వైభవంగా ఉరుసు మహోత్సవం
ABN , Publish Date - Apr 05 , 2025 | 02:24 AM
నాయుడుపేటలో ఎనిమిదేళ్ల తర్వాత హజరత్ అమీర్‌షావలి దర్గా గంధోత్సవం, ఉరుసు జరుగుతోంది.

నాయుడుపేట, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి): నాయుడుపేటలో ఎనిమిదేళ్ల తర్వాత హజరత్ అమీర్‌షావలి దర్గా గంధోత్సవం, ఉరుసు జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున దొర్నాదుల చెంచుకృష్ణయ్య నివాసం నుంచి మంగళవాయిద్యాల నడుమ గంధం ఊరేగింపుగా బయలుదేరి.. హజరత్ అమీర్‌షావలి దర్గా వద్దకు చేరుకుంది. రాపూరుకు చెందిన సయ్యద్ నూర్‌షావలిచే చదివింపులు కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎంపీ, ఉరుసు దర్గా కమిటీ చైర్మన్ నెలవల సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ శిరసనంబేటి విజయభాస్కర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ రఫీ ఆధ్వర్యంలో గంధం పంపిణీ చేశారు. సాయంత్రం దర్గాతోపాటు ఆ ప్రాంతమంతా విద్యుద్దీపాలతో మిరుమిట్లు గొలిపాయి. భక్తులు బారులుతీరి అమీర్‌షావలి దర్గాను దర్శించుకున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, తదితరులు దర్గాను దర్శించుకున్నారు. పాటకచేరి విశేషంగా ఆకట్టుకుంది. ఉరుసులో అవాంఛనీయ ఘటనలు జరగకుండా డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.