాటు గుర్తొచ్చి పైలట్‌కు షాక్.. విమానం యూటర్న్!
ABN , Publish Date - Mar 26 , 2025 | 05:30 PM
యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ విమాన పైలట్ తన పాస్‌పోర్టు మర్చిపోవడంతో విమానం మార్గమధ్యంలో యూటర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన కారణంగా విమానం ఆరు గంటల ఆలస్యంగా షాంఘై చేరుకోవాల్సి వచ్చింది. అమెరికాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది.

ఇంటర్నెట్ డెస్క్: మతిమరుపు సహజం కానీ దాని పర్యవసానాలు మాత్రం ఒక్కొక్కరికీ ఒక్కోలా ఉంటాయి. సామాన్యలకు మతిమరపుతో పెద్ద సమస్యలేవీ ఉండకపోవచ్చు గానీ వృత్తి నిపుణులకు.. ముఖ్యంగా వైద్యులు, పైలట్లకు మతిమరుపు ఊహించని అనుభవాలను మిగులుస్తుంది. అమెరికాకు చెందిన ఓ పైలట్‌కు ఇటీవల సరిగ్గా ఇదే పరిస్థితి ఎదురైంది. గగనతలంలో వెళుతుండగా అతడికి తన పొరపాటు గుర్తుకు రావడంతో చివరకు విమానాన్ని వెనక్కు మళ్లించాల్సి వచ్చింది.
పూర్తి వివరాల్లోకి వెళితే, యూనైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్ యూఏ 198 విమానం శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు లాస్ ఏంజిలిస్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి చైనాకు బయలుదేరింది.
Also Read: మ్యాచ్‌లో ఓటమితో ఆగ్రహం.. బాలిక జుట్టు పట్టి లాగిన కోచ్‌కు భారీ షాక్
అయితే, పసిఫిక్ మహాసముద్రం మీదుగా గగనతలంలో వెళుతున్న సమయంలో విమాన పైలట్లలో ఒకరికి తను చేసిన తప్పు గుర్తొచ్చింది. తన పాస్‌పోర్టును ఇంట్లోనే వదిలివచ్చిన విషయం గుర్తుకు రాగానే అతడు నెత్తిబాదుకున్నాడు. విమానాన్ని వెనక్కు మళ్లించడం మినహా మరో మార్గం లేదని గుర్తించి చివరకు ఇదే విషయాన్ని ప్రయాణికులతో పంచుకున్నాడు. దీంతో, సాయంత్రం విమానం మళ్లీ లాస్ ఏంజిలిస్ ఎయిర్‌పొర్టుకు చేరుకుంది.
ఆ తరువాత ఇతర సిబ్బంది సాయంతో చైనాకు వెళ్లింది. ఫలితంగా ఆరు గంటల ఆలస్యంగా గమ్యస్థానానికి చేరుకుంది. అయితే, ఈ జాప్యానికి ఎయిర్‌లైన్స్ తమకు క్షమాపణలు చెప్పిందని ప్రయాణికులు తెలిపారు. తమకు పరిహారంతో పాటు ఉచిత భోజన కూపన్లు కూడా ఇచ్చిందన్నారు.
Also Read: ఫైవ్ స్టార్ హోటల్‌ను బురిడీ కొట్టించబోయిన కంటెంట్ క్రియేటర్.. చివరకు ఏం జరిగిందో తెలిస్తే..
ఈ కూపన్లను తాను ఎయిర్‌పోర్టులోని ఓ రెస్టారెంట్‌లో వినియోగించుకున్నట్టు ఓ ప్రయాణికురాలు చెప్పారు. ఈ జాప్యం ఇతర విమానాలపై కూడా పడింది. షాంఘాయ్ నుంచి బయలుదేరాల్సిన విమానం కూడా ఆలస్యంగా ప్రయాణం ప్రారంభించింది.
ఈ ఉదంతంతో పైలట్‌కే కాకుండా ఎయిర్‌లైన్స్‌కు కూడా తలవంపులేనని విమానయాన రంగ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. ఇది కచ్చితంగా క్రమశిక్షణా రాహిత్యమేనని అన్నారు. యూనైటెడ్ ఎయిర్‌లైన్స్ లాంటి భారీ సంస్థల్లో ఇలాంటి ఘటనలు వెలుగు చూడటం అస్సలు ఆమోదయోగ్యం కాదని అన్నారు.