ట్రాక్టర్ ట్రాలీ బోల్తా
ABN , Publish Date - Apr 04 , 2025 | 01:26 AM
ఉపాధి పనులు చేయడానికి ట్రాక్టర్‌లో వెళుతుండగా ముందు చక్రం ఊడిపోవడంతో ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారు.

- 19 మంది ఉపాధి కూలీలకు గాయాలు
విజయపురం/నగరి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): ఉపాధి పనులు చేయడానికి ట్రాక్టర్‌లో వెళుతుండగా ముందు చక్రం ఊడిపోవడంతో ట్రాలీ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 19 మంది గాయపడ్డారు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. విజయపురం మండలం ఆమగుంట గ్రామానికి చెందిన ఉపాధి హామీ పథకం కూలీలు పన్నూరు సమీపాన ఉన్న అడవిలో పనులు చేయడానికి ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కి బయల్దేరారు. పన్నూరు దళితవాడ సమీపంలో పెళాసపాళెం రోడ్డులోకి వచ్చేసరికి ట్రాక్టర్ ఇంజనుకున్న ముందు చక్రం ప్రమాదవశాత్తూ ఊడిపోయింది. దీంతో ట్రాక్టర్ ట్రాలీ రోడ్డుపక్కన బోల్తాపడింది. అందులో 20 మంది కూలీలు ఉంటే.. 19 మందికి గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం ఇవ్వగా మూడు అంబులెన్సుల్లో బాధితులను నగరి ఏరియా వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్, చిత్తూరు పార్లమెంటు టీడీపీ అధికార ప్రతినిధి చినబాబు, ఇన్‌చార్జి ఎంపీడీవో రాజేంద్రన్, ఏపీడీ సునీల్‌కుమార్, ఏపీవో ధనయ్య, టీడీపీ నాయకులు వైద్యశాలకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు ఎమ్మెల్యే సూచించారు.
గాయపడ్డవారిలో ఇద్దరు తిరుపతికి తరలింపు
గాయపడిన వారిలో శకుంతల(50), కన్నెమ్మ(45), మన్నారు(40), రాజా(32), ధనమ్మ(52), పద్మ(43), లక్ష్మి(54), విమల(32), మునెమ్మ(40), ఉష(38), రాణెమ్మ(55), శివమ్మ(54), శ్యామల(38), జమున(40), సరస్వతి(38), మునికృష్ణయ్య(54), కాంచన(49), కాంతమ్మ(55), అమరమ్మ(55) ఉన్నారు. వీరిలో కాంతమ్మ, అమరమ్మలను మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. మిగిలినవారంతా నగరి ఏరియా వైద్యశాలలోనే చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులు, వారి బంధువుల రోదనలతో నగరి ఏరియా వైద్యశాల సుమారు గంట సేపు దద్దరిల్లింది. బాధితులకు వైద్యులు జరీనా, మంజుల, కార్తికేయన్, లోకేష్, ప్రవీణ, శ్రీనాథ్, మహేష్, మౌనికలు తమ సిబ్బందితో కలిసి చికిత్స అందించారు.