Share News

నేడు,రేపు పుంగనూరు గంగజాతర

ABN , Publish Date - Mar 25 , 2025 | 01:52 AM

భక్తుల పాలిట ఆరోగ్య వరప్రదాతగా పేరుగాంచిన పుంగనూరు గంగమ్మ జాతరను మంగళ, బుధవారాల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.

నేడు,రేపు పుంగనూరు గంగజాతర
సుగుటూరు గంగమ్మ

పుంగనూరు, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): భక్తుల పాలిట ఆరోగ్య వరప్రదాతగా పేరుగాంచిన పుంగనూరు గంగమ్మ జాతరను మంగళ, బుధవారాల్లో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి.జమిందారీ వంశస్తుల ఆధ్వర్యంలో ఈ జాతరను ఏటా హోలీపండుగ అనంతరం ఉగాది పండుగకు ముందు వచ్చే మంగళవారం పుంగనూరుతో బాటు పరిసర 100 గ్రామాల్లో ప్రజలు ఘనంగా నిర్వహించుకుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ర్టాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తారు. మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తున్న ఈ జాతరలో అన్ని మతాల వారూ పాల్గొంటారు. జాతర సందర్భంగా పుంగనూరులో ఆలయాలు, ఇళ్లు రంగులతో ముస్తాబయ్యాయి.సోమవారం మున్సిపల్‌, పోలీస్‌, విద్యుత్‌ శాఖల అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.జమీందార్లు సోమశేఖర్‌ చిక్కరాయులు, మల్లిఖార్జున చిక్కరాయులతో కలిసి మున్సిపల్‌ కమిషనర్‌ మధుసూధన్‌రెడ్డి, పలువురు ప్రముఖులు గంగమ్మ ఆలయం వద్ద పూజలు చేశారు.

జమీందార్ల ఇష్టదైవం

మధుర పాండ్యుల సంతతిగా సుగుటూరు నుంచి వచ్చిన పుంగనూరు జమీందార్లు పాలేగాళ్లుగా విజయనగరరాజుల కింద శిస్తు, జమానాలు వసూలు చేసేవారు.గంగమ్మను ఇష్టదైవంగా కొలిచే వీరు రాజ్యభాగ పరిష్కారం తరువాత పుంగనూరు చేరారు.సుగుటూరు గంగమ్మ విగ్రహాన్ని తీసుకొస్తుండగా ప్రస్తుతం గుడి ఉన్నచోట రథం ఇరుసు విరిగిపోవడంతో అక్కడే అమ్మవారి గుడిని నిర్మించి పూజా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టారు.అమ్మవారి పాదపీఠం కూడా అక్కడే లభించడంతో సుగుటూరు గంగమ్మను ఇంటి ఇలవేల్పుగా కొలుస్తూ ఏటా జాతర జరిపిస్తున్నారు. సుగుటూరు గంగమ్మను ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే జాతర సందర్భంగా జనం మధ్యకు తీసుకువచ్చి పూజలు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో పుంగనూరులోని జమీందారి ప్యాలెస్‌లో వుంచుతారు. మంగళవారం ప్రారంభమయ్యే జాతర బుధవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, నిమజ్జనంతో ముగుస్తుంది.శక్తి ఆలయాల్లోని 8 ప్రాంతాల్లో స్థిరపడిన సుగుటూరు గంగమ్మ సోదరీమణులైన అష్టగంగమ్మలకు జాతర సందర్భంగా భక్తులు మొక్కులు తీర్చుకొంటారు. జాతరకు వారం రోజుల ముందుగానే తొలి, మలి చాటింపులతో ప్రజలకు తెలియజేస్తారు.మంగళవారం పుంగనూరులో భారీఎత్తున గొర్రెపొట్టేళ్ల సంత జరుగుతుంది.ప్యాలస్‌ నుంచి అమ్మవారి విగ్రహాన్ని బయటకు తెచ్చి జమీందారి వంశీకులు రాత్రి కలశ ప్రతిష్ట, శాంతిపూజ నిర్వహించి తొలిపూజ చేస్తారు. తర్వాత వీఐపీలు పూజలు నిర్వహించాక అమ్మవారిని ప్రత్యేక వాహనంపై పురవీధుల్లో ఊరేగిస్తారు. పుంగనూరులో శక్తి ఆలయాలుగా 8 మూలల్లో స్థిరపడ్డ అష్ట గంగమ్మలైన పాత బస్టాండు సమీపంలోని విరూపాక్షి మారెమ్మ, తూర్పుపాలెంలో స్థలగంగమ్మ, పలమనేరు రోడ్డులోని మల్లారమ్మ, తూర్పు మొగసాలలోని నల్లగంగమ్మ, కట్టకిందపాళ్యంలోని పడమటి గంగమ్మ, పుంగమ్మకట్టపై నీళ్లరాళ్ల గంగమ్మ, కోనేరు వద్దగల బోయకొండ గంగమ్మలను పలకరిస్తూ ఊరేగింపు సాగుతుంది.తూర్పు మొగసాలలోని నల్లగంగమ్మ అనబడే నడివీధి గంగమ్మ ఊరేగింపులో కలుస్తుంది.బుధవారం తెల్లవారుజామున ప్యాలెస్‌ వద్ద గల సుగుటూరు గంగమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించి బెస్త, యాదవ, తోటి కులస్తులు ఘనంగా పూజలు చేస్తారు.బుధవారం రాత్రి అమ్మవారి ఊరేగింపు తరువాత తూర్పు మొగసాలలో జలధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.తరువాత విగ్రహాన్ని జమిందారు ప్యాలెస్‌కు తీసుకెళ్లి భద్రపరుస్తారు.

గెరిగెలతో మొక్కులు ప్రత్యేకం

సుగుటూరు గంగ జాతరలో గెరిగెలతో మొక్కులు తీర్చుకోవడం విశేషం.స్త్రీలు, పురుషులు, గంగవేషాలు వేసుకొని బెల్లం పానకం, పసుపునీళ్లు, మజ్జిగ, కుండల్లో నింపుకుని పైన రెండు మూరల ఎత్తు వరకు వేపాకు, పూలతో అలంకరించి నెత్తినపెట్టుకొని పురవీధుల్లో ప్రదర్శనగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు. పాదమండపం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.అమ్మవారికి జంతుబలులు సమర్పించి మంగళహారతులతో మొక్కులు తీర్చుకొంటారు. ఎనుపోతులు, గొర్రెపోటేళ్లు, మేకపోతులు, కోళ్లను అమ్మవారికి వేలసంఖ్యలో బలి ఇస్తారు.

విరూపాక్షి మారెమ్మ

సుగుటూరు గంగమ్మ తర్వాత బలమైన శక్తిదేవతగా విరూపాక్షి మారెమ్మ పేరుగాంచారు. బలులు తీసుకోవడంలో, పూజలు అందుకోవడంలో ముందుంటూ నిరంతరం భక్తులు సందర్శించే ఆలయంగా వెలుగొందుతోంది. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ బస్టాండు సమీపంలోని మారెమ్మ ఆలయ ఆవరణలో, దండుపాళ్యం సమీపంలో, పలమనేరు రోడ్డులో ఓంశక్తి భక్తులు ఆలయాలను నిర్మించి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

Updated Date - Mar 25 , 2025 | 01:52 AM