Share News

విచ్చలవిడిగా క్వారీ పేలుళ్లు

ABN , Publish Date - Apr 04 , 2025 | 01:46 AM

ప్రశాంతమైన పల్లెలో ఆరుబయట నిద్రించలేరు. పగటి పూట మామిడి తోటల్లో పశువులను మేపుకొనే పరిస్థితి లేదు. ఎందుకంటే.. క్వారీలో ఎప్పుడు పేలుడు సంభవిస్తుందో.. ఏ రాయి వచ్చి తగులుతుందోనన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తుంది.

విచ్చలవిడిగా క్వారీ పేలుళ్లు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు

నాలుగు గ్రామాల్లో భయానక వాతావరణం

రాయితగలడంతో తలపగిలి ప్రాణాపాయ స్థితిలో బాలుడు

పుత్తూరు, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి):

ప్రశాంతమైన పల్లెలో ఆరుబయట నిద్రించలేరు. పగటి పూట మామిడి తోటల్లో పశువులను మేపుకొనే పరిస్థితి లేదు. ఎందుకంటే.. క్వారీలో ఎప్పుడు పేలుడు సంభవిస్తుందో.. ఏ రాయి వచ్చి తగులుతుందోనన్న ఆందోళన వారిని పట్టి పీడిస్తుంది. ఇలాంటి భయానక పరిస్థితి పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని ఈశ్వరాపురం, దళితవాడ, యానాదికాలనీ, బొజ్జనత్తం ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈశ్వరాపురం మామిడితోటలో కాపలా వున్న రామయ్య మూడేళ్ల కుమారుడు దినేశ్‌ బుధవారం మధ్యాహ్నం గుడిసె ముందు ఆడుకుంటున్నాడు. ఆ సమయంలో మైనింగ్‌లో జరిపిన బ్లాస్టింగ్‌ వల్ల ఓ పదునైన రాయి వచ్చి ఆ బాలుడి తలను తాకింది. వెంటనే రక్తం మడుగులో పడిపోయాడు. హుటాహుటిన పుత్తూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. ఇంకా పిల్లవాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. ఇలాంటి ఉదంతాలు ఎన్నెన్నో... ఆ నాలుగు గ్రామాల్లో బ్లాస్టింగ్‌ కుదుపుల వల్ల ఇళ్ల గోడలు బీటలు వారుతున్నాయి. టీవీలు కింద పడి పగిలిపోతున్నాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నామని గ్రామస్థులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా, సదస్సుల్లో వినతులు ఇచ్చినా ఫలితం శూన్యం. ఈ ఉదంతాన్ని గురువారం పుత్తూరు వచ్చిన కలెక్టర్‌ దృష్టికి సీపీఎం కార్యదర్శి వెంకటేశ్‌ నాయకత్వంలో ఆ కాలనీవాసులు తీసుకువచ్చారు. కలెక్టర్‌ ఆదేశం మేరకు హుటాహుటిన సాయంత్రం తహసీల్దార్‌ వెంకటేశ్వర్లు ఆ ప్రాంతాన్ని సందర్శించారు. మైనింగ్‌ నిర్వాహకులను పిలిచి ప్రభుత్వ అనుమతులన్నింటిని శుక్రవారం మధ్యాహ్నం తీసుకురావాలని ఆదేశించారు. మైనింగ్‌ నిర్వాహకులకు నోటీసులు ఇవ్వాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సమావేశానికి మైనింగ్‌ బాధితులూ రావాలని తహసీల్దార్‌ కోరారు.

Updated Date - Apr 04 , 2025 | 01:46 AM