Cisco AP Projects: సిస్కో నుంచి రవీంద్రారెడ్డి ఔట్
ABN , Publish Date - Apr 01 , 2025 | 03:59 AM
టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులు పెట్టిన ఇప్పాల రవీంద్ర రెడ్డిని సిస్కో సంస్థ ఏపీ ప్రాజెక్టుల నుంచి తప్పించింది. మంత్రి నారా లోకేశ్ జోక్యంతో సిస్కో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది

రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి పక్కన పెట్టిన సంస్థ
ఇటీవల సిస్కో బృందంతో లోకేశ్ వద్దకు రవీంద్ర
గతంలో టీడీపీ నేతలపై దూషణలు చేసిన ఇప్పాల
విషయం తెలిసి సీరియస్ అయిన లోకేశ్
సిస్కో యాజమాన్యానికి మంత్రి ఓఎస్‌డీ లేఖ
అమరావతి, మార్చి 31(ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో టీడీపీ నేతలపై అసభ్యకర పోస్టులతో చెలరేగిపోయిన ఇప్పాల రవీంద్ర రెడ్డిని సిస్కో యాజమాన్యం రాష్ట్ర ప్రాజెక్టుల నుంచి పక్కన పెట్టింది. గత నెల 25న సిస్కోతో ఏపీ ప్రభుత్వం సిస్కోతో ఒప్పందం చేసుకుంది. ఆ సమయంలో రవీంద్ర రెడ్డి కూడా అక్కడ ప్రత్యక్షమయ్యారు. సిస్కోలో టెరిటరీ సేల్స్ మేనేజర్‌గా చేస్తున్న రవీంద్రరెడ్డి సదరు సమావేశం సమన్వయ బాధ్యతలు చూశారు. లోకేశ్‌తో కలిసి ఫొటోలు దిగారు. ఈ వ్యవహారంపై టీడీపీ కార్యకర్తలు సామాజిక మాధ్యమాల వేదికగా భగ్గుమన్నారు. రవీంద్రారెడ్డి నిజస్వరూపాన్ని బట్టబయలు చేస్తూ.. ఆయన వైసీపీ హయాంలో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబుతోపాటు మంత్రి లోకేశ్, హోం మంత్రి వంగలపూడి అనిత, పలువురు పార్టీ నేతలపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులను లోకేశ్ ‘ఎక్స్’ ఖాతాకు ట్యాగ్ చేశారు. దీంతో లోకేశ్ ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్నారు. వెంటనే సిస్కో ప్రతినిధులతో మాట్లాడి, రవీంద్రారెడ్డి ఇకపై ఏపీకి సంబంధించిన ప్రాజెక్టుల్లో పాల్గొనకుండా చూడాలని తన పేషీ అధికారులను ఆదేశించారు.
లోకేశ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన మంత్రి ఐటీ విభాగం ఓఎ్‌సడీ వినాయకసాయి చైతన్య సిస్కో యాజమాన్యానికి ఘాటుగా లేఖ రాశారు. గతంలో టీడీపీ నేతల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా రవీంద్ర రెడ్డి పెట్టిన అసభ్యకరమైన పోస్టుల ను ఆ లేఖకు జత చేశారు. ‘‘రవీంద్ర రెడ్డికి ఏపీలో సిస్కో చేపట్టిన ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లే సామర్థ్యం ఉందని మేం భావించడం లేదు. ఏపీలో చేపట్టేబోయే ఏ ప్రాజెక్టులోనూ ఆయనను భాగస్వామి చేయవద్దు’’ అని సిస్కో యాజమాన్యాన్ని ఆ లేఖలో కోరారు. దీనిపై స్పందించిన సిస్కో యాజమాన్యం రవీంద్ర రెడ్డిని ఏపీ ప్రాజెక్టుల నుంచి తప్పించినట్లు సోమవారం లోకేశ్ పేషీకి సమాచారం ఇచ్చింది.
Read Latest AP News And Telugu News