Share News

జిల్లాలో ఎనిమిది రోడ్ల అభివృద్ధికి రూ.20.30 కోట్లు

ABN , Publish Date - Mar 30 , 2025 | 02:36 AM

జిల్లాలో ఎనిమిది ప్రధాన రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20.30 కోట్లు కేటాయించింది. అధ్వానంగా ఉన్న ముఖ్యమైన రోడ్లను తక్షణం అభివృద్ధి పరచాల్సిన అవసరముందంటూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థనకు స్పందించిన ప్రభుత్వం కేటాయించింది.

జిల్లాలో ఎనిమిది రోడ్ల అభివృద్ధికి రూ.20.30 కోట్లు

ఎమ్మెల్యేల అభ్యర్థనపై నిధుల విడుదల

తిరుపతి, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఎనిమిది ప్రధాన రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20.30 కోట్లు కేటాయించింది. అధ్వానంగా ఉన్న ముఖ్యమైన రోడ్లను తక్షణం అభివృద్ధి పరచాల్సిన అవసరముందంటూ ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేసిన అభ్యర్థనకు స్పందించిన ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రోడ్ల అభివృద్ధికి సంబంధించి 86 పనులకు రూ. 200 కోట్లు, స్టేట్‌ హైవే రోడ్ల అభివృద్ధికి సంబంధించి 139 పనులకు రూ.400 కోట్లు చొప్పున ప్రభుత్వం నిధులు కేటాయించింది. అందులో జిల్లాకు సంబంధించి చంద్రగిరి, శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, గూడూరు నియోజకవర్గాలకు చెందిన ఎనిమిది రోడ్ల అభివృద్ధి పనులు ఉన్నాయి. జిల్లా మేజర్‌ రోడ్లకు సంబంధించి చంద్రగిరి నియోజకవర్గం పెద్దమల్లెల- ఎర్రావారిపాలెం మార్గంలో 7 కిలోమీటర్ల మేరకు, అలాగే ఎర్రావారిపాలెం మండలం ఎల్లమంద నుంచీ ఉస్తికాయలపెంట మీదుగా పింఛా రోడ్డు వరకూ 7 కిలోమీటర్ల మేరకు మొత్తం 14.93 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రూ.3.80 కోట్లు కేటాయించారు. రాష్ట్ర హైవేలకు సంబంధించి గూడూరు - దుగరాజపట్నం రోడ్డు నుంచీ నిడిగుర్తి రోడ్డు వరకూ 7.60 కిలోమీటర్లు అభివృద్ధి చేయడానికి రూ.3 కోట్లు కేటాయించారు. గూడూరులో మద్రాసు - కోల్‌కతా రోడ్డు నుంచీ బంగాళాఖాతం రోడ్డు వరకూ 3.20 కిలోమీటర్ల రోడ్డు అభివృద్ధికి రూ.1.80 కోట్లు కేటాయించారు. సూళ్లూరుపేటలో ఎంసీ రోడ్డు నుంచీ బే ఆఫ్‌ బెంగాల్‌ రోడ్డు వరకూ, అలాగే ఓజిలి - గొల్లపల్లి రోడ్డు వరకూ మొత్తం 8.60 కిలోమీటర్ల అభివృద్ధికి రూ.3.20 కోట్లు కేటాయించారు. భాకరాపేట నుంచీ తలకోన నడుమ 23.60 కిలోమీటర్ల రోడ్డును మెరుగుపరిచేందుకు రూ.6 కోట్లు కేటాయించారు. శ్రీకాళహస్తి-మద్దికండ్రిగ రోడ్డులో 3 కిలోమీటర్ల రోడ్డును బాగుచేయడానికి రూ.2.50 కోట్లు కేటాయించారు. ఈ ఎనిమిది పనుల కింద మొత్తం 61 కిలోమీటర్ల మేర ఎనిమిది రోడ్ల అభివృద్ధి పనులకు గానూ రూ.20.30 కోట్లు కేటాయిస్తూ ఆర్‌ అండ్‌ బీ శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్‌ దండే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Mar 30 , 2025 | 02:36 AM