Share News

Drug Smuggling: డ్రగ్స్‌ డోర్‌ డెలివరీ

ABN , Publish Date - Apr 07 , 2025 | 04:44 AM

మత్తుపదార్థాల బానిసలు ఆర్డరిస్తే.. కొరియర్‌లో ఇంటికే డ్రగ్స్‌ను సరఫరా చేసేలా కొన్ని గ్యాంగు లు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ-న్యాబ్‌) గుర్తించింది.

Drug Smuggling: డ్రగ్స్‌ డోర్‌ డెలివరీ

  • కొరియర్‌ పార్సిళ్లలో సరఫరా

  • ఇంటికే.. గంజాయి, సింథటిక్‌ డ్రగ్స్‌

  • టీజీ-న్యాబ్‌ విచారణలో బహిర్గతం

  • త్వరలో కొరియర్‌ సర్వీసులతో సమావేశానికి టీజీ-న్యాబ్‌ కసరత్తు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 6 (ఆంధ్రజ్యోతి): మత్తుపదార్థాల బానిసలు ఆర్డరిస్తే.. కొరియర్‌లో ఇంటికే డ్రగ్స్‌ను సరఫరా చేసేలా కొన్ని గ్యాంగు లు వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలంగాణ నార్కోటిక్స్‌ బ్యూరో(టీజీ-న్యాబ్‌) గుర్తించింది. గంజాయి మొదలు.. సింథటిక్‌ డ్రగ్స్‌ వరకు ఆర్డరిస్తే.. ఇంటికే పంపిస్తామని డ్రగ్స్‌ పెడ్లర్లు తమ వినియోగదారులకు ఆఫర్లిస్తున్నట్లు నిర్ధారించింది. ఇటీవల అమెరికా సహా.. ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌లో డ్రగ్స్‌ దందా చేసే అంతర్జాతీయ ముఠా గుట్టును టీజీ-న్యాబ్‌ రట్టు చేసిన విషయం తెలిసిందే..! తదుపరి దర్యాప్తులో ఈ కేసులో సౌరభ్‌ సుభాష్‌ అనే ఏజెంట్‌ కొరియర్‌ ద్వారా పదిసార్లు విదేశాల నుంచి డ్రగ్స్‌ను తెప్పించినట్లు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ కొరియర్‌ సర్వీసులు మొదలు.. దేశీయంగా ఆ సేవలందించే సంస్థలు తాము ఏ సరుకును డెలివరీ చేస్తున్నామనే దాన్ని.. ముఖ్యంగా డ్రగ్స్‌ను గుర్తించే వ్యవస్థను అభివృద్ధి చేసుకోలేదు. దీన్ని డ్రగ్స్‌ ముఠాలు వరంగా మార్చుకుంటున్నాయి. ఇలా సౌరభ్‌ పుణెలోని బోపడి ప్రాంతంలోఉన్న డీహెచ్‌ఎల్‌ కొరియర్‌ సర్వీసు ద్వారా 2023లో ఏడు సార్లు.. పుణెలోని హింజ్వాడీ చిరునామాకు ఫెడెక్స్‌ కొరియర్‌ సర్వీసు ద్వారా మూడు సార్లు పార్సిళ్లలో డ్రగ్స్‌ అందాయి. ఇలా తెప్పించిన డ్రగ్స్‌ను ఈ ముఠా హైదరాబాద్‌కు తరలించేదని నిర్ధారించారు.


పార్సిల్‌ చిరిగి వెలుగులోకి..

ఈ ఒక్క కేసే కాకుండా.. గత ఏడాది డిసెంబరులో విశాఖపట్నం నుంచి ఢిల్లీకి డీటీడీసీ కొరియర్‌ ద్వారా మాదకద్రవ్యాలను పంపుతున్న ఓ ముఠాను ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ ఏజెన్సీల్లో గంజాయి కొనుగోలు చేసే ఈ ముఠా.. శ్రీహరిపురంలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడి నుంచి చేతి తొడుగుల వ్యాపారం ముసుగులో గంజాయిని ఢిల్లీకి పంపించేది. ఓ సారి ఢిల్లీకి పంపిన ఒక పార్సిల్‌కు సంబంధించి చిరునామా సరిగా లేకపోవడంతో తిరుగుటపాలో వచ్చింది. ఆ సమయంలో పార్సిల్‌ చిరిగిపోవడంతో అందులోని గంజాయి బయటపడింది. దీంతో.. ఈ ముఠా గుట్టురట్టయింది. గత ఏడాది కేరళలోని కోచి కేంద్రంగా విదేశాల నుంచి కొరియర్‌ ద్వారా డ్రగ్స్‌ తెప్పించుకుంటున్న ముఠాను అక్కడి పోలీసులు అరెస్టుచేశారు. దాదాపు పది కొరియర్‌ కంపెనీల ద్వారా ఈ పార్సిళ్లు రావడంతో.. అక్కడి పోలీసులు కొరియర్‌ కంపెనీల ఏజంట్లతో సమావేశం నిర్వహించి, అనుమానాస్పద పార్సిళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. మహరాష్ట్రలో ఏటా రూ.వందల కోట్ల డ్రగ్స్‌ పట్టుబడుతుంటే.. అందులో కొరియర్‌ సర్వీసుల ద్వారా విదేశాల నుంచి వస్తున్నవి ఎక్కువగా ఉన్నాయని ఆ రాష్ట్ర హోంమంత్రి గత ఏడాది విధానసభలో ప్రస్తావించారు.


యాక్షన్‌లోకి టీజీ-న్యాబ్‌

డ్రగ్స్‌ డోర్‌ డెలివరీ ఉదంతం నేపథ్యంలో టీజీ-న్యాబ్‌ అప్రమత్తమైంది. కొరియర్‌ కంపెనీలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసి, అనుమానాస్పద పార్సిళ్లను గుర్తించేలా వారికి ఆదేశాలు జారీ చేయనున్నట్లు టీజీ-న్యాబ్‌ డైరెక్టర్‌ సందీప్‌ శాండిల్య తెలిపారు. 2016లోనూ డార్క్‌ వెబ్‌లో ఆర్డరిస్తే.. కొరియర్‌లో విదేశాల నుంచి సికింద్రాబాద్‌కు డ్రగ్స్‌ డెలివరీ అయిన ఉదంతాలున్నాయి. అప్పట్లో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌గా ఉన్న అకున్‌ సభర్వాల్‌ కొరియర్‌ సంస్థలతో సమావేశం ఏర్పాటు చేసి, అప్రమత్తంగా లేకుంటే.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి

No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం

Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ

Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా

Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..

Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం

శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు

కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ

For Telangana News And Telugu News

Updated Date - Apr 07 , 2025 | 04:44 AM